వణికిస్తున్న కరోనా...

By Kiran.G Jan. 25, 2020, 10:03 am IST
వణికిస్తున్న కరోనా...

కరోనా వైరస్ ఇప్పుడు చైనాతో పాటుగా ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. ఈ వైరస్ బారిన పడి 26 మంది చనిపోగా మరో 877 మంది ఈ వైరస్ ద్వారా వ్యాధిగ్రస్తులయ్యారని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. వీరిలో 177 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు హెల్త్‌ కమిషన్‌ చెప్పింది. చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా సౌకర్యాలను పూర్తిగా స్తంభింపజేశారంటే కరోనా వైరస్ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. చైనా, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

కాగా కరోనా వైరస్ ఎక్కడినుండి వ్యాప్తి చెందుతుందనే పరిశోధనలు కొనసాగుతున్నాయి. జంతువుల నుండి ఈ కరోనా వైరస్ మనుషులకు సోకుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. గబ్బిలాల నుండి మనుషులకు ఈ వైరస్ సోకుతుందని కొందరు చెబుతుండగా, మరికొందరు మాత్రం పాముల నుండి సోకుతుందని వివరణ ఇస్తున్నారు. ఇంకొందరైతే గబ్బిలాలు,పాముల్లో ఉండే వైరస్ ల కలయిక ద్వారా కొత్త వైరస్ పుట్టిందని చెబుతున్నారు. జంతురవాణా చేసే వ్యక్తులకు జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకిందని అంటువ్యాధి కావడం వలన వైరస్ బారిన పడ్డ వ్యక్తుల నుండి ఇతరులకు సోకి ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు.

తీవ్రమైన జ్వరం, జలుబుతోపాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కరోనా వైరస్ ప్రధాన లక్షణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్‌ విస్తృతిగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అనూహ్యమైన రీతిలో హుబెయ్‌ ప్రావిన్సులోని వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌, ఖియాన్‌జింగ్‌ నగరాలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. అక్కడి నుంచి బయల్దేరే విమానాలు, రైళ్లు, బస్సులను నిరవధికంగా నిలిపేశారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, ఇంటర్నెట్‌ కేంద్రాలు సహా అన్నీ మూతపడ్డాయి. ఈ ఒక్క వుహాన్ ప్రావిన్సులో వ్యాధి విస్తరణకు కళ్లెం వేయడానికి 100 కోట్ల యువాన్ల (సుమారు రూ.1008 కోట్లు) నిధుల్ని కేటాయించడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోగులకు చికిత్స అందించడానికి సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలో దించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు షాంఘైలోని డిస్నీల్యాండ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కారణం లేకుండా నగరం దాటి వెళ్లవద్దని, ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని చెప్పారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్‌లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో అక్కడి వారికి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైరస్ వేగంగా విస్తరించడంతో మధ్య చైనా సిటీ వుహాన్‌ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, రహదారులపై ఉష్ణోగ్రతలు, జ్వరం తనిఖీలను అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా కేవలం చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో 10 రోజుల్లో అక్కడ కొత్త ఆస్పత్రి నిర్మించడానికి చైనా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 3 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది.

వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నందున చైనాలో భారత దౌత్య కార్యాలయంలో జరగాల్సిన గణతంత్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసారు. చైనాకు వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, సమూహంగా ఉండొద్దని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించింది. చైనా నుండి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 24 వరకు చైనాకు వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చేవారు తమ టికెట్లను రద్దు చేసుకున్నా, ప్రయాణ తేదీ మార్చుకున్నా ఎలాంటి అదనపు రుసుములు విధించకూడదని ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు నిర్ణయించాయి.

దగ్గు,తుమ్ములు,శారీరక సంబంధాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు తెలిపారు. ఈ కరోనా వైరస్ వలన శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని అది మరణానికి దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి ఉధృతి పెరిగే పరిస్థితులు కనిపిస్తుండటంతో WHO అత్యవసర స్థితిని విధించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp