గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

By Karthik P Jan. 04, 2021, 08:40 pm IST
గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌తో సమావేశమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వారిద్దరు 40 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.

ఇటీవల ఏపీలో జరిగిన దేవాలయాలపై దాడులు, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌తో భేటీ అవడం చర్చనీయాంశమవుతోంది. ఆయా ఘటనలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా, రామతీర్థం ఘటనను సీఐడీ చేత విచారణ చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం, రాజకీయ వివాదానికి దారితీసిన ఈ ఘటనకు బాధ్యులైన వారిని వీలైనంత వేగంగా పట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రోజు దేవాదాయ, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. ఈ మేరకు సీఐడీ విచారణపై నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో రాముడి విగ్రహం పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp