బీహార్ తొలివిడత ఎన్నికల వేళ చిక్కుల్లో చిరాగ్

By Srinivas Racharla Oct. 28, 2020, 11:20 am IST
బీహార్ తొలివిడత ఎన్నికల వేళ చిక్కుల్లో చిరాగ్

బీహార్ ఎన్నికలలో జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ని ముఖ్యమంత్రి గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌ చిక్కుల్లో పడ్డాడు. సరిగ్గా బీహార్ తొలివిడత ఎన్నికలకు ఒకరోజు ముందు చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఓ వీడియో లీకైంది.ఈ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోలో ఇటీవల మరణించిన తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ఫోటో పక్కన నిలబడి విషాద వదనంతో చిరాగ్ ఓ డైలాగ్ చెబుతున్నాడు. అయితే ఆ డైలాగ్ సరిగా రాకపోవడంతో అనేకసార్లు రీ షూట్ చేశారు. సరిగ్గా టేక్ సమయంలో విచారంగా ముఖం పెట్టడం అది సరిగా రాకపోవడంతో మరో టేక్ తీసుకుందామని చిరాగ్ చెప్పడం అందులో కనిపిస్తోంది.

నెట్టింట సందడి చేస్తున్న రిహార్సల్‌ వీడియోలో ఎల్‌జెపి అధినేత చిరాగ్ పాశ్వాన్‌ డైలాగ్ చెబుతూ ''స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా బీహార్‌ ఎక్కడి వెళ్తోంది. ఇప్పటికీ అదే వెనుకబాటుతనంలో ఉంది. అయ్యో సరిగా చెప్పలేకపోయాను.మరోసారి చేద్దాం." అంటూ అనడం కనిపిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తన వీడియోపై చిరాగ్ పాశ్వాన్ తీవ్రంగా స్పందించాడు. తన తండ్రి మరణం పట్ల తాను విషాదంలో ఉన్నానని ప్రత్యేకంగా నిరూపించుకోవాలా అని చిరాగ్ ప్రశ్నించాడు. తొలి విడత ఎన్నికల వేళ ఈ వీడియోను లీక్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలన్నాడు.ఇది ముఖ్యమంత్రి నితీశ్ పనేనని,ఆయన ఓటమి భయంతో ఏ స్థాయికి దిగజారారో అర్థమవుతోందని వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే నితీశ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఎన్డీయే నుండి వేరుపడి ఎన్నికలలో ఒంటరి పోరు చేస్తున్న చిరాగ్‌ ఆయనపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాడు.ఈ నేపథ్యంలో జేడీయూ నేతలకు చిరాగ్‌ వీడియో ఓ అస్త్రంగా లభించింది.ఈ వీడియోతో చిరాగ్ అసలు స్వరూపం బయటపడిందని జేడీయూ నేతలు చిరాగ్‌పై ఎదురుదాడి ప్రారంభించారు.

కాగా తండ్రి మరణంతో సానుభూతి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్న చిరాగ్ పాశ్వాన్‌కు రిహార్సల్‌ వీడియో లీక్ కావడం పెద్ద తలనొప్పిలా తయారైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp