పౌరసత్వ సవ"రణ" చట్టం

By Kiran.G Dec. 16, 2019, 02:00 pm IST
పౌరసత్వ సవ"రణ" చట్టం

పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీలోను మంటలు రేపుతోంది. "జామియా మిలియా ఇస్లామియా"(జేఎంఐ) విశ్వవిద్యాలయ విద్యార్థులు, స్థానికులతో కలిపి చేసిన నిరసనలతో ఢిల్లీ అట్టుడికింది. ఉదయం నుండి అర్ధరాత్రి వరకూ కొనసాగిన నిరసనలతో ఆగ్నేయ ఢిల్లీ వీధులు హింసాత్మకంగా మారాయి. తొలుత నిరసన కారులు నాలుగు బస్సులను తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా మంటలు అదుపు చేయడానికి వచ్చిన ఫైర్ ఇంజిన్ ని కూడా ఆందోళన కారులు అడ్డుకుని, దానికి కూడా నిప్పు పెట్టడంతో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దానితో పోలీసులు లాఠీఛార్జ్ చేసారు. భాష్పవాయువును ప్రయోగించారు.

హింసకు కారణమయిన కొందరు జామియా మిలియా ఇస్లామియా విశ్వ విద్యాలయంలో దాగి ఉన్నారని పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించడంతో రగడ మొదలైంది. లైబ్రరీ లో చదువుకుంటున్న విద్యార్థులను కూడా పోలీసులు కొట్టారని విద్యార్థులు ఆరోపించారు. దీనికి తోడు విద్యార్థులను పోలీసులు విచక్షణా రహితంగా కొడుతున్న వీడియోలు బయటకు రావడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీలో చెలరేగిన హింసలో సుమారు 60 మంది గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన చేస్తుండగా తమపై అకారణంగా పోలీసులు దాడి చేసారని విద్యార్థులు తెలిపారు. హింసకు కారణమయ్యారన్న ఆరోపణలతో 50 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనితో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలలో ఉన్న విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంఘీభావంగా నిరసనలు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ మైనార్టీ కమిషన్ అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలనీ పోలీసులను ఆదేశించింది. ఒకవేళ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీఎంసీ చైర్మన్ స్పష్టం చేసారు. దీనితో సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న విద్యార్థుల్ని పోలీసులు విడుదల చేయడంతో విద్యార్థులు శాంతించారు. కాగా తమపై జరిగిన లాఠీ ఛార్జ్ కి నిరసనగా జామియా విశ్వవిద్యాలయ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసనను తెలియజేసారు. పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ధర్నాను కొనసాగిస్తున్నారు.

ఆందోళనలు అదుపుచేసే క్రమంలో పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరుపై, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఇందిరా జైసింగ్ అనే న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. కానీ పరిస్థితులను అదుపులోకి తీసుకురాకుండా తాము మధ్యలో కలుగజేసుకోలేమని సుప్రీం కోర్టు,ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే స్పష్టం చేసారు. తాము శాంతి భద్రతలకు వ్యతిరేకం కాదని, కానీ ఇంకా ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. హింసాత్మక ఘటనలు ఆగిపోయిన తరువాత విచారణ చేపడతామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఢిల్లీలో శాంతిభద్రతల విషయంలో ఆందోళనగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదుపు తప్పిన శాంతి భద్రతల పునరుద్ధరణకు అరవింద్ కేజ్రీవాల్ హోంశాఖా మంత్రి అమిత్ షా తో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమిత్ షా ను కలిసేందుకు సమయం కోరానని కేజ్రీవాల్ తెలియజేసారు.

కాగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తానే స్వయంగా భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కోల్ కతాలో జరుగుతున్న ఈ ర్యాలీలో కేంద్రం నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని మమతా ఆగ్రహం వ్యక్తం చేసారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమెకు మద్దతుగా నిరసనకారులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp