బాబెప్పుడో ఓడిపోయాడు!

By Kiran.G Aug. 03, 2020, 02:21 pm IST
బాబెప్పుడో ఓడిపోయాడు!

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయం తుది అంకానికి చేరింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుకు ఆమోదముద్ర వేస్తూ గవర్నర్‌ సంతకం కూడా అయిపోయింది. దీంతో అమరావతి ఒక్కదానినే రాజధానిగా కొనసాగించాలని పోరాడుతున్న టీడీపీ సహజంగానే గవర్నర్‌ నిర్ణయంపై విరుచుకుపడింది. అనుకూల మీడియా సంగతి సరేసరి. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వారు ప్రజలే కారన్నట్లు, వారికి ఏమీ అవసరం లేదన్నట్లు ఆ వర్గ మీడియా తాపత్రయం అంతా ఇంతా కాదు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం తీరుపై యథాప్రకారం మండిపడ్డారు. అమరావతిపై అన్ని విధాలా పోరాడతామని, అవసరమైతే తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా సైతం చేస్తారని అన్యాపదేశంగా చెప్పారు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన బీటెక్‌ రవి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదీ స్పీకర్‌ ఫార్మాట్‌లో కాకుండా నేరుగా అధ్యక్షుడికి లేఖ రూపంలో సమర్పించడం గమనార్హం. బీటెక్‌ రవిలాగే తమ పార్టీలోని మిగిలిన సభ్యులూ రాజీనామా చేస్తారని ఆశించిన చంద్రబాబుకు నిరాశే మిగిలింది. మిగిలినవారు రాజీనామాకు ససేమిరా అనడంతో ఒక దశలో తానే రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, దానికీ ఆయన వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. తాను రాజీనామా చేసి వెళ్లినా ఈసారి కుప్పం నుంచి తిరిగి గెలిచే అవకాశం లేదని తెలియడంతో మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఇప్పటికే కుప్పం నుంచి కేడర్‌ సగానికి పైగా జారిపోవడం, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల జోరుతో తాను తిరిగి గెలిచే అవకాశమే లేదని ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అదీ గెలుపేనా?

14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లకు పైగా ప్రతిపక్ష నేత, ఏడుసార్లు శాసనసభ్యునిగా ఎంపిక.. ఇదీ టీడీపీ అధినేత రాజకీయ ప్రస్థానం. అంతేకాదు, ఆయనో గొప్ప విజనరీ అని, టెక్నాలజీ రంగానికి పితామహుడని, హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టినవాడని అనుకూల మీడియా, అభిమానులు చేసే ప్రచారమూ సరేసరి. అయితే, ఇదంతా నిజమేనా? అంటే దానికి బాబు సొంత నియోజవర్గం కుప్పం ఎన్నికలే సాక్ష్యం చెబుతాయి. 2004 నుంచి చూసుకుంటే ఏటా ఆయన మెజారిటీ తగ్గుతూనే వస్తోంది. ఆ ఎన్నికల్లో ఆయనకు సుమారు 60వేల పైన ఆధిక్యం రాగా, ఆ తరువాత 2009లో 49 వేలు, 2014లో 47 వేలు ఆధిక్యం వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ కేవలం 26వేలు. అంటే ఓ పదివేలు అటు పడి ఉంటే ఆయన గెలుపు డోలాయమానం అయి ఉండేది. మరి పైన చెప్పుకున్నట్లు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయి ఉండి కూడా ఎందుకు ఆయన మెజారిటీ భారీగా తగ్గిందో టీడీపీ అనుకూల మీడియాకు, ఆ పార్టీ కార్యకర్తలకు కనిపించదు.

ఒకవేళ పులివెందులలో వైఎస్‌ జగన్‌కు గత ఎన్నికల కంటే ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా టీడీపీ నాయకులు, అనుకూల మీడియా తీరు ఏ స్థాయిలో తీరు ఎలా ఉండేదో తెలియనిదేమీ కాదు. జగన్‌ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యాడని, టీడీపీ పాలనలో అభివృద్ధి అద్భుతంగా జరగడం వల్లే జగన్‌ మెజారిటీ తగ్గిందని ఊదరగొట్టేవి. జగన్‌ నైతికంగా ఓడిపోయాడని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు సైతం చేసేవి. నిజానికి వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ మెజారిటీ కోల్పోతూ వచ్చిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఆయన గెలిచాడు అనడం కంటే నైతికంగా ఓడాడు అనేదే సత్యం. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రమౌళి స్థానికేతరుడు, ఆయనకు పెద్ద రాజకీయ చరిత్ర ఏమీ లేదు. అలాగే ధనవంతుడూ కాదు. మీడియా అండదండలూ లేవు. అన్నింటికంటే ముఖ్యం గత ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా ఆయన ప్రచారానికే వెళ్లలేదు. అయినా సరే ఆయన చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. ఇవన్నీ చంద్రబాబు తెలియనివి కావు. అందుకే ఇప్పుడు రాజీనామా చేసి తన రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి కట్టుకోలేడు. చివరగా చెప్పొచ్చేదేంటంటే బాబెప్పుడో ఓడిపోయాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp