పెద్దవాగు ప్రమాద మృతులకు మూడు లక్షల ఆర్థికసాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

By Kiran.G Oct. 29, 2020, 08:02 am IST
పెద్దవాగు ప్రమాద మృతులకు మూడు లక్షల ఆర్థికసాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేటలో ఆరుగురు యువకులు పెద్దవాగులోపడి మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా బాధిత కుటుంబాలకు మూడులక్షల రూపాయల వంతున 18 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

అసలేం జరిగింది?

ప్రతీ ఏడాది భూదేవిపేటకు చెందిన కొన్ని కుటుంబాలు వసంతవాడకు దగ్గర్లోని పెదవాగు వద్ద వనభోజన మహోత్సవం జరుపుకుంటాయి. ఈ ఏడాది కూడా వనమహోత్సవం జరుపుకోవడానికి బుధవారంనాడు పెద్ద వాగు ప్రాంతానికి వెళ్లాయి. పెద్దలంతా ఉత్సాహంగా వంటలు చేస్తున్న సమయంలో, ఐదుగురు స్నేహితులు కలిసి పెద్దవాగులో ఈత కొట్టడానికి వెళ్ళారు. కాగా వీరిలో ఏ ఒక్కరికీ ఈత రాకపోవడంతో వాగులో మునిగిపోయారు. కెల్లా భువన్‍(18), కూనారపు రాధాకృష్ణ(17), గంగాధర వెంకట్రావ్‍(17), గొర్తిపర్తి మనోజ్‍(17), కర్నాటి రంజిత్‍(16) వాగులో మునిగిపోతున్న సమయంలో కేకలు వేయడంతో వారిని కాపాడటానికి ప్రయత్నం చేసిన శ్రీరాముల శివాజీ(18) కూడా వాగులో గల్లంతయ్యాడు.

యువకులు మునిగిపోవడం చూసి పెద్దలు కొందరు స్థానికులతో కలిసి వాగును గాలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కుక్కునూరు సీఐ బాలసురేశ్, ఎస్‌ఐ సుధీర్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు.పోలీసులు స్థానికులు వాగును పూర్తిగా గాలించి మునిగిపోయిన ఆరుగురి యువకుల మృతదేహాలను బయటకు తీశారు. భూదేవిపేటకు చెందిన ఆరుగురు ఒకేసారి చనిపోవడంతో పలువురి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధికారులను అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి రూ.5 వేల వంతున ఆర్థికసాయం అందించారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మాట్లాడి బాధిత కుటుంబాల పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. గురువారం బాధిత కుటుంబాలకు సంబంధిత చెక్కులు అందజేయనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp