పోటీకి టీడీపీ.. విమర్శలకు సీపీఐ..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీలో బలహీన పరిస్థితుల్లో ఉంది. వైసీపీకి అంతకంతకూ బలం పెరుగుతుండడం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ప్రజలకు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగించేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండడం లేదు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను సైతం పక్కన పెట్టి కొత్త పంథా రాజకీయాలకు తెర తీస్తున్నా అంతలా కలిసి రావడం లేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బహుశా ఈ స్థాయి రాజకీయాలు ఎప్పుడూ చేసి ఉండరు. ఈ క్రమంలో బలహీన దిశను మార్చి బలం పుంజుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో సీపీఐతో టీడీపీ జత కడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సీపీఐ.. టీడీపీ బాటలోనే నడుస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ తరఫున ఒకాల్తా పుచ్చుకున్నట్లుగానే ఉంటున్నాయి. ఒకే అంశంపై రెండు పార్టీలూ ఒకే విధంగా స్పందిస్తుండడమే దీనికి నిదర్శనం.
ఇదిలా ఉండగా.. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా.. ఆ పార్టీ అధ్యక్షుడు సోము బాబు లక్ష్యంగా ఆరోపణలు ఎక్కి పెట్టినా.. టీడీపీ నుంచి ఎవరూ నోరుమెదపడం లేదు. దీని వెనుక చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటికైనా మోదీ మెప్పుపొందేందుకే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని టీడీపీ శ్రేణులకు బాబు దిశా నిర్దేశం చేశారని టాక్. ఇదే అదునుగా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా తమదేనంటూ టీడీపీ కి అస్సలు ఆదరణే లేదనే స్థాయిలో సోము వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అక్కడ కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులను, చేసిన తప్పులను ఎత్తిచూపుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఏమీ మాట్లాడడం లేదు. దీనిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ శ్రేణులు సైతం చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా సీపీఐని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలిసింది.
ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు బాబుకు పాత మిత్రులే. అయితే, 2014లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వారు దూరమయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో వారు జనసేనతో చేతులు కలిపారు. అయితే, పవన్ కూడా పోయి పోయి.. బీజేపీకి చేరువయ్యే సరికి కమ్యూనిస్టులు ఒంటరివారయ్యారు. దీంతో వారికి కూడా బలమైన పార్టీ అండ అవసరమైంది. ఈ నేపథ్యంలో సీపీఐ కూడా టీడీపీతో అంటకాగేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరులో రెండు పార్టీల పంథా ఒకేలా ఉంటోంది. బీజేపీపై విమర్శలు వ్యక్తం చేయడంలో మాత్రం సీపీఐ ముందుంటోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే ఫార్ములా అప్లయ్ చేయనున్నారు.
తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులై బీజేపీని ఓడించాలని కోరారు. పనిలో పనిగా జనసేనపై కూడా విమర్శలు గుప్పించారు. నాడు బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, విభజన సమయంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. నేడు అదే బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ పరిణామాలన్నీ త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


Click Here and join us to get our latest updates through WhatsApp