గుళ్లుపై దాడి చేస్తే ఓటు బ్యాంకు పెరుగుతుందంటూ చంద్రబాబు కొత్త సిద్ధాంతం

By Raju VS Sep. 26, 2020, 11:45 am IST
గుళ్లుపై దాడి చేస్తే ఓటు బ్యాంకు పెరుగుతుందంటూ చంద్రబాబు కొత్త సిద్ధాంతం

కులాల మధ్య కలహం పెట్టి మనుషులను విడదీసి పబ్బం గడుపుకున్న చరిత్ర కలిగిన వాళ్లే వచ్చి, కులాల మధ్య సామరస్యత గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. ఏ మత సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ మతం వాడినన్నట్టుగా మాట్లాడిన మనిషి , ఇప్పుడు మతాలు వద్ద మనమంతా ఒకటే అంటే ఎలా ఉంటుంది. దీనినే సూటిగా చెప్పేవాళ్లు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు. వర్తమానంలో మాట్లాడాలంటే చంద్రబాబు సూక్తులు చెప్పడం అంటారు.

సరిగ్గా అదే పరంపరలో మరో కొత్త సూత్రీకరణ చేశారు. ఏపీలో పలు ఆలయాల్లో జరుగుతున్న వ్యవహారాల వెనుక ఓటు బ్యాంకు పెంచుకునే ఆలోచన ఉందని ఆయన కనిపెట్టారు. వాస్తవానికి ఆలయాలపై దాడులు అని చెప్పి అత్యధిక మతస్తులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం మనదేశంలో చాలాకాలంగా సాగుతోంది. చరిత్రను తవ్వితీసి పట్టంగడుపుకుంటున్న నేతలు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు సిద్ధాంతం ప్రకారం దానికి విరుద్ధంగా మెజార్టీ మతస్తులను రెచ్చగొడితే ఓటింగ్ పెరుగుతుందంట. చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి ఆయన అనుంగు మీడియాకు రుచించవచ్చు గానీ సామాన్యులకు కూడా ఇది ఎంత ఇల్లీజికల్ అన్నది ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో యధావిధిగా నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు పత్రికల్లో వచ్చింది. ఆలయాలపై దాడులతో ఓట్ బ్యాంకు బలపడితే ఈ విషయంలో చంద్రబాబుదే అగ్రస్థానం. కాబట్టి ఆయన ఎందుకు ఓడిపోయారో బాబుకే తెలియాలి మరి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలను ఆయన తొలగించారు. పలు ఆలయాల్లో దాడులు జరిగాయి. కనకదుర్గ కొండపై క్షుద్రపూజలు కూడా నిర్వహించారు. దానికి స్వయంగా చంద్రబాబు భార్య ఆదేశాలున్నట్టుగా నాటి ఈవో తెలిపారు. కొన్ని చోట్ల రథాలు తగులబడ్డాయి. కాబట్టి ఇప్పుడు బాబు చెబుతున్నదాని ప్రకారం చూస్తే ఆలయాలపై ఇంత పెద్ద స్థాయిలో దాడులు చేసిన పాలన చంద్రబాబుదే కాబట్టి ఆయనకు బాగా ఓటు బ్యాంకు పెరిగి ఉంండాలి. కానీ ఏమయ్యిందో అందరికీ తెలిసిందే కదా.

ఏపీలో కుల రాజకీయాలు చేసినా జగన్ బలపడ్డారు. అవినీతి ముద్ర వేసినా జనం ఆయన్నే ఆదరించారు. అభివృద్ధి, ఇతర అన్ని మాటలు చెప్పినా బాబుని జనం చీదరించారు. అందుకే ఇక ఇప్పుడు మత రాజకీయాలకు తెగబడినట్టు స్పష్టమవుతోంది. అందుకు అనుగుణంగానే ఏకంగా మత మార్పిడుల గురించి ఇన్నాళ్లుగా ఆర్ఎస్ఎస్ క్యాంప్ నుంచి వినిపించే మాటలు ఇప్పుడు చంద్రబాబు నోట వస్తున్నాయి. మత మార్పిడులకు ప్రభుత్వం ఆజ్యం పోస్తుందనే విమర్శలు ఇప్పటి వరకూ ఏపీలో బీజేపీ కూడా విమర్శించలేదు గానీ చంద్రబాబు తెగబడ్డారు. ప్రభుత్వ వ్యవహారాల మీద విమర్శలు చేయలేని స్థితిలో, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా ఇలాంటి దారిన సాగుతున్నట్టు కనిపిస్తోంది. బాబు పరిస్థితి చూసి జాలిపడడం తప్ప మరో గత్యంతరం లేదనే చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp