తల పట్టుకున్న ముఖ్యమంత్రి..!

By Srinivas Racharla Oct. 10, 2021, 03:15 pm IST
తల పట్టుకున్న ముఖ్యమంత్రి..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీ తక్కెడతో సామాజిక వర్గాలను తూచి మరీ అన్ని వర్గాల వారిని మచ్చిక చేసుకునేందుకు మొన్నటి క్యాబినెట్ విస్తరణ చేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ లఖీంపూర్ ఖేరిలో రైతుల నరమేధ ఘటన తాజాగా యోగి సర్కార్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆరాటపడుతున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్‌కు లఖీంపూర్ ఖేరీ వ్యవహారం తలనొప్పిగా మారిపోయింది. యోగి ప్రభుత్వం రాష్ట్రంలో బ్రాహ్మణుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఆ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద కి మంత్రి పదవి కట్టబెట్టింది.అలాగే కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ లఖీంపూర్ ఎంపీ అజయ్ మిశ్రా హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే బ్రాహ్మణులను సంతృప్తి పరిచే కోటాలో కేంద్రమంత్రి అయిన అజయ్ మిశ్రా కుమారుడే ఇప్పుడు లఖీంపూర్ రైతుల హత్యోదంతానికి కారకుడు కావడంతో యోగీ సర్కార్ తలపట్టుకుంటోంది.

Also Read : ఓ బషీర్‌భాగ్, ఓ నిర్భయ, ఓ లఖీంపూర్‌..

ఇప్పటికే యూపీలో యోగీ సర్కార్ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది.తాజాగా రైతులపై చోటు చేసుకున్న కేంద్రమంత్రి కుమారుడి దాష్టికంతో బీజేపీ తీవ్ర చిక్కుల్లో పడింది.శాంతియుతంగా రోడ్డుపై ప్రదర్శనగా వెళ్తున్న ఆ ప్రాంత రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడి కాన్వాయ్‌లోని కారు దురుద్దేశ పూర్వకంగానే దూసుకు పోయినట్లు వీడియో ద్వారా స్పష్టమైంది.నలుగురు రైతులను బలిగొన్న ఘోరం ఒక పథకం ప్రకారం జరిగిందేనని వైరల్‌గా మారిన వీడియో ద్వారా నిర్ధారణ అయింది.

బీజేపీకి వెన్నుదన్నుగా టెరాయ్ ప్రాంతం..కానీ..!

యూపీలోని లఖీంపూర్ ఖేరీ లోక్ సభ సీటు టెరాయ్ ప్రాంతం పరిధిలోకి వస్తుంది.ఇక్కడ ఆరు జిల్లాలు ఉండగా వాటిలో సిక్కు రైతుల గణనీయమైన సంఖ్యలో ఉంటారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో టెరాయ్ ప్రాంతం ఏకపక్షంగా బీజేపీకి పట్టం కట్టింది. ఇక్కడ ఉన్న 42 స్థానాలలో బీజేపీ ఏకంగా 37 సీట్లు కైవసం చేసుకుంది.కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోరాడిన సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లురాగా బీఎస్పీకి ఒక స్థానం దక్కింది.కాంగ్రెస్‌కు మాత్రం ఖాళీ చేతులు మిగిలాయి. కానీ లఖీంపూర్ ఖేరీ ఘటనతో వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి తలకిందులు అయ్యే అవకాశం ఉందనే భయాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి.

Also Read : యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన

ఇక యుపిలోని అతిపెద్ద జిల్లా అయిన లఖీంపూర్ ఖేరీ విషయానికి వస్తే 2012 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.అయితే 2017 ఎన్నికలలోఈ జిల్లాలోని మొత్తం ఎనిమిది స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది.అన్ని స్థానాలను కొల్లగొట్టడమే కాకుండా 2012 - 2017 మధ్య బీజేపీ తన ఓట్ల శాతంను కూడా భారీగా పెంచుకుంది. గోలా గోకరనాథ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కమలం పార్టీ ఓట్ల శాతం 3.88% నుండి 49 శాతానికి పెరిగింది. కాస్తా (SC సీటు) లో ఓట్ల శాతం 7.36% ఓట్ల నుండి 44% ఓట్లకి పెరిగింది.ధౌర్రాలో 5.89% నుండి 36% వరకు,పాలియాలో 11.34% నుండి 51శాతానికి పెరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంభవించిన లఖీంపూర్ రైతుల మరణాలు ప్రస్తుతం బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఢిల్లీలో రైతుల ఆందోళన మొన్నటి వరకు యుపిలో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ లఖీంపూర్ ఖేరీ సంఘటనతో రైతులు బీజేపీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ ప్రాంత రైతులకి వ్యవసాయేతర వర్గాల నుండి భారీగా సానుభూతి లభిస్తోంది.ఇదే ఇప్పుడు పాలక బీజేపీని కలవరపరుస్తోంది.దీంతో లఖీంపూర్ రైతుల ప్రాణాలను హరించిన ఘటన టెరాయ్ పరిధిలో ఉన్న ఆరు జిల్లాల్లో బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టేలా కనిపిస్తోంది.

Also Read : కేంద్ర మంత్రి మాట‌లు అవాస్త‌వ‌మేనా? రైతుల మృతికి కారకులెవరు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp