ఏపీలో కాంగ్రెస్‌ దుకాణం బంద్‌

By Jaswanth.T Sep. 18, 2020, 04:00 pm IST
ఏపీలో కాంగ్రెస్‌ దుకాణం బంద్‌

నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ దుకాణం మూసేసినట్టేనన్న అభిప్రాయం సామాన్య జనంలో ఉంది. కేంద్రంలోనే ఆపసోపాలు పడుతున్న ఆ పార్టీ ఏపీలో ఉనికి కూడా ఎక్కడా కన్పించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామే అయి అధికార దర్పాన్ని ప్రదర్శించిన నేతలెవ్వరూ ఇప్పుడు కనీసం ఆ పార్టీ కండువాను కప్పుకుని జనబాహుళ్యంలోకి వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదన్నది రాజకీయవర్గాల టాక్‌. ఆయా నాయకుల వ్యవహారశైలి కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా చేసిన రెండు తప్పుల ప్రభావం ఇంకా ఆ పార్టీని వెన్నాడుతోందన్నది వారి వివరణ. ఒకటి వైఎస్‌ జగన్‌ని దూరం చేసుకోవడం కాగా, రెండోది ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం. ఈ రెండు కారణాలతోనూ నూటపాతిక సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో కనీసం ఉనికి చాటుకునే స్థితిని కూడా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పీసీసీ అ«ధ్యక్షుడి హోదాలో శైలజానా«ద్‌ చేసే ఒకటి రెండు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌లు తప్పితే, ఇంకే నాయకుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ వాణిని రాష్ట్రంలో విన్పించే ప్రయత్నం చేయడం లేదు.

ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలుగా భావిస్తున్న పార్టీలే ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న వేళ తాము చేయగలిగిందేమీ లేదన్నది కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల బలమైన అభిప్రాయంగా ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉండగా అన్నీ అనుభవించిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేయడానికి ఇదే ముఖ్య కారణంగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, ఆ పదవి నుంచి వైదొలగిన రఘువీరారెడ్డి లాంటి సీనియర్‌ నాయకులు కూడా తమ సొంత గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆ పార్టీ ఏపీలో మనుగడపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కేంద్ర స్థాయిలో దశాదిశా లేని నాయకత్వం, ఇక్కడ బలమైనఓటు బ్యాంకు మొత్తం చేజారి పోవడం, ఏదైనా కార్యక్రమం చేపడదామంటే కనీసం జెండా కట్టే కార్యకర్తలు కూడా లేని పరిస్థితి వెరసి ఆ పార్టీనాయకుల్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసినట్టుగా సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. అలవిగాని చోట అధికులం అనరాదు.. అన్న పెద్దల సూక్తిని దృష్టిలో పెట్టుకుని దాదాపుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా అజ్ఞాతవాసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అక్కడక్కడా ఉన్న కరడు గట్టిన కాంగ్రెస్‌ అభిమానులు మాత్రం ‘కాంగ్రెస్‌కు చావులేదు.. ఎప్పుడైనా పుంజుకుంటుంది’ లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే దాదాపు ఏడెనిమిదేళ్ళుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నవారిని కాపాడుకోవడం మాట అటుంచి, కొత్త వారిని ఆకట్టుకునే అకాశం లేకుండా పోయింది. పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు తలో పార్టీవైపు చూస్తున్నారు. ఓటు బ్యాంకు మొత్తం అక్కరకు రాని పరిస్థితి. వెరసి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ‘పురావస్తు’ జాబితాలోకి చేరిపోయినట్టేనన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. ఆ పార్టీకి అక్కడక్కడా ఉన్న అభిమానులకు నొప్పి పుట్టేదే అయినా ఇది వాస్తవమైన విషయమేనన్నది విశ్లేషకుల భావన.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp