కోవాక్సీన్ పేటెంట్ రద్దు కోరిన జగన్ 

By Kalyan.S May. 12, 2021, 07:30 am IST
కోవాక్సీన్ పేటెంట్ రద్దు కోరిన జగన్ 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి దేశంలో ప్రస్తుతం కోవిడ్  విరుగుడుగా ఇస్తున్న రెండు టీకాల్లో ఒకదాని పేటెంట్ రద్దు చేయాలని కోరి ఓ పెద్ద సంచలనానికి తెరలేపారు. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న కోవాక్సీన్ కు ఉన్న పేటెంట్ రద్దు చేయాలనీ, కోవాక్సీన్ ఉత్పత్తి చేసే అవకాశం ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలకు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ఓ లేఖ రాశారు. 

దేశంలో టీకా ఇవ్వాల్సిన ప్రజలు ఇంకా కోట్ల సంఖ్యలో ఉన్నారని, అయితే కోవాక్సీన్ ఆ స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. కోవాక్సీన్ ను భారత వైద్య పరిశోధన సంస్థ, భారత వ్యాధి నిరోధక సంస్థ సహకారంతో ఉత్పత్తి చేశారని జగన్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో గుర్తు చేశారు. గత ఫిబ్రవరిలో ఈ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇచ్చినప్పటికీ కావలసిన మోతాదులో వాక్సిన్ ఉత్పత్తి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవాక్సీన్ ఉత్పత్తి అవుతున్న తీరు చూస్తే దేశంలోని ప్రజలందరికీ టీకా వేసేందుకు ఎన్నిసంవత్సరాలు పడుతుందో తెలియడం లేదని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం దేశం కోవిడ్ రెండో దశ దాడిని ఎదుర్కుంటోంది, వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ వ్యాధి విస్తరణ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కోవాక్సీన్ పై ప్రస్తుతం ఉన్న పేటెంట్ రద్దు చేసి, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అవకాశం ఈ రంగంలో ఉన్న సంస్థలకు, ఈ రంగంలో ప్రవేశించే ఆసక్తి ఉన్న సంస్థలకు కల్పించాలని జగన్ కోరారు. 

దేశంలో ప్రస్తుతం కోవాక్సీన్ మరియు కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషిల్డ్ ఉత్పత్తి ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ కోవాక్సీన్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా కోవిషిల్డ్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో టీకాల్లో షుమారు 75 శాతం కోవిషిల్డ్ మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రానికి టీకాల కోటా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోవాక్సీన్ ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ సంస్థకు, కోవిషిల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ కు లేఖలు రాశారు. అయితే ఈ లేఖలకు ఎటువంటి స్పందన రాకపోయినప్పటికీ సీరం సంస్థనుండి క్రమం తప్పకుండా కోవిషిల్డ్ టీకాలు రాష్ట్రానికి అందుతూనే ఉన్నాయి. కేవలం కోవాక్సీన్ మాత్రమే అందుబాటులో ఉండడం లేదు. 

ఈ పరిస్థితుల్లో కోవాక్సీన్ ఉత్పత్తి పెంచాలంటే దాని పేటెంట్, సాంకేతిక పరిజ్ఞానం ఇతర సంస్థలకు కూడా అందించి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు వాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే టీకా ఉత్పత్తి వేగంగా పెంచాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కోవాక్సీన్ పేటెంటు ఇతర సంస్థలకు కూడా బదిలీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp