అమరావతి కోసం అక్కడ నుంచి హంగామా..!

By Voleti Divakar Aug. 02, 2020, 06:40 pm IST
అమరావతి కోసం అక్కడ నుంచి హంగామా..!

అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి అని గొప్పలు చెబుతున్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్కడ సొంత స్థలాన్ని, నివాసాన్ని కూడా సమకూర్చుకోకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ఓటుకు నోటు కేసు నేపథ్యంలో హడావుడిగా రాజధానిని అమరావతికి తరలించేశారు. ఐదేళ్లు పాలించిన ఆయన అమరావతిలో కనీసం ఒక్క పూర్తిస్థాయి నిర్మాణాన్ని కూడా చేపట్టలేకపోయారు. ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తున్నారంటూ హైదరాబాద్ నుంచి హంగామా చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపగానే చంద్రబాబునాయుడు భావోద్వేగాలకు గురై, కన్నీరు పెట్టుకున్నట్లు టిడిపి అనుకూల మీడియా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా 200 రోజులకు పైగా సాగుతున్నా ఉద్యమానికి స్థానిక ప్రజల మద్దతు లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. అమరావతిలో రియల్ వ్యాపారం సాగించిన టిడిపి, రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే ప్రస్తుతం రాజధానికి మద్దతుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజధాని ఉద్యమానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ద్వారా రాజధానికి మద్దతుగా ఒక్క ప్రకటన చేయించలేకపోవడం గమనార్హం.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని చేతులు దులిపివేసుకుంది. బిల్లుల ఆమోదానికి ముందు గవర్నర్ డిల్లీలోని న్యాయనిపుణులు, న్యాయశాఖతో సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది తమ రాష్ట్ర పార్టీ తీర్మానమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నోటిమాటగా తేల్చేశారు. ఆపార్టీతో పొత్తు కట్టిన జన సేనాని పవన్ కల్యాణ్ కూడా బిజెపి బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరెండు పార్టీలు మాత్రం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్ కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

అయితే చంద్రబాబు మాత్రం అమరావతి విషయంలో నానా హంగామా చేస్తున్నారు. ఇదంతా హైదరాబాద్‌లోని తన రాజభవనంలో నుంచి జూమ్‌ ద్వారా సాగిస్తున్నారు తప్పా రాష్ట్రానికి రావడం లేదు. అమరావతి విషయంలో తాను ఏ తప్పూ చేయలేదంటూ చెప్పుకొస్తున్నారు. తనపై అబాండాలు వేస్తున్నారని వాపోతున్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఆ విచారణను ఆపాలంటూ టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు ఎందుకు చేశారో మాత్రం చంద్రబాబు చెప్పడం లేదు. ఇవన్నీ ప్రజలు మరచిపోయి ఉంటారనే భావనలో చంద్రబాబు అమరావతి నా కోసం కాదు.. మీ కోసం అంటూ ఉద్యమాలు చేయాలని పిలుపునిస్తున్నారు. ఇన్ని చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్‌లోని తన రాజభవనం నుంచి బయటకు రాని విషయాన్ని ఆది నుంచి ఆయన మాటలు విని ఉద్యమం చేస్తున్న అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు గమనించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp