అల్లం.. బెల్లం..

By Jaswanth.T Aug. 08, 2020, 07:42 pm IST
అల్లం.. బెల్లం..

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా తియ్యగా ఉంటుంది.. అన్నాడట వెనకటికొక ‘తెలివైనోడు’. రాష్ట్రంలో సీనియర్‌ మోస్ట్‌ పొలిటీషియన్‌ (సందేహాలుంటే.. మాకు సంబంధంలేదు) అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి కూడా ఇప్పుడలాగే ఉంది. రాష్ట్ర ప్రజలకు అంతా తెలిసిన విషయాన్నే మళ్ళీ.. మళ్ళీ తనకు అనుకూలంగా చెప్పుకుంటూ జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పైగా తన సొంత అమరావతి పోరాటాన్ని రాష్ట్ర ప్రజలందరి పోరాటంగా చూపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని విశ్లేషకుల నిశ్చయ అభిప్రాయం. తాను అధికారంలో ఉంటే ఏ మాత్రం పెదవి విప్పని పలు విషయాలు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దవిగా కన్పిస్తున్నాయి ఆయకు. ఆయనకు కన్పించిన సమస్యలను భూతద్ధంలో చూపించేందుకు వెంటనే మేళం వాయించే మీడియా శతవిధాలా ప్రయత్నించడాన్ని రాష్ట్రప్రజలు గుర్తిస్తున్నారు.

అమరావతి విషయంలో 48 గంటల డెడ్‌లైన్‌ విషయంలో తేలిపోయిన చంద్రబాబు.. తాజాగా మొదలు పెట్టిన జూమ్‌ యుద్ధం మరోసారి ఆయన వాదనలోని పసలేనితనాన్ని తేటతెల్లం చేస్తోంది. హైదరాబాదులో హైటెక్‌సిటీకి తానే ఆధ్యుడినని చెప్పుకోవడాన్ని తెలంగాణారాష్ట్ర ప్రస్తుత సీయం కేసీఆర్‌ ఏనాడో ఎద్దేవా చేసేసారు. ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా నారా వారు ఇతర విషయాలపైకి జనం దృష్టికి మరల్చేందుకు కృషి చేసేవారు. తాజాగా ఇప్పుడు అమరావతి విషయంలో కూడా ఇదే విషయం పునరావృతం అవుతోంది. సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌ రాజధానిని తాను సృష్టించానన్నది చంద్రబాబు వాదన. రాష్ట్ర ప్రజల ముందు అమరావతి రూపంలో తాను చేసిన మహాద్భుతాన్ని వివరిస్తున్న చంద్రబాబు సింగపూర్‌ కన్సార్టియం కొనసాగే విధంగా ఎందుకు నచ్చజెప్పలేకపోయారు? అన్నదే మిలియన్‌డాలర్లను మించిన ప్రశ్నగా మారింది.

లాభసాటి అయితేతప్ప ముందుకు రాని కార్పొరేట్‌ కంపెనీ ‘అమరావతి’లో సమకూరే ప్రయోజనాన్ని బేరీజు వేసుకున్నాకనే, అందులోనుంచి తప్పుకుందన్నది ఒక వర్గం వాదన. దీనికి సూటిగా సమాధానం చెప్పని చంద్రబాబు, తాను చెప్పదల్చుకున్నది మాత్రమే చెబుతూ తన మాట నమ్మేవారికి మానసిక సంతృప్తతను ప్రసాదిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో కులకుంపట్లు పెరగడానికి ప్రత్యక్షంగా నారా పెదబాబు, చినబాబులేనని జనం ఏకతాటిగా చెప్పుకుంటుంటారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడంతో మొదలు పెడితే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల రూపంలో పారిశుద్ధ్యకార్మికుల కాంట్రాక్టులు నిర్వహించే వరకు ఏ సామాజికవర్గం వారు పెత్తనం చేసారో రాష్ట్ర ప్రజలు మర్చిపోయింది కాదు. ఇలా తోసుకువచ్చిన పెత్తందార్లంతా చంద్రబాబుకు తెలియనివారేనా? తెలియకుండా వచ్చినవారేనా? అన్న ప్రశ్నకు కూడా చంద్రబాబు జవాబు చెబుతారనే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

అయితే వీటన్నిటినీ పక్కన పెట్టేసి యేడాది క్రితం ఎన్నికల ముందు చెప్పిన పాఠాన్నే మరోసారి జూమ్‌ మీటింగ్‌ల ద్వారా జనానికి గుర్తు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చంద్రబాబుకే ఎరుక. అమరావతి, పోలవరం.. ప్రత్యర్ధుల అవినీతి అంటూ.. ఎన్నికల ముందు చెబితేనే జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చెబితే ఎవరు పట్టించుకుంటారు? అని ప్రత్యర్ధులు వేస్తున్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ‘నూనూ ఉన్నాను’ అన్నది చెప్పుకోవడానికి తప్పితే ఇప్పుడు నారా వారు చేస్తున్న ప్రయత్నం ఎందుకూ కొరగానిదేనన్నది పలువురి విశ్లేషకుల అభిప్రాయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp