నూతన పౌరసత్వ బిల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి?

By Guest Writer Dec. 13, 2019, 05:09 pm IST
నూతన పౌరసత్వ బిల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి?

Citizenship Amendment Bill 2019 పై అస్సాం రాష్ట్రం అట్టుడుకుతోంది. మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉభయసభల్లో బిల్లును ఆపలేని ప్రతిపక్షం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

ఈ బిల్లును అర్థం చేసుకోవడానికి ముందు దీని మూలం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

1947లో ముస్లింలు ముస్లింలీగ్ పార్టీని, దేశ విభజనను సమర్థించాక పాకిస్థాన్ ఏర్పడి అక్కడ ముస్లింలీగ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశ విభజన సందర్భంలో దాదాపు 47లక్షల మంది హిందువులు, సిక్కులు పాకిస్తాన్ వదలి ఇండియాలోకి వలస వచ్చారు. దాదాపు 65 లక్షల ముస్లింలు పాకిస్థాన్లో నివసించడానికి ఇష్టపడ్డారు. పాకిస్థాన్ స్వాతంత్య్రం తర్వాత కొందరు హిందువులు, సిక్కులు, బౌద్ధులు తమను సాధారణ పౌరులుగా పాకిస్థాన్ గుర్తించడం లేదని తమ మానప్రాణాలకు భద్రత లేదని తలచి ఇండియాలోకి వలస వచ్చారు. పాకిస్థాన్ మానవ హక్కుల గణాంకాల ప్రకారం 2013 లో 1000 మంది పాకిస్థాన్ పౌరులు ఇండియాకు వలస వెళ్లారని తెలిపింది. 2014లో పాకిస్థాన్ అధికార పక్షం(PML-N) సభ్యుడు తమ పార్లమెంటులో, ప్రతి సంవత్సరం 5000 మంది ఇండియాకు వలస వెళుతున్నారని చెప్పారు. ఇక్కడికి వలస వచ్చిన ప్రజలు తాము హిందువులు కావడం వల్ల పాకిస్థాన్ లో ఎలాంటి కష్టాలు అనుభవించేవారో ఏకరువు పెట్టారు.

పాకిస్థాన్లో హిందువులను నయాన భయానో ముస్లింలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు 2009-11 లో 428 హిందువులను ముస్లింలుగా డియోబంద్ మదరసా బైతుల్ ఇస్లాం మార్చింది. 1989 నుండి ఇప్పటి వరకు దీన్ మొహమ్మద్ షేఖ్ మిషన్ లక్ష ఎనిమిదివేల మందిని ముస్లింలుగా మార్చిందని గణాంకాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో పరిస్థితి ఇంకా అద్వాన్నంగా ఉంది.

ఈ నేపథ్యంలో సిటిజెన్షిప్ యాక్ట్ 1955 ను సవరించడానికి జులై 19, 2016లో సిటిజన్షిప్ అమెండ్మెంటు బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 12, 2016 న ఈ బిల్లును జెపిసికి పంపగా, జెపిసి 2019 జనవరి 7న రిపోర్టు సమర్పించింది. జనవరి 8, 2019న లోకసభ ఈ బిల్లు పాస్ చేసింది. తదనంతరం 16వ లోకసభ రద్దవడంతో ఈ బిల్లు రద్దయింది.
మళ్లీ 2019 డిసెంబరు 4న, 17వ లోకసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. 2019, డిసెంబర్ 9న హోమ్ వ్యవహారాల మంత్రి అమిత్ షా ఈ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. డిసెంబరు 10వ తారీఖు ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. 311 మంది బిల్లుకు అనుకూలంగా 80 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇదే సంవత్సరం డిసెంబర్ 11న ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. 125 మంది బిల్లుకు అనుగుణంగా, 99 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బీజేపీ, AIADMK, బిజూ జనతాదళ్, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు అనుగుణంగా ఓటేశారు. ఈరోజు డిసెంబరు 13న ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించి చట్టం అయ్యింది. డిసెంబరు 19న గెజిట్లో ప్రచురించాక ఈ చట్టం అమలులోకి వస్తుంది.

ఈ బిల్లు Citizenship Act of 1955 ను సవరిస్తుంది. అందుకే ఇది Citizenship Amendment Bill 2019 అయ్యింది. ఈ చట్టం అమలయ్యాక 31 డిసెంబర్, 2014 ముందు దేశంలోని అనధికార వలసదారులకు భారత పౌరసత్వం కోసం దాఖలు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. ముందు చట్ట ప్రకారం వలసదారు గత 12 నెలలుగా దేశంలో నివసిస్తూ ఉండాలి, పైగా గత 14 సంవత్సరాలలో కనీసం 11 సంవత్సరాలు ఇక్కడ నివసించి ఉండాలి. ఈ సవరణ తర్వాత ఈ 11 సంవత్సరాల కాలాన్ని తగ్గించి 5 సంవత్సరాలుగా మార్చారు. మిగిలిన అన్ని నియమాలు యధాతథంగా వర్తిస్తాయి. ఈ సవరణ కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుండి వలస వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ 5 సంవత్సరాల వెలుసుబాటు కేవలం హిందు, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన పారసీ మతస్థులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే అస్సోమ్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ట్రైబల్ ప్రాంతాలకు ఈ సవరించిన చట్టం వర్తించదు.

ఈ చట్టం ప్రకారం ఈ Overseas Citizenship of India పొందిన వ్యక్తులు ఎటువంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడ్డా వాళ్ళ OCI రద్దు చేయబడుతుంది. అదేవిదంగా ఈ OCI పొందడానికి ఏవైనా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఉంటే వాళ్ళ OCI రద్దు చేసి విచారణ జరిపి జైలుశిక్ష  విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఈ చట్టంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కూడా నెలకొని ఉంది. ముస్లింలకు ఈ చట్టంలో వెలుసుబాటు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కొందరు భావిస్తున్నారు. ఇంకా భారత పౌరసత్వం పొందని వారికి భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు వర్తిస్తుందో లేదో సుప్రీంకోర్టు తేల్చనుంది.

ఈ బిల్లు అమలు జరిగితే ఈశాన్య రాష్ట్రాల్లో వలసదారుల వలన చాలా సమస్యలు వస్తాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. స్థూలంగా ఈ చట్టం అక్కడి ట్రైబల్ ప్రాంతాలకు వర్తించదు అనే నియమం ఉన్నా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లి వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చగలదో వేచి చూడాల్సి ఉంది.


Written By - Sudarshan Tyr

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp