ల‌క్ష్యం కోసం వ్యూహం మార్చిన జ‌గ‌న్

By Kalyan.S Nov. 23, 2020, 08:10 am IST
ల‌క్ష్యం కోసం వ్యూహం మార్చిన జ‌గ‌న్

మంచి చేయాల‌నే ఆలోచ‌న ఉంటే అందుకు ఎన్నో మార్గాలు. అందుకు కావాల్సింద‌ల్లా చిత్త‌శుద్ధి. అత్య‌ధిక మంది రాజ‌కీయ నాయ‌కుల‌కు అదే క‌రువవుతోంది. పేరు కోస‌మో, ప్ర‌చారం కోస‌మో ఏదైనా ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టినా, కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టినా ఏదైనా అడ్డంకి ఎదురైన‌ప్పుడు.. షాక్ దొరికింద‌ని సంతోష‌ప‌డి ఆ కార్య‌క్ర‌మాల‌ను ఆపేసిన వారు చాలా మంది ఉన్నారు. ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌లు గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో చాలానే జ‌రిగాయి. కానీ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ భిన్న ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్తున్నారు. ప్ర‌చారం కోస‌మో, పేరు కోస‌మో కాకుండా కేవ‌లం ప్ర‌జ‌ల కోస‌మే ఆయ‌న ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నారు. అమ‌లులో ఏమైనా అడ్డంకులు ఎదురైతే వాటిని అధిగ‌మించి ముందుకు వెళ్తున్నారు. అయితే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీకి సంబంధించి ప్ర‌తిప‌క్షాలు సృష్టిస్తున్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న ప్ర‌తిసారీ కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాయి. అనుకూల‌మైన తీర్పుల కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు.

ఆ ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధం

కోర్టు కేసులు, వివాదాలు లేని చోట్ల పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీకి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ముహూర్తం కూడా నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఒకేసారి 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. వివాదాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మొదటి దశలో 15 లక్షల మందికి స్థ‌లాలు పంపిణీ చేయ‌నుంది. స్థ‌లాల‌తో పాటు ఇళ్లు కూడా నిర్మించేందుకు గృహ నిర్మాణ సంస్థ అవసరమైన కసరత్తు ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా అధికారులు వస్తువులు కొనుగోలు చేయనున్నారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుముతో పాటు పెద్ద ఎత్తున మెటల్, రంగులు (పెయింట్‌) అవసరం కావడంతో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వాటిని సేకరించేందుకు అధికారులు విధి విధానాలు తయారు చేస్తున్నారు. డిసెంబర్‌ 25వ తేదీన ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో అదే రోజు ఇంటి మంజూరు పత్రాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నారు. పట్టాలు మంజూరైన పేదలందరికీ గృహాలు నిర్మిస్తారు. నాణ్యమైన నిర్మాణ సామగ్రి, మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి లబ్ధిదారులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లే అవుట్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచి నీరు, విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

నాణ్య‌త‌కు ప్రాధాన్యం

ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ప్రారంభం మొదలు వారి ఖాతాలకు బిల్లులు జమ అయ్యే వరకు గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో పని చేస్తున్న డిజిటల్, వెల్ఫేర్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో పాటు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజినీర్లు, తాపీ పని చేసే వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకు గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేలా తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ల వివరాలను ఇప్పటికే గ్రామ, పట్టణాల వారీగా సేకరించారు. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు టెక్నికల్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp