YS Jagan - ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

By Aditya Oct. 21, 2021, 08:13 pm IST
YS Jagan - ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

తమ అసంబద్ద ఆరోపణలతో, తిట్ల పురాణంతో రాష్ట్రం పరువు తీయడమే కాక శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్న ప్రతిపక్ష నాయకుల రాజకీయ క్షుద్ర క్రీడకు ఇక తెర పడనుంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అయనే స్వయంగా రంగంలోకి దిగి ఈ విషయంపై దృష్టి సారించడంతో పచ్చ నాయకుల వీరంగాలు ఇక సాగవని భావించవచ్చు.

కుట్ర పూరితంగానే..

ఒక పథకం ప్రకారం కొన్ని నెలలుగా ప్రభుత్వంపై టీడీపీ నాయకులు నిరాధారమైన, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అనాగరికమైన భాషలో, సభ్య సమాజం రాయడానికి, ఉచ్చరించడానికి ఇష్టపడని పదజాలంతో ముఖ్యమంత్రిని, మంత్రులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారంతో ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయని, జగన్మోహన్రెడ్డి అసమర్థ సీఎం అని కొన్ని బూతులు కూడా జోడించి మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ మధ్య విమర్శలు చేశారు. ఇది రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. దానిపై పోలీసులు అయ్యన్నకు నోటీసులు జారీ చేశారు. అయినా తగ్గకుండా ఆయన అవే ఆరోపణలను, అదే అనాగరికమైన భాషతో మళ్లీ మళ్లీ చేస్తున్నారు. దానికి ఆ పార్టీ నేతలు దూలిపాళ్ల నరేంద్ర, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, యలమంచిలి రాజేంద్రప్రసాద్ తదితర నాయకులు వంత పాడుతున్నారు. అధికార పార్టీ నాయకులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ఒక వ్యూహం ప్రకారం ఈ బూతు పురాణం కొనసాగించారు.

డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిందంటూ వాగుడు..

గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టు పడింది మొదలు ఆ పార్టీ నేతలు మరీ రెచ్చిపోతున్నారు. సుమారు రూ. 21 వేల కోట్ల హెరాయిన్ అక్కడ పట్టుబడగానే డ్రగ్స్ రాకెట్ కు ముఖ్యమంత్రికి సంబంధం ఉందని ఆరోపణలు గుప్పించేశారు. చంద్రబాబు, లోకేశ్ తదితర నాయకులు ఇవే ఆరోపణలను వల్లించారు. రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారి పోయిందని, ఇక్కడి యువత మత్తులో జోగుతున్నారని నోటికొచ్చినట్టు వాగేశారు. తమ పచ్చ మీడియాలోనూ ఈ విషయంపై రచ్చ రచ్చ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను అవమానించడమే కాక వారి తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీశారు. రాష్ట్రానికి, డ్రగ్స్ కు ఎటువంటి సంబంధం లేదని అటు కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇటు రాష్ట్ర పోలీసు శాఖ చెప్పినా వినిపించుకోకుండా పదే పదే అవే ఆరోపణలు చేసి రాష్ట్రం పరువు తీయడమే కాకుండా ముఖ్యమంత్రిని కించపరిచారు.

Also Read : Chandrababu Naidu - డామిట్ కథ అడ్డం తిరిగిందే?

సంయమనం పాటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి..

ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు కనీస విలువలు పాటించకుండా ముఖ్యమంత్రిని, డీజీపీని వ్యక్తిగతంగా పరుష పదజాలంతో విమర్శిస్తూ కవ్వించినా సీఎం జగన్మోహన్రెడ్డి సంయమనం పాటించారు. అటు పార్టీ నాయకులను, ఇటు పోలీసులను కూడా సంయమనం పాటించాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని సరిపెట్టుకున్నారు.

పట్టాభి వాడిన భాషతో ఆగ్రహం..

మాజీమంత్రి నక్కా ఆనందబాబు అధికార పార్టీ నాయకులకు గంజాయి స్మగ్లింగ్ తో సంబంధాలు ఉన్నాయని అరోపించడంతో అందుకు ఆధారాలు చూపాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పందించిన తీరు పరమ జుగుప్స కలిగించింది. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని కూడా కించపరుస్తూ పట్టాభి వాడిన భాష రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణం అయ్యింది. తమ ప్రియతమ నేతను దూషించడాన్ని తట్టుకోలేక పోయిన పార్టీ నాయకులు, అభిమానులు టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి తమ నిరసన తెలిపారు. ఈ ఘటన ఆధారంగా చంద్రబాబునాయుడు తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టారు. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. 36 గంటల దీక్ష అని, కేంద్ర హోంమంత్రితో అపాయింట్‌మెంట్‌ అంటూ హడావిడి చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలని కూడా అడ్డగోలుగా డిమాండ్‌ చేస్తూ అథమ స్థాయి రాజకీయం చేస్తున్నారు.

Also Read : Nara Lokesh - అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!

రంగంలోకి దిగిన సీఎం..

మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రిని, డీజీపీని తిట్టి రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ఆందోళనలకు దిగడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తనను ఎంతగా దూషించినా పట్టించుకోని ముఖ్యమంత్రి తన తల్లిని కూడా దూషించడమే కాక నీచమైన రాజకీయానికి దిగిన తెలుగుదేశం నాయకుల వైఖరితో మనస్థాపం చెందారు. అభివృద్ధి, సంక్షేమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా, పార్టీ, కుల, మత, వర్గాలకు అతీతంగా పనిచేస్తుంటే ఈ నిందలేమిటని ఆయనకు కోపం వచ్చింది. అందుకే నిన్న జగనన్న తోడు వడ్డీ సొమ్ముల విడుదల సందర్భంగా జరిగిన సభలో కాని, ఈరోజు పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో కాని మాట్లాడుతూ పోలీసులు ఇకపై ఇటువంటి అంశాలను సహించవద్దని స్పష్టం చేశారు. రాష్టంలో రాజకీయ రూపం తీసుకున్న అరాచక శక్తులను ఉపేక్షించవద్దని విస్పష్టంగా చెప్పారు. తరతమ భేదం లేకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ విడిచిపెట్టవద్దని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణకు టాప్‌ ప్రయార్టీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇక పచ్చ బ్యాచ్‌ ఆటకు అడ్డుకట్ట..

తిరుపతిలో అన్యమత ప్రచారం, అంతర్వేదిలో రథం దగ్దం, దేవతా విగ్రహాల కూల్చివేత వంటి అంశాల ఆధారంగా అలజడులు సృష్టించినా, సీఎం, డీజీపీపై వ్యక్తిగత దూషణలకు దిగినా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఇన్నాళ్లూ సంయమనం పాటించారు. ఆయనే స్వయంగా ఆదేశించడంతో బరితెగించి రాజకీయ ఉగ్రవాదులుగా మారిన పచ్చ పార్టీ నాయకుల ఆరాచకానికి పోలీసులు అడ్డుకట్ట వేయనున్నారు. కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై కొరడా ఝళిపించనున్నారు. తమ ప్రియతమ ముఖ్యమంత్రిని దూషిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు చూస్తూ ఊరుకోవడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఈ క్షుద్ర రాజకీయానికి చరమ గీతం పాడాలని నిర్ణయించుకున్నందున ఇకపై రాష్ట్రంలో ఈ పచ్చ రాజకీయ కాలుష్యం తగ్గుతుందని జనం కూడా భావిస్తున్నారు. ఉచ్చ నీచాలు మరచి రాజకీయం చేస్తున్న టీడీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. అందుకే నిన్న టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌ను జనం స్వాగతించారు. అసలు కుట్రదారులైన చంద్రబాబు, లోకేశ్‌, నోరుపారేసుకున్న ఇతర నాయకులను కూడా అరెస్ట్‌ చేసి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.

Also Read : CM YS Jagan - అల్టిమేట్టం జారీ చేసిన సీఎం జగన్‌.. ఇక గీత దాటితే ఇబ్బందులు తప్పవా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp