బాబు ఉన్నా.. లేకున్నా.. లోకేష్‌కు ఆ ఛాన్స్‌ లేనట్లేనా..?!

By Kotireddy Palukuri Oct. 20, 2020, 10:01 am IST
బాబు ఉన్నా.. లేకున్నా.. లోకేష్‌కు ఆ ఛాన్స్‌ లేనట్లేనా..?!

నాయుడు కొడుకు వచ్చాడు.. నాయకుడై వచ్చాడు.. అంటూ టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు మాజీ మంత్రి నారా లోకే ష్‌ను ఆకాశానికెత్తుతుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం అంత సీను లేదని తేల్చేస్తున్నారు. లోకేష్‌ భవిష్యత్‌ ఏమిటో కూడా చెప్పేస్తున్నారు. బాబు ఉన్నా.. లేకున్నా.. లోకేష్‌ ముఖ్యమంత్రి పదవికి కనీసం పోటీలో కూడా ఉండబోరని చెబుతున్నారు. సోమవారం ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా నియమితులైన మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు చేసిన ప్రకటనతో.. నారా లోకేష్‌ భవిష్యత్‌పై ఓ క్లారిటీ వచ్చింది.

అధ్యక్ష పదవి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అచ్చెం నాయుడు... కష్టపడి పని చేసి మళ్లీ నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. అంటే 2024లోనూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడేనని అచ్చెం నాయుడు కుండబద్ధలు కొట్టారు. అయితే మరో వైపు టీడీపీ భవిష్యత్‌ నేత, ముఖ్యమంత్రి నారా లోకేష్‌ అనే ప్రచారం టీడీపీ శ్రేణులు చాలా కాలంగా చేస్తున్నాయి. బాబు కూడా తన కుమారుడును ముఖ్యమంత్రిగా చేయాలనే ఆశతో.. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్‌ను పెద్దల సభకు పంపి.. మంత్రి పదవి కట్టబెట్టారు. నాయకుడిగా తీర్చి దిద్దేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ లోకేష్‌ శక్తి, సామర్థ్యంపై ఆది నుంచి ఒక అవగాహన ఉన్న టీడీపీ నేతలు మాత్రం లోకేష్‌ భవిష్యత్‌ ఏమిటో అర్థం చేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో లోకేష్‌తో పని కాదనుకున్నారు. బాబు ఉన్నంత వరకే తమకు టీడీపీలో భవిష్యత్‌ అని, ఆ తర్వాత టీడీపీ బండి లోకేష్‌ లాగడం కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్లు అచ్చెం నాయుడు ప్రకటనతో అర్థం అవుతోంది.

ప్రస్తుతం చంద్రబాబు వయస్సు 71 ఏళ్లు.. 2024 నాటికి 75 ఏళ్లకు చేరుకుంటుంది. ఇప్పటికే వయస్సు, ఆరోగ్యం సహకరించక చంద్రబాబు నాయుడు జూమ్‌ మీటింగ్‌లకు పరిమితం అయ్యారు. ఫిజికల్‌గా పోరాడలేనని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. మరో వైపు నారా లోకేష్‌ నాయకత్వం ఏమిటో అందరికీ అర్థం అయింది. చంద్రబాబు 71 ఏళ్లలో ఉన్నప్పుడే టీడీపీ సీనియర్‌ నేతలు నారా లోకేష్‌ను కనీసం తమ పార్టీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పడం లేదంటే.. బాబు తర్వాత నారా లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ ఏమిటో అర్థం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడే.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ భావి ప్రధాని రాహుల్‌ గాంధీ అని ప్రకటనలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే స్లోగన్‌ వినిపిస్తున్నారు. కనీసం ఇలాంటి ప్రయత్నం కూడా నారా లోకేష్‌ విషయంలో టీడీపీ నేతలు చేయకపోవడం విశేషంగానే చెప్పుకుంటున్నారు. మరి బాబు తర్వాత టీడీపీ నాయకుడు ఎవరు..? అనేది కాలమే తేల్చాలి.

Read Also; అన్నన్నా.. అచ్చెన్నా..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp