ఆ విద్యలో బాబుకు సాటెవ్వరు..?

By Kotireddy Palukuri Sep. 18, 2020, 05:10 pm IST
ఆ విద్యలో బాబుకు సాటెవ్వరు..?

రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడంలోనూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరొకరు సాటిరారని ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారు చెబుతున్న మాట. తనను తాను రక్షించుకునేందుకు ఓ వైపు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూనే.. మరో వైపు ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో చంద్రబాబు మరోమారు ఈ ఎదురుదాడి అనే అస్త్రాన్ని బయటకుతీశారు.

అమరావతి భూ కుంభకోణంలో సిట్, ఏసీబీ చేస్తున్న విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడం, దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న తరుణంలో ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని విమర్శిస్తున్నారు. ఇందుకు చంద్రబాబు సరికొత్త పేరు పెట్టారు. అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందంటుంటే... చంద్రబాబు విశాఖలో ఒన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇన్‌సైడ్, ఒన్‌సైడ్‌.. ప్రాస కూడా కుదరడంతో చంద్రబాబు ఈ పధం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ 16 నెలల పాలనపైనా, విశాఖ ఒన్‌సైడ్‌ ట్రేడింగ్‌పైనా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు.. అమరావతి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపైనా సీబీఐ విచారణ కావాలంటున్న చంద్లరబాబు.. తన వరకు వచ్చే సరికి సీబీఐ మాత్రమే కాదు ఏసీబీ కూడా వద్దంటూ స్టేలు తెచ్చుకుంటున్న విషయం ఏపీ ప్రజలు గమనిస్తున్నారు.

రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు, విమర్శలు చేసినంత మాత్రాన అవి నిజం కాకపోవచ్చు. విచారణ జరిగితే నిజా నిజాలు ప్రజలకు తెలుస్తాయి. కానీ ఆరోపణలపై విచారణే వద్దు, అది రాజకీయ కక్ష సాధింపు అని చెబితే నమ్మే పరిస్థితిలో ప్రజలున్నారా..? అనేది 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ తెలియదనుకోవడం పొరపాటవుతుంది. పైగా విచారణలను అడ్డుకోవడం ద్వారా నేరం జరిగిందనే ప్రజలు నమ్ముతారు. ఎంత అరిచినా..అనుకూల మీడియలో రోజుల తరబడి ప్రచరాం చేసినా అవి ఎంత వరకు ఫలితాన్ని ఇస్తాయన్నది చెప్పలేం. మరి బాబు ఎదురుదాడి తనను, తనను నమ్ముకున్న వాళ్లను ఎంత మేరకు రక్షిస్తుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp