ఇది జగన్ సృష్టించిన రెండో అద్భుతం 

By Krishna Babu Jan. 20, 2021, 06:23 pm IST
ఇది జగన్ సృష్టించిన రెండో అద్భుతం 

కొన్ని నెలల క్రితం ఓ అద్భుతం మన కళ్ళ ముందు సాక్షాత్కారం అయింది. విజయవాడ బెంజి సెంటర్ నుండి వెయ్యి అంబులెన్సులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. ప్రపంచం అంతా కరోనా వ్యాధితో హడలెత్తి పోతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో బెజవాడ బెంజి సెంటర్ లో నడిపించిన ఈ వెయ్యి వాహనాలు ప్రపంచాన్ని ఒక్కసారి అవాక్కయ్యేలా చేశాయి. ఓ భరోసా కలిగించాయి. 

మళ్ళీ ఇప్పుడు అలాంటి అద్భుతాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రపంచానికి అందించబోతున్నారు. ఒకే రోజు 9,260 వాహనాలను రోడ్డుపై నడిపించబోతున్నారు. ఈ వాహనాలు ప్రస్తుతం గ్రామాల్లోని నిరుద్యోగ యువత నడపబోతున్నారు. వీటి ద్వారా రేషన్ కార్డు దారులకు నెలనెలా రేషన్ సరుకులు లబ్ధిదారుల గడప వద్దకే అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 9,260 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్దిదారులకు ఇకపై రేషన్ షాపు వరకూ వెళ్ళి, సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆ సరుకులను ఈ నిరుద్యోగ యువత అందించబోతోంది. 

తొమ్మిదివేల వాహనాల కొనుగోలు. తొమ్మిదివేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి. లక్షల మంది లబ్దిదారులకు గడపవద్దకే రేషన్. సాధారణంగా ఇవన్నీ అనూహ్యమైన విజయాలు. ఇందులో ఒక్కొక్కటి రాజకీయంగా గొప్పగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అయినా, సాదా సీదాగా, ప్రచార ఆర్భాటాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నారు.

రాష్ట్రంలోని తొమ్మిదివేలమంది నిరుద్యోగ యువకులు ఈ వాహనాలకు రేపటినుండి యజమానులు కాబోతున్నారు. ఈ వాహనాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకుని నెలనెలా కొంత అద్దె చెల్లిస్తుంది. ఒక్కో వాహనం రూ 5.80 లక్షలు కాగా అందులో రూ 3.45 లక్షలు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తోంది. మిగతాది బ్యాంకుల ద్వారా, రుణంగా అందిస్తోంది. ఈ ఋణం మొత్తం నెలనెలా లబ్ధిదారులు తమకు పౌరసరఫరాల శాఖ చెల్లించే అద్దె నుండి చెల్లించాల్సి ఉంటుంది. పౌరసరఫరాల శాఖ ఈ మేరకు ఆరేళ్ళ అద్దె ఒప్పందం చేసుకుంటోంది. 

యువత చేయవలసిందల్లా ప్రతినెలా పౌరసరఫరాల శాఖ అందించే సరుకులు సంబంధిత గ్రామ వాలంటీర్ సహాయంతో లబ్ధిదారుల ఇళ్ళకు చేర్చడం. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆ వాహనాన్ని వారి అవసరాలమేరకు నడిపించడం చేయాల్సి ఉంటుంది. ఇది వారికి స్వయం ఉపాధి కల్పించి బృహత్తర చర్య. అలాగే నెల నెలా సరుకులు గడప ముంగిటకే రావడం లబ్దిదారులకు ఓ వరం. రేషన్ దుకాణం నుండి బియ్యం, పంచదార వంటి సరుకులు తీసుకుని, వాటిని మోసుకుంటూ ఇళ్ళకు చేరడం ముసలి వాళ్ళకు, వికలాంగులకు, మహిళలకు చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆ కష్టం తీరబోతోంది. 

విమర్శించేవారు ఈ వాహనాల కొనుగోలులో ఎంత కమిషన్ తిన్నారు? వాహనాల రంగుల్లో ఎంత కమిషన్ తిన్నారు అని లెక్కలు వేయవచ్చు. లేదా వాహనాలకు అధికార పార్టీ రంగులేంటి అని నిందించవచ్చు లేదా ఈ రంగులపై కోర్టులో కేసు వేయవచ్చు. కానీ ఇదో విప్లవం అని, తొమ్మిదివేల కుటుంబాలను పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య ఒక్కసారిగా తొలిగిపోయిందని గుర్తించడం విమర్శకులకు మింగుడు పడని అంశం. ఆయినా సరే, ఓ తొమ్మిదివేల వాహనాలు ఒక్కసారిగా అలా రోడ్డుపై నడుస్తుంటే రాష్ట్రం ముందుకు పోతున్న విషయం మరుగునపడుతుందా? ప్రపంచం గుర్తించకుండా ఉంటుందా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp