ప్రపంచ స్థాయి నుంచి - గ్రామ స్థాయికి పడిన చంద్రబాబు

By Surya.K.R Jan. 18, 2020, 12:24 pm IST
ప్రపంచ స్థాయి నుంచి - గ్రామ స్థాయికి పడిన చంద్రబాబు

"తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు" అనే సామెతను నిజం చేస్తున్నాడు నేటి ముఖ్యమంత్రి వై.యస్ జగన్ . శత్రు రాజుని నిర్వీర్యం చేయాలంటే ముందు అతనిని బలహీన పరచాలనే కౌటిల్యుని సూత్రాన్ని ఆకళింపు చేసుకున్నారా అనేంతగా ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ఎత్తులు ఉంటున్నాయి. జగన్ తన ప్రధాన ప్రత్యర్ధి గా భావించే చంద్రబాబు అనుభవాన్ని దక్షతను నిర్వీర్యం చేసి అతని బలాన్ని కుదించే ఎత్తు వేసినట్టు కనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయం అంతా ప్రచార ఆర్బాటం మీదే మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి వర్దిల్లిందనేది తెలిసిన విషయమే. గోరంత పనికి పత్రికల చేత కొండంత ప్రచారం చేయించుకుని తాను ఒక ప్రపంచ స్థాయి నాయకుడిననే భ్రమ దశాబ్దానికి పైగా కష్టపడి 2014 నాటికి ప్రజల్ల మస్తిష్కంలోకి బలంగా ఎక్కించారు.

హైదరాబాద్ ని నేనే ప్రపంచ పఠంలో పెట్టాను, నాకు బిల్ గేట్స్ స్నేహితుడు, ఇజ్రాయిల్ తరహా వ్యవసాయం, విజన్ 20-20, ప్రపంచంలో మొట్టమొదట ఐ.టిని ప్రమోట్ చేసింది నేనే, సెల్ఫొన్లు తెచ్చింది నేనే, అబ్దుల్ కలాం ని నేనే రాష్ట్రపతిని చేసింది, అంబేద్కర్ కి భారత రత్న నేనే ఇప్పించా, వాజ్ పాయి ని , దేవెగౌడని నేనే ప్రధానిని చేశా లాంటి మాటలు పదే పదే చంద్రబాబు చెప్పుకోవటం వెనక ఉన్న అజెండా తనకి తనని ఒక బ్రాండ్ గా మలుచుకోవటానికే. ఇందులో అసత్యాలు, అర్ధ సత్యాలు అధికంగా ఉన్నా ప్రజల మనసుల్లో మాత్రం ఇవన్నీ చంద్రబాబు అపారమైన తన పాలనా దక్షతతో సాధించిన ఘనతలే అని ముద్ర పడేలా పత్రికల్లో సాగిన ప్రచారంతో నేటికి చంద్రబాబు ఒక విజనరీ అని నమ్మేవారు లేకపోలేదు.

10ఏళ్ళ తరువాత 2014 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ప్రచారానికి రాజధాని పేరిట అమరావతి అనే బ్రాండ్ ని ప్రజల ముందుకు తెచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని నెరవేర్చకుండా రాష్ట్రమే రాజధాని, అమరావతే ఒక రాష్ట్రం అనే విధంగా పత్రికల్లో మీడియా ఛానళ్ళలో సాగిన ప్రచారంతో రాష్ట్రం హోరెత్తిపోయింది. పెట్టుబడులు అంటు ఏదో ఒక దేశం వెళ్లటం ఆ దేశం నుండి వచ్చి అమరావతిని ఆ దేశం మాదిరి తయారు చేస్తా అని చెప్పటం, బుల్లెటు రైళ్లు తెస్తా అనటం, ఆఖరికి అమరావతిలో ఎండ తీవ్రత లేకుండా టెక్నాలజీ ఉపయోగించి చల్లని వాతవరణం సృష్టిస్తా అని చెప్పటం, మీడియాలో, సోషల్ మీడియాలో అమరావతి ఇక ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పటంతో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో కొంతమంది ప్రజలు నిజంగానే మన రాజధాని ప్రపంచంలోనే అత్యుత్తమ మహా నగరం అవుతుంది అని నమ్మారు.

నిజానికి గడిచిన 5 ఏళ్ళలో రాజధాని పేరిట ఆ ప్రాంతంలో ఒక్క శాశ్వత కట్టడం కట్టకపొయిన అమరావతి అంటే బాబు , చంద్రబాబు కలల రాజధాని అమరావతి అని ఒక బ్రాండ్ ని తయారు చేయటంలో తెలుగుదేశం పూర్తిగా విజయవంతమైందనే చెప్పాలి. దీనికి తోడు ఆ ప్రాంతంలో భారీ భూ కుంభకోణంతో పాటు రైతుల భూమితో రియలెస్టేటు వ్యాపారం చేశారని తెలుస్తుంది. రాష్ట్రం విడిపోయి రాజధానిని కోల్పొయి పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన అనుభవంతో మేలు చేస్తాడని 13 జిల్లాల ప్రజలు ఆశించి చంద్రబాబుని ముఖ్యమంత్రి పీఠం మీద కుర్చోపెడితే బాబు మాత్రం సామాజిక వర్గ లెక్కలతో రాజధాని నమూనా తయారు చేశారు. దానికి తగ్గట్టు ఒక బ్రాండ్ ని తయారు చేశారు, రాష్ట్ర ప్రజల మనోభావాలను గాలికి వదిలి కుంభకోణంకి తెరలేపారు. ఫలితంగా ఇదే మా రాజధాని అని రాష్ట్ర ప్రజలు చెప్పుకోవటానికి ఆ ప్రాంతంలో ఒక్క శాశ్వత కట్టడం కూడా లేకుండా పొయింది. ఇప్పుడు అక్కడ ఉన్నదల్లా తెలుగుదేశం బినామీల ఆస్తులే.

2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్ తెలుగుదేశం రాజధాని పేరుతో ఎలా కుంభకోణంకి పాల్పడ్డారో ఆదారాలు రుజువులుతో ప్రజల ముందు పెట్టారు, అలాగే తన అజెండాలో రాష్ట్ర అభివృద్దికి అతి ముఖ్యమైన పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి పెట్టారు. అమరావతి తో పాటు విశాఖను , కర్నూలు కూడా రాజధాని చేయటం ద్వారా రాష్ట్రంలో అబివృద్ది ఫలాలు అందరికి సమానం గా చేరి ప్రాంతాల మద్య అసమానతలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చంద్రబాబుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అమరావతిపై అనుకూల మీడియా ప్రచారంతో తాను సంపాదించిన బ్రాండ్ ముద్ర, వేసుకున్న సామాజిక లెక్కలు, సమకూర్చుకున్న బినామీల ఆస్తులు ఒక్కసారే కుప్పకూలటంతో చంద్రబాబు అన్ని వైపుల నుంచి తీవ్ర వత్తిడికి లోనయినట్టు కనిపిస్తుంది.

దీంతో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల ప్రజల అభీష్టం సైతం పక్కన పెట్టి రాజధానిలో కుటుంబ సమేతంగా 29 గ్రామాలకోసం పోరాటం అంటూ జోలె పట్టి తిరుగుతున్నారు. చంద్రబాబు పడుతున్న ఆయాసానికి 29 రాజధాని గ్రామాల్లో కూడా పూర్తి స్థాయి మద్దతు దొరకకపోవటానికి కారణం దోచుకున్న ఆస్తుల కోసమే చంద్రబాబు పోరాటం అనే భావన ప్రజల్లో రావడం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, విభజన తరువాత 13 జిల్లాలకు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నేడు తన బ్రాండ్ ని కాపాడుకునే మోజులో పడి 29 గ్రామాలకి నాయకుడిగా దిగజారిపోయారు అనేది సుస్పష్టం. చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ మండలాధ్యక్షుడు మాదిరి వ్యవహరిస్తున్నారు అనే భావన 13 జిల్లాల ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇన్నేళ్ళుగా నిర్మించుకున్న అనుభవం , జాతీయ నాయకుడనే పేరు అమరావతి మోజులో భూస్థాపితం అయిపోయింది.

ఏ అమరావతి పేరు మీద తన ముద్రని రాష్ట్రం మీద చిరస్థాయిగా వేద్దాం అనుకున్నారో అదే అమరావతి పేరు మీద ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు ఎన్నో ఏళ్ళుగా పెంచుకున్న ప్రపంచ స్థాయి నాయకుడనే పేరు ఆవిరయ్యేలా చేసి తన వ్యూహరచనతో చంద్రబాబును సైతం బోల్తా కొట్టించి సిసలైన చాణక్య నీతిని ప్రదర్శించారు. అమరావతి పేరు మీద జరిగిన అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేసి, రాష్ట్రంలో అసమానతలు కనుమరుగయ్యేలా అభివృద్ది, పరిపాలనా వికేంద్రీకరణతో వెనకబడిన రాయలసీమ , ఉత్తరాంధ్రలకు పెద్దపీట వేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు మన్ననలు పొందుతున్నారు. రాజధాని పేరు మీద భూములు ఇచ్చిన రైతులకు సరైన న్యాయం చేయటానికి కూడా ప్రభుత్వం సిద్దమైంది. మొత్తం మీద దేశంలో చక్రం తిప్పా అని చెప్పుకునే చంద్రబాబుని తన వ్యుహ రచనతో ప్రజల ముందు దోషిగా నిలబెట్టి గ్రామస్థాయి నాయకుడిగా దిగజార్చారు జగన్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp