తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చిత్తూరు ఎంపీ

By Ritwika Ram Jul. 30, 2021, 03:00 pm IST
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చిత్తూరు ఎంపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎంపీ నల్లకొండగారి రెడ్డప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. గుండెలో సమస్య తలెత్తినట్టు గుర్తించిన డాక్టర్లు.. రెడ్డప్పకు పేస్ మేకర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయనకు సర్జరీ చేయనున్నట్లు సమాచారం. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

గతేడాది సెప్టెంబర్ లో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎంపీ రెడ్డప్పకు కరోనా సోకింది. పార్లమెంట్ సచివాలయంలో కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చింది. దీంతో లోక్ సభ సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు. అప్పట్లో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండి తర్వాత కోలుకున్నారు. ఇప్పుడు తలెత్తిన గుండె సంబంధిత సమస్యలు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చినావా? అనేది తెలియాల్సి ఉంది. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య వివరాలు తెలియనున్నాయి.

చిత్తూరు జిల్లా సోమల మండలం వల్లిగట్ల గ్రామంలో 1951లో రెడ్డప్ప జన్మించారు. ఎస్వీ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీలు చదివిన ఆయన.. తర్వాత అడ్వొకేట్, లీగల్ అడ్వైజర్ గా పని చేశారు. 1998 నుంచి 2000 దాకా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పని చేశారు. తర్వాత 2005 నుంచి 2007 దాకా ఏపీ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గానూ సేవలందించారు. 2008-09 మధ్య నేషనల్ స్టీల్ కన్సూమర్ కమిటీ మెంబర్ గా ఉన్నారు.

2019 ఎన్నికల్లో లో చిత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న శివప్రసాద్ ను ఓడించారు. 1996 నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న చిత్తూరును వైసీపీ ఖాతాలో వేశారు. 2019 సెప్టెంబర్ నుంచి స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ మెంబర్ గా.. కల్చర్, టూరిజం మినిస్ట్రీ కన్సల్టివ్ కమిటీ మెంబర్ గా రెడ్డెప్ప ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp