బాబుకి 23న గట్టిగానే తగిలేట్టుంది..!

By Jaswanth.T Nov. 19, 2020, 09:01 am IST
బాబుకి 23న గట్టిగానే తగిలేట్టుంది..!

లక్షలాది ఇళ్ళుకట్టించేసాం.. వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్‌కు అభ్యంతరం ఎందుకు.. వాటిని వెంటనే లబ్దిదారులకు ఇచ్చేయాలి.. లేకపోతే మేమే వాటిని స్వాధీనం చేసుకుని లబ్దిదారులకు పంపిణీ చేస్తాం.. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఈ తరహా వ్యాఖ్యలు, కామెంట్లు పోటాపోటీగా విన్పించేస్తున్నాయి. కట్టిందే అరకొర, వాటిలో మౌలిక వసతుల్లేవు, వాటిని పూర్తిచేసి అప్పుడు ఇస్తాం.. అంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు.

అయితే సీయం వైఎస్‌ జగన్‌ సమీక్షలో ఇళ్ళపై ప్రత్యర్ధులు చేయతలపెట్టిన రాద్దాంతాలన్నింటికీ ఒక్కటే సమాధానంగా చెప్పేసారు. డిసెంబర్‌ 25న ఇంటి స్థలంతోపాటు, టిడ్కో ఇళ్ళను కూడా లబ్దిదారులకు అందజేస్తామంటే తేల్చేసారు.

ఈ తేల్చడంలో కూడా నానా రాద్దాంతం చేసిన ప్రత్యర్ధుల తలబొప్పికట్టే విధంగానే వ్యూహ రచన చేసారని పరిశీలకులు భావిస్తున్నారు. 23వ తేదీన జగన్‌ స్కీమ్‌ కావాలా? చంద్ర బాబు స్కీం కావాలా? అని సదరు లబ్దిదారుల వద్దకు వాలంటీర్లు వెళ్ళి అభిప్రాయం అడుగుతారని ప్రకటించి ప్రత్యర్ధుల గుండెల్లో బాంబు పేల్చారు.

ముందుగా చంద్రబాబు స్కీమ్‌ను గురించి మాట్లాడితే.. ఒక్కో ఇంటిపై 3 లక్షల రూపాయల అప్పును నెలకు రూ. 3వేలు చొప్పున 20 ఏళ్ళపాటు వడ్డీతో సహా కట్టాలి. ఈ మొత్తం దాదాపు ఏడు లక్షల రూపాయలు ఉంటుంది. ఆ తరువాతే ఆ ఇంటిపై హక్కులు లబ్దిదారుడికి వస్తుంది.

ఇక జగన్‌ స్కీం గురించి మాట్లాడితే ఎటువంటి అప్పు లేకుండా కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే వెంటనే అగ్రిమెంట్‌ ఆఫ్‌సేల్‌ లబ్దిదారుని పేరిట ఇచ్చేస్తారు. తరువాత పక్కాగా ఉచిత రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

ఈ రెండింటి వివరాలతో కూడిన లెటర్‌ను లబ్దిదారుల వద్దకు తీసుకు వెళ్ళి ఇందులో మీకే స్కీమ్‌ కావాలో చెప్పమని వారి అభిప్రాయాన్ని కోరతామని జగన్‌ ప్రకటించేసారు.

సాధారణంగా ఇరవయ్యేళ్ళ పాటు అప్పులు చెల్లించమంటే ఎవరు చెల్లిస్తారు. ఉచితంగా వెంటనే ఇల్లు ఇచ్చే పథకంవైపు నూటికి నూరుశాతం మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. పైగా ఓర్నీ మూడు లక్షల అప్పుకు ఇరవయ్యేళ్ళ పాటు, ఏడు లక్షలు కట్టాల్సి వచ్చేదా? అంటూ జన సమాన్యంలో తీవ్రమైన చర్చకూడా చోటు చేసుకుంటుంది.

లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వడం లేదంటూ నెగటివ్‌ పబ్లిసిటీని క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించి ప్రతిపక్షాలకు జగన్‌ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా పెద్దదెబ్బేనని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. అప్పుడెప్పుడో మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ ప్రతిపక్షాలు కెలికి వెలికితీసాయంటున్నారు.

వాస్తవానికి అధికారం కోల్పోయింది మొదలు చంద్రబాబు అన్నీ ముందుగానే చేసేస్తున్నారన్న అభిప్రాయం పరిశీకుల్లో లేకపోలేదు. జగన్‌ చేద్దామనుకున్న ప్రతిపనికి అడ్డం తగులుతూ అష్టదిగ్భంధనం చేస్తున్నారు. తద్వారా పాలన ముందుకు కదలకుండా చేయగలిగానన్న స్వల్ప సంతృప్తికి మాత్రమే సరిపెట్టేసుకుంటున్నారంటున్నారు. అదే సమయంలో జగన్‌ మాత్రం తన పనికి అడ్డుతగులతున్న వారిని గురించి నేరుగా ప్రజల ముందే పెట్టేస్తున్నారు. తద్వారా ఎవరైతే అడ్డుకుంటున్నారో వారివైపే ఆ నెగటివ్‌ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.

దీంతో పనులు జరక్కుండా ఆగిపోయినప్పటికీ తన ప్రభుత్వంపై ప్రజల్లో ఆ వ్యతిరేక భావనలు పెరక్కుండా వ్యూహరచన చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించకుండా ప్రత్యర్ధులు ప్రతి అంశాన్ని పెద్దది చేసి వారి జబ్బలు వారే చరుచుకుంటున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ళ పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషిస్తున్నారు. తీరా ఇప్పుడు జగన్‌ నేరుగా లబ్దిదారుల వద్దకే వెళ్ళి అభిప్రాయం అడుగుదాం అనేసరికి ప్రత్యర్ధుల వ్యూహం బెడిసికొట్టినట్టేనంటున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఇప్పుడే వ్యూహం వైపు మరలుతారో వేచి చూడాల్సిందేనంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp