సెప్టెంబర్ లో కరోనాకు బలైన వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో..

By Kalyan.S Sep. 26, 2020, 04:33 pm IST
సెప్టెంబర్ లో కరోనాకు బలైన వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో..

కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. బాధితుల సంఖ్య అటుంచితే.. మహమ్మారి బారిన పడి సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో మరలి రాని లోకాలకు తరలి పోయారు. పాట రూపంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బాలు మృతి కరోనా ని మరోసారి తీవ్ర చర్చగా మార్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకూ ఎందరో దానికి బలి అయ్యారు. వారిలో ఈ నెలలో మరణించిన కొందరి ప్రముఖుల గురించి ఓ సారి ప్రస్తావిస్తే...

కేంద్ర మంత్రి సురేష్‌ అంగడి

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి ఈ నెల 23న కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కర్ణాటకలో కరోనా బారిన పడి మరణించిన బీజేపీ రెండో ఎంపీ సురేష్‌ అంగడి. రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్‌ గస్తీ(55) ఈ నెల 17న బెంగళూరులో కన్నుమూశారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర వేదనకు గురిచేసింది.

వైఎస్సార్ సీపీ ఎంపీ..

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) కూడా కరోనా కే బలి అయ్యారు. బుధవారం కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బల్లి దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

పద్మశ్రీ శేఖర్ బసు..

అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్, పద్మశ్రీ డాక్టర్‌ శేఖ‌ర్ బ‌సు(68)ను కూడా కరోనా బలితీసుకుంది. కొన్ని రోజుల క్రితం క‌రోనా బారిన‌ప‌డిన ఆయ‌న కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. కరోనాతో పాటు కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన మృతి చెందారు. మెకానికల్‌ ఇంజనీర్‌ అయిన డాక్టర్‌ బసు దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ త‌యారీలో కీల‌క‌పాత్ర పోషించారు. దేశంలో అణువిద్యుత్ ఉత్ప‌త్తి పెంచేందుకు కృషి చేశారు. 2015 అక్టోబ‌ర్ 23 నుంచి 2018 సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌ గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం దక్కింది.

తెలుగు హాస్య నటుడు కూడా..

కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు న‌టుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో క‌న్నుమూశారు. గ‌త నెల‌లో ఈ వైర‌స్ బారిన‌ప‌డిన ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తరువాత నటనపై ఆసక్తితో సినీరంగం వైపు వచ్చారు. మర్యాద రామన్న, పిల్ల జమిందారు, ఛలో, అమీతుమీ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

అమరుడైన గాన గంధర్వుడు ఇక ఎస్పీ బాలు మృతి అందరికీ తెలిసిందే. సినీ లోకాన్నే కాదు.. యావత్ సంగీత ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచేసిన బాలు మృతి కి కూడా కారోనాయే కారణం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp