రాజకీయ ‘కోడి’ విజయం ఎవరికో..

By Jaswanth.T Jan. 11, 2021, 10:00 am IST
రాజకీయ ‘కోడి’ విజయం ఎవరికో..

సంక్రాంతి వస్తుదంటే కొత్త అల్లుడొచ్చే ఇంటి వాళ్ళుఎంతగా హైరానా పడుతుంటారో.. అంత కంటే ఎక్కువగా కోనసీమ వాసులు ఆదుర్దా పడతారంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలు, బంధువులు, స్నేహితులతో కోనసీమలోని ప్రతి ఇల్లూ పండుగ వాతావరణాన్నే తలపిస్తుంటుంది. అలా తరలివచ్చిన వాళ్ళకు ఈ ప్రాంతంలో కోడిపందాలు కూడా పండుగ వేడుకలను తలపింపజేస్తాయి. చారిత్రక కాలం నుంచీ కొనసాగుతున్న ఈ కోడిపందాలు రాన్రాను రాజకీయ పందాలుగా మారిపోయాయన్న ఆరోపణ కూడా లేకపోలేదు. అధికారంలో ఉన్న పార్టీకి ఈ పందాల నిర్వహించుకునే విధంగా చేయాల్సి రావడం ఒక బలవంతపు పనిగా మారిపోతోంది. వద్దంటే ప్రజలతో ఇబ్బంది, చేయండి అంటే చట్ట వ్యతిరేకం కావడంతో ప్రజాప్రతినిధులు కక్కాలేక మింగాలేని పరిస్థితులను ఎదుర్కొంటుంటారు.

వీటి నిర్వహణ విషయంలో ఎంత ప్రత్యర్ధులుగా ఉన్న ఏ రాజకీయ పార్టీలైనా నోరుమెదపలేని పరిస్థితి నెలకొందంటే కోడిపందం పట్ల ఈ ప్రాంత వాసులు ఎంత మక్కువ చూపుతారో అర్ధం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఒక్కో సాంప్రదాయానికి ఒక్కో క్రీడ ప్రముఖంగా కన్పిస్తుంటుంది. తమిళనాడుకు జల్లికట్టు మాదిరిగా కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి అంటే ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధీటుగానే కోడిపందాలకు సన్నాహాలు కూడా జరుగుతుంటాయి. పక్షి ప్రేమికుల వాదనలు ఎలా ఉన్నాగానీ కోడి పందాల పట్ల ప్రతి యేటా ఆసక్తి పెరుగుతూనే వెళుతోంది.

మూడు జిల్లాల్లోనే అధికం..

సంక్రాంతి కోడి పందాలకు పశ్చిమగోదావరి, తూర్పు, కృష్ణా జిల్లాలను పేరుగా చెబుతుంటారు. అంతకు తగ్గట్టుగానే ఇక్కడ బరులు కూడా సిద్ధమవుతుంటాయి. పదెకరాలకుపైగా విస్తీర్ణంలో సిద్ధమయ్యే బరులు ఈ మూడు జిల్లాల్లోనూ 30–50 వరకు ఉంటాయని ఒక అంచనా. ఈ యేడాది సంబరాలు పూర్తయిన వెంటనే వచ్చే యేటా సంబరాల కోసం సన్నాహాలకు సిద్ధమవుతుంటారంటే ఇక్కడి ఏర్పాట్లు ఎంత పకడ్భంధీగా కొనసాగుతాయే అర్దమైపోతుంది. సాంప్రదాయ బద్దంగా కత్తి కట్టకుండా వేసే పందాలకకు కోర్టులు కూడా మినహాయింపులిచ్చాయి. అయితే ఈ తరహా పందాలు జరిగేది తక్కువనే చెప్పాలి. కోడి కాలికి కత్తికట్టి క్షణాల వ్యవధిలోనే పందెంలో ఫలితం తేలిపోయేట్టుగా జరిగే పందాల పట్ల భారీ ఆసక్తే ఉంటుందిక్కడ.

డేగ, పండుడేగ, కాకి, నెమలి, సేతువ, మైల.. తదితర పేర్లతో పిలిచే పందెం కోళ్ళను దాదాపు యేడాదిగా శిక్షకులు సిద్ధం చేసి బరుల్లోకి దింపుతారు. దాదాపుగా ఈ మూడు జిల్లాల్లోనూ సంక్రాంతికి జరిగే కోడిపందాల్లో సుమారు వంద కోట్ల వరకు నగదు చేతులు మారుతుందని ఒక అంచనా. ఈ పందాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.

అనుమతుల్లేవు..

కాగా ప్రతి యేడాది మాదిరిగానే ఈయేడాది కూడా కోడి పందాలకు అనుమతుల్లేవు. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌ నేపథ్యంలో హైకోర్టు ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ప్రతి యేటా మాదిరిగానే పోలీస్‌లు చూసీ చూడనట్టు వ్యవహరిస్తారన్న ధీమానే పందెపు రాయుళ్ళు ఇప్పటికే వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే ఎక్కడికక్కడే పెద్దపెద్ద బరులు సిద్ధమైనట్లుగా ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ సారి కోడి పందాలపై ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంటు కూడా దృష్టి కేంద్రీకరించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. లక్షలు, కోట్లలో పందాలు కాసే వారిని గుర్తించి, అప్పటికప్పుడు దాడులు చేయకపోయినా, ఆ తరువాత వారి కోసం స్పెషల్‌క్లాస్‌ ట్రీట్‌మెంట్‌లు సిద్ధం చేయాలని ఆ శాఖ ప్రణాళికలతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే కోవిడ్‌ కారణంగా సామూహిక ఉత్సవాలు, వేడుకలకు పరిమితంగానే జనాన్ని అనుమతిస్తున్నారు. అందుకు భిన్నంగా కోడిపందాల నిర్వహణ సాగుతుందా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అంతే కాకుండా ఇప్పుడు ఇన్‌కం టాక్స్‌ దాడులు గట్రా అంటే వీటి ప్రభావం కారణంగా ఈ యేడాది కోడిపందాల కళ తగ్గడం ఖాయమన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యేడాది రాజకీయ కోడి విజయాన్ని ఎవరికి అందిస్తుందో వేచి చూడాల్సిందేనంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp