అమరావతిలో 13 మంది జడ్జీలకు భూములు...వివరణ ఇచ్చిన చంద్రబాబు

By Dutt.R Sep. 18, 2020, 01:00 pm IST
అమరావతిలో 13 మంది జడ్జీలకు భూములు...వివరణ ఇచ్చిన చంద్రబాబు

అమరావతి ప్రాంతంలో 13 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు భూములను ఇచ్చారు. తాను తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నారు.

అమరావతి ప్రాంతంలో 13 మంది హైకోర్టు న్యాయమూర్తులకు భూములు ఇచ్చిన నిర్ణయాన్ని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధించుకున్నారు. కొత్త రాజధానిలో నివాసం ఏర్పరచుకుంటే వేగంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో న్యాయమూర్తులకు, ఐఏఎస్ లకు భూములు ఇచ్చినట్లు తెలిపారు. కానీ దీనిపై వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తోందని విచారణ వ్యక్తం చేశారు. 16 నెలల వైసీపీ పాలనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకుండా రాజ్యసభలో న్యాయవ్యవస్థ గురించి మాట్లాడమేంటని మండిపడ్డారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు కోసం మిగిలిన రాష్ట్రాల ఎంపీలు ఆందోళన చేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు.

అనుమానాలు

చంద్రబాబు న్యాయమూర్తులకు భూముల కేటాయింపుపై వివరణ ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. న్యాయమూర్తులకు భూములు కేటాయించడం ఒక కారణమైతే ఎన్నికల వేళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి భూకేటాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారం లేకపోయినా ఆఘమేఘాల మీద చంద్రబాబు ఈ భూకేటాయింపులు చేయడం వెనుక ఉద్దేశాలు ఏంటనే వాటిపై చర్చ జరుగుతోంది.

'న్యాయమూర్తులు స్వతంత్రంగా ఉండేందుకు తమ జీవితాలను బ్యాలన్స్ చేసుకోవలసి వస్తోందని స్వీయ ఆంక్షల మధ్య న్యాయమూర్తులు ఉండవలసి వస్తోందని' సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పింది అక్షరాల నిజం... వాస్తవం కూడా. తమకు న్యాయం జరగాలంటే కోర్టులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉంటారు. న్యాయమూర్తులను దేవుళ్ళగా ప్రజలు భావిస్తుంటారు. ఈ నమ్మకాన్ని ప్రజలలో సడలకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా న్యాయమూర్తులపైన ఉంది.

ఆ బాధ్యత మీదే

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో 'పున్నమి ఘాట్'లో సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులకు విందు ఇచ్చారు. ఈ విందులో కొందరు న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. ఈ విషయంలోనే పలు అనుమానాలు తలెత్తాయి. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తుంటారని విమర్శలు చేస్తున్న వారికి ఇది ఒక అవకాశాన్ని ఇచ్చినట్లు అయింది. చంద్రబాబు న్యాయమూర్తులకు ఇచ్చిన విందుతో పలు అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు న్యాయమూర్తులు వెళ్ళకూడదని ఎక్కడా చట్టంలో లేకపోయినా ప్రజలలో న్యాయమూర్తులపై సందేహాలు తలెత్తడానికి బీజం పడింది.

కోర్ క్యాపిటల్ లో న్యాయమూర్తులకు, ఐఏఎస్ లకు భూములు ఇస్తే రాజధాని వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పిన చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నపుడే ఈ భూముల వితరణ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 13 మందికి భూముల రిజిస్ట్రేషన్ 24 ఏప్రిల్ న జరగడం గమనార్హం. న్యాయమూర్తులకు చెప్పేంత గొప్పవారం కాకపోయినా ఈ అనుమానాల ప్రవాసానికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత కూడా వారి చేతులలోనే ఉందంటూ న్యాయనిపుణులు చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp