పాపం డాక్టర్ గారు ...గెలవగలిగినప్పుడు సీట్ రాలేదు,సీట్ వచ్చినప్పుడు పార్టీ ఓడిపోయింది..

By Mavuri S Mar. 07, 2021, 03:00 pm IST
పాపం డాక్టర్ గారు ...గెలవగలిగినప్పుడు సీట్ రాలేదు,సీట్ వచ్చినప్పుడు పార్టీ ఓడిపోయింది..

రాజకీయాల్లో పదవినో డబ్బో ఉంటేనే విలువ. ఇవి రెండు లేకుంటే చాలాసార్లు సొంత పార్టీలో కూడా గుర్తింపు దక్కదు. అన్నీ ఉంటే,సొంత పార్టీ వాళ్ళే కాకూండా రాజకీయ నాయకులతో అవసరం ఉన్న వాళ్ళందరూ నాయకుడి ఇంట్లో పిల్లల పుట్టినరోజులు కూడా కటౌట్ లు పెట్టి కేక్ కటింగ్ చేస్తారు. ఇవి లేని రోజు నాయకుడు చనిపోయినా సంతాపం ప్రకటించటానికి కూడా సమయం ఉండదు.. చాలాసార్లు ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా అలా జరిగిపోతుంది. ఇదంతా రెండుసార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి రెండురోజుల కిందట చనిపోయిన ఒక నేత గురించి.

కష్టకాలంలో ఆదుకొని..

తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ కర్రా రాజారావు వైద్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో చింతలపూడి నియోజకవర్గం నుంచి కోటగిరి విద్యాధరరావు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోవడంతో అక్కడ టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా రాజకీయాలను శాసించే గల నేత గా పేరున్న కోటగిరి ఒక్కసారిగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లోకి వెళ్లడం తో పాటు నియోజకవర్గాల పునర్విభజనలో చింతలపూడి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో టిడిపికు దానిని భర్తీ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మంచి డాక్టర్ గా పేరున్న కర్ర రాజారావును 2009లో టిడిపి టికెట్ ఇచ్చి పోటీలో నిలిపారు. అప్పట్లో ఆయన మద్దాల రాజేష్ చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గం మీద పట్టు లేకపోవడంతో పాటు రాజకీయాలకు కొత్త కావడంతో ఎన్నికల ఇంజినీరింగ్ లో వెనుకబడటం, జిల్లా నేతల సహకారం అంతంతమాత్రంగా ఉండటంతో రాజారావు ఓటమి తప్పలేదు.

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా అందరికీ సుపరిచితుడైన రాజారావును స్వచ్ఛంద పదవీ విరమణ చేపించి మరీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత పెద్దగా ప్రోత్సహం ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో టికెట్ కోసం కర్రా రాజారావు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

2014 ఎన్నికల్లో చంద్రబాబు చింతలపూడి నుంచి 2004లో ఆచంట నుంచి గెలిచిన పీతల సుజాత కు అవకాశం ఇచ్చారు.టికెట్ దక్కకున్నా ఎదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తామని చంద్రబాబు చెప్పిన ఆయన మాట మీద నమ్మకం లేకపోవడంతో రాజారావు బయటకు వచ్చి వైసీపీలో చేరారు. వైసీపీలో ఎక్కువ కాలం ఉండని రాజా రావ్ స్థానిక సమీకరణలు,భవిషత్తులో టికెట్ దక్కుతుందన్న లెక్కలతో మళ్ళీ టీడీపీలోకి వెళ్లారు. అయినా రాజారావుకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు.

2014 లో చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాత కొంతకాలం మంత్రిగా కూడా వ్యవహరించారు.చింతలపూడి నియోజకవర్గంలో నాటి ఎంపీ మాగుంట బాబు,నాటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ల జోక్యం ఎక్కువ కావటం,చివరికి ప్రారంబోత్సవాలకు కూడా తనను పిలవక పోవటం తో చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరింది.చంద్రబాబు తన సహజ ధోరణిలో సమస్యను పరిష్కరించకుండా 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పీతలసుజాత మంత్రి పదవి  నుంచి తప్పించారు. చివరికి 2019ఎన్నికల్లో సుజాతకు టికెట్ నిరాకరించి మాగంటి బాబు మద్దతుతో కర్రా రాజారావు కు మరోసారి టికెట్ ఇచ్చారు. . వైసీపీ సునామీలో ఓడిన రాజారావు క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.

సంతాపం తో సరి

కర్రా రాజారావు గత కొద్ది రోజులుగా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాస్త్ర చికిత్స చేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆసుపత్రిలోనే ఉంటున్నారు. శనివారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

రెండుసార్లు  ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి మృతి చెందితే కనీసం పార్టీ తరఫున ఓ నేత ఓ పలకరింపు లేకపోవడం విచారకరం. చంద్రబాబు కూడా  ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సందర్భం లేదు.  కేవలం ఆయన మృతి వార్తను తెలుసుకొని ఒక సంతాప సందేశం తోనే చంద్రబాబు సరిపెట్టారు. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp