ఏలూరు ఘటనపై సీఎం సమీక్ష.. బాధితులకు ఆరోగ్యశ్రీ బాసట

By Karthik P Dec. 09, 2020, 02:38 pm IST
ఏలూరు ఘటనపై సీఎం సమీక్ష.. బాధితులకు ఆరోగ్యశ్రీ బాసట

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రాష్ట్ర, కేంద్రం నుంచి వచ్చిన వైద్య నిపుణులు, వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలతో సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. బాధితుల సంఖ్య, కొత్తగా నమోదైన వారి వివరాలు, ఈ వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రక్రియ ఎంత వరకు వచ్చింది..? అనే వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

ఇప్పటి వరకు 550 మంది ఈ వింత వ్యాధికి గురవగా.. మెజారిటీ బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారు. ఈ రోజు కొత్తగా 10 మందికి అస్వస్థతతో ఆస్పత్రికి వచ్చారు. శంకరమఠం, తూర్పువీధి, పడమర వీధి ప్రాంతాల నుంచి బాధితులు వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 77 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

సీసీఎంబీ, ఢిల్లీ ఎయిమ్స్‌ సహా వివిధ కేంద్ర పరిశోదనా సంస్థలు ఈ అంతుచిక్కని వ్యాధిపై శోధిస్తున్నారు. తాజాగా ఈ రోజు మూడో సారి 30 మంది నుంచి రక్తనమూనాలను సేకరించారు. బాధితుల రక్తనమూనాల్లో లెడ్‌ (సీసం), నికెల్‌ మూలకాలు ఉన్నట్లు నిన్న ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రాథమికంగా నిర్థారించింది. ఆ మూలకాలు బాధితుల శరీరాల్లోకి ఎలా వచ్చాయ్యన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలు పరిశోధిస్తున్నాయి. బాధితుల ఇళ్లలోని ప్రతి ఆహార పదార్థం నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఆహారం, పాలు, నీళ్ల ద్వారానే సీసం, నికెల్‌ మూలకాలు బాధితుల శరీరాల్లోకి చేరి ఉంటాయన్న ఎయిమ్స్‌ ప్రాథమిక సమాచారంతో ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం శోధిస్తోంది. తాగునీటి ట్యాంకుల నుంచి శాంపిళ్లను సేకరించారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే.. అంతుచిక్కని వ్యాధి ఎందుకు వస్తుందన్న అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

ఇది కరోనా కాదని, మరే అంటు వ్యాధి కాదని తేల్చిన ప్రభుత్వం ప్రజల్లో భయాందోళనలను తొలగించింది. అంతేకాకుండా బాధితులకు ఇచ్చే చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఇప్పటికే ఉన్న ప్యాకేజీలను మెరుగుపరిచింది. ఇంతకు ముందు సాధారణ మూర్ఛ వ్యాధిగ్రస్తుడు మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం సహాయం అందించేది. ప్రస్తుతం ఐదు రోజులపాటు వైద్యం పొందినప్పటికీ ఆ సాయం వర్తింపజేస్తారు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,000 నుంచి రూ.15,688 వరకు పెంచారు. 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపారు. చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,262 నుంచి రూ.12,732కు పెంచారు. 6 రకాల రక్త పరీక్షలను అందులో చేర్చారు. ఐదు రోజులకు మించి అదనంగా చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి రూ.2,000 ప్యాకేజీని కొత్తగా చేర్చారు. నూతన విధానం మేరకు రక్త పరీక్షలకు 23.73 శాతం రేటు పెంచారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp