నేనున్నానని గుర్తించండి..!

By Jaswanth.T Dec. 01, 2020, 07:30 pm IST
నేనున్నానని గుర్తించండి..!
అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్‌లో బాగా పాపులర్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ ఒకటుంటుంది. ‘మేమున్నామని గుర్తించు అత్తా..’ అంటూ సెంటిమెంట్‌ను పండించే ఆ డైలాగ్‌ సినిమా చూసినవారందరికీ బాగానే గుర్తిండిపోతుంది. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అదే డైలాగ్‌ను ప్రజలతో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు పరిశీలకులు.

2019లో ప్రజలిచ్చిన షాక్‌తో దాదాపు కోల్డ్‌ స్టోరేజీ స్థాయికి పార్టీ చేరుకుపోయింది. కోవిడ్‌ దెబ్బతో నాయకులు కూడా అదే బాటలో ఉన్నారు. కొత్తగా పదవులిచ్చిన నాయకులెవర్లోనూ ఉత్సాహం కన్పించడం లేదు. పార్టీ ఇచ్చిన పిలుపులకు స్పందించి చేపట్టే ఏ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి స్పందనే ఉండడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో గుర్తింపు పొందడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

పైన చెప్పుకున్న అన్ని కార్యక్రమాల్లోనూ ఎంతో కొంత వ్యయ ప్రయాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబే స్వయంగా ముందుండి నడిపించుకోవాల్సిన ఆగత్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యం కాదని ఇప్పటికే పలుమార్లు తేలిపోయింది. దీంతో అసెంబ్లీనే వేదికగా చేసుకుని ప్రజల్లో గుర్తింపు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.

అందులో భాగంగానే తన గత రాజకీయ జీవితానికి భిన్నంగా వ్యవహరిస్తూ గుర్తింపుకోసం ప్రాకులాడుతున్నట్లుగా తేల్చేస్తున్నారు. మాట్లాడితే నీతులు, సుద్దులూ చెప్పే చంద్రబాబా కనీసం తన వయస్సుకు కూడా తానే ఎటువంటి గౌరవం ఇచ్చుకోకుండా చట్టసభలో ప్రవర్తించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. కోట్లాది మంది ప్రజల అండతో సీయంగా ఎన్నికైన సీయం వైఎస్‌ జగన్‌ను పట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. సభా సాంప్రదాయాలు, సభ్యుల పట్ల గౌరవ మర్యాదల విషయంలో మాట్లాడితే మైకందుకునే టీడీపీ బృందం కూడా అదే రీతిలో వ్యవహరించడాన్ని సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగానే ట్రోల్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం టీడీపీ ఉన్న వైఫల్య స్థితిని కప్పి పుచ్చుకోవాలంటే చంద్రబాబుకు ఇంతకంటే మార్గం లేదన్నవారు కూడా లేకపోలేదు. ప్రజలకు ఉపయోగపడే పనుల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేకపోతున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన జంబో కార్యవర్గం ద్వారా కూడా కనీస ప్రయోజనం కన్పిస్తున్న దాఖలాల్లేవు. తెలంగాణాలో ఉంటూ కూడా అక్కడ పోటీ చేసే అభ్యర్ధులకు అండగా ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఏపీలో తానున్న ప్రతిపక్ష హోదాను తన్నుకు పోయేందుకు బీజేపీ కాచుక్కూర్చుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి కంటే ఎక్కువే కష్టాలు చంద్రబాబును, ఆయన పార్టీని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ‘నేనున్నాను’ అంటూ ప్రజల్లో గుర్తింపు కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే శాసన సభ మర్యాదలను కూడా పక్కకు నెట్టేసి వ్యక్తిగత దూషణల స్థాయికి చంద్రబాబు ప్రవర్తన దిగజారిపోయిందంటున్నారు.

ఇది ఆయనకు, తెలుగుదేశం పార్టీకి ఎంత మేలు చేస్తుందన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాకపోయినప్పటికీ. ఉన్న స్థితి నుంచి ఇంకా క్రిందికి దిగజారిపోయే లక్షణాల్లో భాగంగానే ఇటువంటి వ్యవహారాలంటే తేల్చేస్తున్నవారే అధికంగా ఉంటున్నారు. చేతులు కాల్చుకోవడం చంద్రబాబుకు ఇటీవలి కాలంలో బాగా అలవాటైపోయిన అంశంగా మారిపోయిన నేపథ్యంలో ఈ సారి అసెంబ్లీలో అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహం ద్వారా ఇంకేమి కాలిపోనున్నాయో వేచి చూడాల్సిందే.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp