చంద్రన్నతో కలిసొచ్చేదెవ్వరు..?

By Jaswanth.T Aug. 09, 2020, 09:15 pm IST
చంద్రన్నతో కలిసొచ్చేదెవ్వరు..?

తన రాజధాని అమరావతిని సాధించుకోవడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు కలిసొచ్చే రాజకీయ పార్టీలు, నాయకులు ఎవ్వరు అన్నదానిపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా సమాచారం. మూడు రాజధానుల అంశాన్ని శాసనసభలో సీయం జగన్‌ వెల్లడించిన వెంటనే అక్కడున్న అన్ని పార్టీలు ఏకతాటిపై వ్యతిరేకిస్తూ బైటకొచ్చేసాయి. పోరాడేద్దాం, సాధించేద్దామంటూ నినాదాలు కూడా చేసాయి. ఆ ఊపు చూసుకుని అందరూ మనవైపు ఉన్నారనుకుని అమరావతి పోరాట జెండాను చంద్రబాబు భుజం మీద ఇంకాస్త గట్టిగానే పట్టుకున్నారు. దీనికి తోడు అమరావతి రాకపోతే నష్టపోయే అనుచరగణం ఒత్తిడి ఉండనే ఉంది. దీంతో పోరాటం స్పీడుగానే ప్రారంభించారు. అయితే రాన్రాను ఆ స్పీడు దాదాపు నెమ్మదిస్తోందన్ని రాజకీయవర్గాలు ఘంటాపథంగా చెబుతున్న మాట.

బీజేపీని మంచి చేసుకోవడం ద్వారా సీయం జగన్‌ను ఇరుకున పెడదామనుకున్న ఆలోచనతో చంద్రబాబు మోడీ జపం అందుకున్నారు. కానీ చంద్రబాబుపై పూర్తి విరుద్ధభావంతో ఉన్న సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పీఠం ఎక్కించారు. దీంతో చంద్రన్న ఆశలు ఆదిలోనే నెరవేరలేదు. జనసేన అయినా కలిసొస్తుందేమో అనుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. బీజేపీతో జతకట్టడంతో జనసేన అధినే పవన్‌కళ్యాణ్‌ కూడా ముందున్నంత స్పీడు స్టేట్‌మెంట్లు, ప్రెస్‌నోట్లు రాజధాని విషయంలో ఇప్పుడు విడుదల చేయడం లేదు. తోడొస్తాయనుకున్న ఇతర వామపక్ష పార్టీలు కూడా దాదాపు ఇదే పంథాలు కొనసాగుతున్నాయన్న వాస్తవం ఇప్పుడిప్పుడే టీడీపీ నాయకులకు బోధపడింది. దీంతో తమ సొంత రాజధాని అమరావతి సాధన పోరాటంలో తమ దిక్కెటు అన్న మీమాంశలో పడ్డట్టుగా రాజకీయవర్గాల్లో చర్చజోరుగానే జరుగుతోంది.

ఇక అమరావతిపై మాట్లాడిన ప్రతిసారీ చంద్రబాబు 4గ్రామాల కోసం మాత్రమే పోరాడుతున్నారు, మేమే రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి గురించి కార్యాచరణ అమలు చేస్తున్నామంటూ అధికారపార్టీ చేస్తున్న ఎదురుదాడికి సమాధానం చెప్పేందుకు కూడా టీడీపీ నుంచి బలమైన గొంతు విన్పించలేని పరిస్థితి ఇప్పటికే ఉంది. తాను సృష్టించిన అమరావతి మాయా వ్యూహంలో చిక్కుకున్న వాళ్ళకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఒకవైపు, రాజధానిపై పట్టు సడలని పోరాటం చేయలేని అసహాయత ఒకవైపు ప్రస్తుతం చంద్రబాబును నిలవనీయడం లేదన్నది ఆ పార్టీ నేతల నుంచే వినవస్తున్న మాట. ఇక్కడ ‘చంద్రబాబు అమరావతి’ పోరాటం నుంచి నిష్క్రమించడంలో ఏ పార్టీ నాయకులకు వారి కారణాలు బలంగానే ఉన్నాయి. కానీ పోరాటం కొనసాగించే శక్తిమాత్రం టీడీపీకి ఉన్నట్లు తోచడం లేదన్నది ప్రస్తుతం నడుస్తున్న టాక్‌.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp