ఎవరు రాజీనామాలు చేయాలి , ఎవరు ప్రజాతీర్పు కోరాలి .

By Sanjeev Reddy Aug. 03, 2020, 09:53 pm IST
ఎవరు రాజీనామాలు చేయాలి , ఎవరు ప్రజాతీర్పు కోరాలి .

రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించి దానికి అమరావతి అని నామకరణం చేసిన క్రమంలో ప్రతి ఘట్టంలో నాటి అధికార టీడీపీ పార్టీ ప్రమేయం తప్ప మరొకరి ప్రమేయం కానీ , సలహా , సూచనలు కానీ లేవు . నాడు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ని కానీ అందులోని సూచనలు కానీ పాటించలేదు . విపక్షాల అభిప్రాయాలు కోరలేదు . అఖిల పక్షం ఏర్పాటు చేయలేదు . కేవలం టీడీపీ నుండి ముగ్గురు నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం చేశారు తప్ప రాష్ట్రంలో మరే పార్టీ కానీ , ప్రజా సంఘాల ప్రమేయం కానీ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం జరిగింది అనేది జగమెరిగిన సత్యం .

ఈ రోజు రాజీనామా చేయండి ఎవర్ని అడుగుతున్నారో నిర్ణయం తీసుకునే రోజు వారిని సంప్రదించి తీసుకోలేదు , ఈ రోజు మద్దతుగా నిలవట్లేదని గత మిత్ర పక్షాలని నిందిస్తూ ఆక్రోశిస్తున్నారో ఆ రోజు కనీసం వారినైనా నిర్ణయంలో భాగస్వాముల్ని చేయలేదు . ఏ కేంద్రం అయితే ఆ రోజు నీరూ మట్టీ ఇచ్చి ఈ రోజు పట్టించుకోవట్లేదు అంటున్నారో గతంలో ఆ కేంద్ర కమిటీ సూచనలు అనుసరించలేదు .

బాబు గారి ప్రధాన శత్రువు ఆయన గతమే .... దురదృష్టం ఏంటో కానీ ఆయన ఈ రోజు ఒక మాట మాట్లాడితే ఆ మాటకి పక్కా వ్యతిరేకంగా గతంలో ఆయన మాట్లాడిన రికార్డులు , ఆయన చేసిన పనులు పది కనపడతాయి . ఆయన చెప్పుకొనే 40 ఏళ్ల అనుభవంలో ఆయన ప్రతి గతం , వర్తమాన చర్యలకు వ్యతిరేకంగా ఉండటం బాబు గారి చరిత్రలోనే సాధ్యమేమో .

2018 లో హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేసి పోరాడతారు మీరూ రండి కలిసి పోరాడదాం అని వైసీపీ అధినేత జగన్ పిలుపిచ్చినప్పుడు బాబు గారి వ్యాఖ్యలు విని , ఇప్పటి సవాళ్లు చూస్తే ఔరా అని ముక్కున వేలేసుకొంటారు ప్రజలు .

రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది , మీ రాజీనామాలు కుట్ర , మీరు రాజీనామాలు చేస్తే మీ మీద పోటీ నిలబెడతాం , ఇదీ హోదా కోసం రాజీనామాలు చేసి పోరాడదాం అన్న పిలుపుకు బాబు గారి స్పందన . ఇదే కాదు బాబు గారు అధికారంలో ఉండగా ఏ ప్రజా ఉద్యమాన్ని , ఆందోళనని , పోరాటాన్ని పరిగణనలోకి తీసుకొని వారి సమస్య ఏంటో సావధానంగా విని పరిష్కారం దిశగా ప్రయత్నించిన దాఖలాలు కనపడవు . అసలు విపక్షాలని , ప్రజా సంఘాల్ని వారి వినతుల్ని కనీసం గుర్తించారా అంటే లేదనే చెప్పొచ్చు . విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో నాడు రాష్ట్రం మొత్తం వ్యతిరేకించి పోరాటాలు చేసినా పోలీసుల అండతో అణగదొక్కి చివరికి బషీర్ బాగ్ లో కాల్పులు జరిపించారు కానీ ప్రజల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు .

నాటి ఘటన నుండి నేటి రాజధాని వరకూ ప్రతిదీ ఏకపక్ష నిర్ణయాలు , చర్యలే తప్ప ఎవర్నీ పరిగణించకుండా ఒంటెద్దు పోకడలు పోయి నేడు రాజీనామాలు చేద్దాం రండి అని సవాల్ చేయడం బాబు గారికి ఏమనిపించిదో కానీ చూసేవారికి మాత్రం తడబాటు మాటల్లో పేలవత్వం బెరుకు స్పష్టంగా అర్ధమవుతున్నాయి .

గతాన్ని చూస్తే తెలంగాణా పోరాట క్రమంలో ప్రజల్లో తెలంగాణా కోరిక బలంగా ఉంది అని నిరూపించుకోవాల్సిన ప్రతి సందర్భంలో రాజీనామా చేసి మళ్లీ గెలిచి ప్రజాభిమతం ప్రత్యేక తెలంగాణా అని నిరూపిస్తా అని సవాల్ విసిరి అధికార కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టిఆర్ఎస్ నుంచి 2008 లో 16 అసెంబ్లీ , 4 పార్లమెంట్ స్థానాలకు , 2010 లో 11 అసెంబ్లీ స్థానాలకు రాజీనామాలు చేయించి ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరాడు కేసీఆర్ .

తర్వాతి కాలంలో జగన్ సైతం ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చినప్పుడు ప్రజా తీర్పు కోరి తన నిర్ణయం సబబు అని నిరూపించుకున్నాడు . తర్వాత కూడా పలు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసి ప్రజాభిప్రాయాన్ని కోరాడు కానీ , మీరు రాజీనామాలు చేసి మీరే ప్రజాతీర్పు కోరుకోండి అనాటి పాలక పక్షానికి చెప్పలేదు . ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి , అధికార పార్టీని రాజీనామాలు చేసి ఎన్నికలకు పొమ్మనలేదు .

2014 లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రాజధాని ప్రాంత నిర్ణయం సందర్భంలో కేంద్ర కమిటీ సూచనలు పాటించలేదు , నిపుణుల్ని సంప్రదించలేదు , అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు , ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అని పలువురు ప్రశ్నించినప్పుడు ప్రజలు మాకు అధికారమిచ్చారు నిర్ణయం మేము తీసుకొంటాం , మిగతా వారికి ఏమి సంభందం లేదు లాంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీ వారు ఈ రోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరమనడం హాస్యాస్పదంగా ఉంది .

ఇప్పుడు అమరావతి రాజధాని భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉంది ఇక్కడి నుండి తరలించటానికి వీలు లేదు అని మీరు చెబుతున్నారు , ప్రభుత్వం వారు రాజధాని పూర్తిగా తరలించట్లేదు లేజిస్లేటివ్ కేపిటల్ ఇక్కడే ఉంటుంది , అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాలకు కొంత వికేంద్రీకరణ చేస్తాం అంటున్నారే కానీ మీలాగా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు నిర్ణయం మేము తీసుకొంటాం అని మీలాగా ఏకపక్ష ధోరణి చూపించలేదు .

సవాల్ చేసే ముందు టీడీపీ చేయాల్సింది

రాజధాని తరలించడం రాష్ట్ర ప్రజలకి ఇష్టం లేదని మీరు మాత్రమే చెబుతున్న మాట నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప అధికార పార్టీదో , మరో పక్షానిదో కాదు . మీకు నమ్మకం లేని మీరు పాటించని వాటిని ఎదుటి వారిని పాటించమని చెప్పే హక్కు మీకు లేదు .

అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ వైజాక్ రావటం మా ప్రజలకిష్టం లేదు . మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కన్నా ఒక్క అమరావతి ప్రాంత

అభివృద్దే మాకు ముఖ్యం అన్న నినాదంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ గెలిచి ఉత్తరాంధ్ర ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి .
హైకోర్టు రాయలసీమకు రావటం మా ప్రజలకిష్టం లేదు దశాబ్దాల తరబడి వెనకపడి ఉన్న మా రాయలసీమ అభివృద్ధి కన్నా అమరావతి అభివృద్దే మాకు ముఖ్యం అన్న నినాదంతో సీమ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలిచి సీమ వాసుల మనోభీష్టాన్ని ప్రపంచానికి తెలియజేయాలి .

అమరావతి పోరాటం నాలుగు గ్రామాలకు పరిమితం , పక్క నియోజక వర్గాల్లో కూడా స్పందన లేదు అని పెదవి విరుస్తున్న అన్ని వర్గాల నోర్లు కట్టేసి రాజధాని వికేంద్రీకరణ మాకిష్టం లేదు , ఉత్తరాంధ్రాలో కానీ , రాయలసీమలో కానీ ఏ విభాగాలు అభివృద్ధి చేయటం మాకు సమ్మతం కాదు ఒక్క అమరావతిలోనే అన్నీ ఏర్పాటు చేయాలి అనే నినాదంతో కోస్తా , ఉభయ గోదావరి టీడీపీ ఎమ్మెల్యే , ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ గెలిచి నిరూపించాలి .

ఏ ప్రజల కోసం ఏ రాష్ట్రం కోసం అని మీరు చెబుతున్నారో ముందు వాళ్ళని నమ్మించి వారి ఆమోదం పొంది గెలిచి వారి అభీష్టం ఇది అని నిరూపించి అప్పుడు సవాల్ చేయండి . అధికార పార్టీ ప్రజామోదంతోనే , ప్రజాతీర్పుతోనే ప్రభుత్వాన్ని నడుపుతోంది . అది ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకొంది , ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అని ఆరోపించిన ప్రతిపక్షం బహిరంగ ప్రజాస్పందనలో దాన్ని ప్రతిబింబించగలగాలి , దాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వస్తే మీ టీడీపీ వారు రాజీనామా చేసి ప్రజాతీర్పుతో గెలిచి మీ వాదనే కరెక్ట్ అని నిరూపించుకోవాలి కానీ అన్ని ప్రాంతాల నుండి 151 మంది ఎమ్మెల్యేలు , 22 మంది ఎంపీలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కాదు రాజీనామాలు చేయాల్సింది .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp