‘మయ సభ’కు మరోసారి తెరలేచిందా..!

By Jaswanth.T Nov. 14, 2020, 04:29 pm IST
‘మయ సభ’కు మరోసారి తెరలేచిందా..!
మహాభారత కాలంలోనే.. ఉన్నది లేనట్టుగాను, లేనది ఉన్నట్టుగాను సృష్టించడంలో మయుడిని మించినవాడు లేడట. సదరు మయుడి సభలోనే దుర్వోధనుడికి గర్వభంగం కూడా అయ్యి ఆనక కురుక్షేత్ర సంగ్రామానికి మూలం పడిన విషయం తెలిసిందే. అయితే ఆధునిక మయుడి సభకు ఇప్పుడిప్పుడే రూపకల్పన జరిగిందంటున్నారు రాజకీయ విమర్శకులు. మయుడిని మించిన నైపుణ్యం ఉన్న నాయకుడు నారా చంద్రబాబునాయుడేనన్నది వారి ముఖ్య ఉద్దేశం కూడాను. ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చూపించడంలో ప్రస్తుత కాలంలో చంద్రబాబు, ఆయన బృందానికి మించిన వారు లేరంటున్నారు.

ఇందుకు ప్రధాన ఉదాహరణలను పార్టీ కార్యవర్గ ప్రకటననే తార్కాణంగా చూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జంబో కార్యవర్గాన్ని ప్రకటించడమే కాకుండా జాతీయ స్థాయి కార్యవర్గాన్ని కూడా ప్రకటించి మయుడినే మరిపించాడని వివరిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ నాలుగు జిల్లాల్లో మాత్రమే టీడీపీకీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల వైఎస్సార్‌సీపీ దాదాపు క్వీన్‌ స్వీప్‌ చేసినంత పన్జేసింది. ఇక తెలంగాణాలో అయితే టీడీపీ పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదంటారు పరిశీలకులు. నిబంధనల ప్రకారం ఏవైనా రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ వ్యవహారాలు నడుపుతూ ఉంటే జాతీయ పార్టీగా భావిస్తారు. సాంకేతికంగా ఈ నేపథ్యంలో టీడీపీని జాతీయ పార్టీకి ఎన్నికల సంఘం పరిగణిస్తుంటుంది.

అంతే తప్ప జాతీయ పార్టీ అంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేస్తున్న పార్టీ అయితే మాత్రం కాదనేది పరిశీలకులు వివరిస్తున్న మాట. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే.. మరలాంటప్పుడు జాతీయ కార్యవర్గాన్ని చంద్రబాబు ఎందుకు ప్రకటించినట్టు? అన్న ప్రశ్న తలెత్తకమానదు. ఇక్కడే మయుడిని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుందుంటున్నారు విమర్శకులు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టుగా సృష్టించే తెలివితేటలు మయుడితో పాటు చంద్రబాబుకు కూడా అదే స్థాయిలో ఉన్నాయంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి పదవుల్ని ఇవ్వకుండా కనికట్టు చేసినట్టే.. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మీ అందరికీ పదవులు ఇస్తున్నానని లేని అధికారాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నారని వివరిస్తున్నారు. అంటే పార్టీ పదవులు, హోదాలు పొందిన వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు గానీ, ఆయన పుత్రరత్నాన్ని గానీ సీయంగా చేయడానికి ఈయన చూపించిన కనికట్టుని నమ్మి కష్టపడాలన్నమాట.

నవ్యాధునిక మయుడిగా చంద్రబాబు సృష్టించిన పదవుల్ని మీదేసుకుని పార్టీ కేడర్‌ ముందుకురికేస్తే తమ లక్ష్యానికి దగ్గరవుతామన్నదే ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే అప్పుడు మయుడి సభను చూపి మెచ్చుకున్నవాళ్ళు లేకపోలేదు. కానీ అదే సభ మహాభారత యుద్దానికి కూడా కారణం కాకుండా పోలేదు. అదే రీతిలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని తాము, ఇప్పుడు రాష్ట్రం, జాతీయం అంటూ పదవులిస్తే మాత్రం ఎంతలే అనుకుని లైట్‌గా తీసుకుంటున్నవారు కూడా టీడీపీలో లేకపోలేదంటున్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ జంబో కార్యవర్గం, జాతీయ కనికట్టు మంత్రం ఎంత ఫలితాన్నిచ్చిందన్నది భవిష్యత్తులోనే తేలాల్సి ఉంటుందంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp