బిజెపికి అల్టిమేటం ఇచ్చిన పాశ్వాన్

By Srinivas Racharla Sep. 30, 2020, 08:00 pm IST
బిజెపికి అల్టిమేటం ఇచ్చిన పాశ్వాన్

బీహార్‌లో అధికార ఎన్డీయే సంకీర్ణంలో విపక్షంగా తయారైన లోక్ జనశక్తి పార్టీ,జనతాదళ్ (యునైటెడ్) మధ్య కీచులాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ అధికార ఎన్డీయే సంకీర్ణంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాకపోవడంపై ఎల్‌జెపి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ బిజెపికి అల్టిమేటం ఇచ్చారు.

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసిన చిరాగ్ పాశ్వాన్ త్వరలో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలా కుదరని పక్షంలో బీహార్‌లోని 243 సీట్లలో 143 స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతామని ఎల్‌జెపి స్పష్టం చేసింది.ఇక 143 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఆయా నియోజకవర్గాలలో వెంటనే ప్రచారం ప్రారంభించాలని చిరాగ్ పాశ్వాన్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులను ఆదేశించటం గమనార్హం.

గత కొంత కాలంగా అధికార ఎన్డీయే కూటమిలో సీఎం నితీశ్‌ కుమార్‌కి, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ -19 మహమ్మారి రాష్ట్రాన్ని తాకడానికి ముందు ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ పరిపాలన, శాంతిభద్రతలు, అభివృద్ధి మరియు నిరుద్యోగం వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఆసాంతం ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాలనపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డాడు. దీనికితోడు తాజాగా బీహార్ ప్రజలు కొత్త ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారని బీహార్ ఎల్జేపీ అధ్యక్షుడు షహ్నావాజ్ అహ్మద్ కైఫీ కొత్త పల్లవి అందుకున్నాడు. ప్రజలకు "తమ కొడుకు" వలె సేవ చేయగలిగిన చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉత్తమ ప్రత్యామ్నాయం అని కైఫీ ప్రకటించాడు.

పాశ్వాన్‌లకు చెక్ పెట్టేందుకు నితీశ్‌ ప్రయత్నాలు:

పాశ్వాన్‌ల "రాజకీయ ప్రాముఖ్యతను" తగ్గించడానికి సీఎం నితీశ్‌ కుమార్‌ కూడా ఎత్తుగడలు వేస్తున్నాడు. తన మాజీ సహచరుడు,దళిత నేత జితాన్ రామ్ మంజి ని ఎన్డీయేలోకి ఆహ్వానించాడు. ఎల్జేపీ పార్టీకి దళితులలో ఉన్న పట్టును దెబ్బ తీయడానికే మరో దళిత పార్టీ హిందూస్తాన్ అవామ్ మోర్చా (HAM) ని కూటమిలో భాగస్వామిని చేశాడు. దీంతో తమని విశ్వాసంలోకి తీసుకోకుండా మాంఝీ పార్టీని ఎన్డీయేలోకి స్వాగతించడంతో ఎల్జేపీ నితీశ్ పై మండి పడుతోంది.

2019 లోక్‌సభ ఎన్నికలలో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములా ప్రకారం బిజెపి, జేడీయూ ఒక్కొక్కటి 100 సీట్లకు పోటీ చేస్తాయని భావించి ఎల్జేపీ 43 సీట్లను కోరింది. కానీ అన్ని స్థానాలు లోక్ జనశక్తి పార్టీకి కేటాయించడానికి నితీశ్‌ కుమార్‌ అంగీకరించడం లేదు. పైగా 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడు సీట్ల పంపకాలకు సంబంధించిన 1.4 : 1 ఫార్ములాను తెరమీదికి జేడీయూ తీసుకువచ్చింది. ఈ సూత్రం ప్రకారం బిజెపికి 100 స్థానాలు వదిలి 140 పైగా సీట్లలో పోటీ చేయాలని జేడీయూ ఆశిస్తోంది.ఇక బిజెపి కోటా స్థానాల నుండి ఎల్జేపీకి సీట్ల సర్దుబాటు చేయాలని సీఎం నితీశ్‌ కోరుతున్నారు.దీంతో ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం పీటముడి వలే బిగుసుకుపోయింది.

తాజాగా జేడీయూ ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్మాలాను తమకు వర్తింపచేయాలని ఎల్‌జెపి పట్టుపడుతోంది. ఎల్‌జెపి డిమాండ్స్‌ని అధికార జేడీయూ తోసిపుచ్చుతూ మీరు తమ కూటమిలో లేనేలేరని తాము భావిస్తున్నామని ప్రకటించింది.

కాగా జేడీయూ ప్రకటనతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ స్థానాల సర్దుబాటుపై నితీశ్‌ కుమార్‌తో రాజీ పడటానికి సిద్ధంగా లేడని ఎల్‌జెపి వర్గాలు చెబుతున్నాయి.కోవిడ్ -19 నియంత్రణ,వరద సహాయక చర్యలు, వలస కార్మికుల సంక్షోభం మరియు ఉపాధి సమస్యలపై సీఎం నితీశ్‌ తగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందాడని ఎల్‌జెపి నాయకత్వం భావిస్తోంది.

దీంతో సిఎం నితీశ్‌ కుమార్‌తో తీవ్ర అభిప్రాయ భేదాలున్న చిరాగ్ పాశ్వాన్ జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడానికి తాము వెనకాడబోమని బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేశాడు. కానీ ఎన్డీయే కూటమిలో ఎల్‌జెపి వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు ఎన్నికలకు ముందే సీట్ల పంపకాలపై మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp