2019 ఎన్నికలను బాబు సీరియస్‌గా తీసుకోలేదా..?

By Karthik P Jun. 22, 2021, 08:16 pm IST
2019 ఎన్నికలను బాబు సీరియస్‌గా తీసుకోలేదా..?

ఎన్నికలంటే ఆషామాషీకాదు. ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. హామీలను తుత్తునియులు చేస్తూ.. అంతకు మించిన హామీలను ఇస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలి. ప్రత్యర్థి ప్రతి మాట, కదలికను గమనిస్తేగానీ ఇవన్నీ చేయలేరు. పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోను ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. 2019 ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదా..? ఓడిపోతామని ముందు ఆయనకు తెలిసే.. ఎన్నికల ప్రచారాన్ని లైట్‌ తీసుకున్నారా..? అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అవుననుకోవాల్సి వస్తోంది.

చేయూత మోసమా..?

ఏపీలో వైఎస్సార్‌ చేయూత పేరుతో మోసం జరుగుతోందంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నెలకు మూడు వేల రూపాయల చొప్పన ఇస్తామన్న పింఛన్‌ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. మూడు వేల చొప్పన ఐదేళ్లలో 1.80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. ఏడాదికి 18 వేల చొప్పన నాలుగేళ్లే ఇస్తున్నారని, తద్వారా ప్రతి మహిళలకు 1.05 లక్షలు ఎగనామం పెట్టారని విమర్శించారు. అదీ కొంత మందికే ఇస్తున్నారని ఈ రోజు వైఎస్సార్‌ చేయూత పథకం రెండో ఏడాది అమలు సందర్భంగా విమర్శలు చేశారు చంద్రబాబు.

Also Read : కాగ్‌ బయటపెట్టిన బాబు మద్యం అక్రమాల చిట్టా..!

చేసిన హేళన మరచిపోయారా..?

2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో.. తన పార్టీ అధికారంలోకి వస్తే.. ఏమేమి చేస్తామో వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు రెండేళ్ల ముందే నవరత్నాల పేరుతో పథకాలను ప్రకటించారు. ప్రజలకు సవివరంగా అర్థమయ్యేందుకు ఈ పంథాను అవలంభించారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు.. పిల్లలను చూసుకోవడం, ఇంటి పని చేస్తూ.. కుటుంబం గడిచేందుకు కూలి పనికి వెళుతుంటారు. ఈ తరహాలో పని చేసే మహిళలను 45–50 ఏళ్లకే నిస్సత్తువ ఆవరిస్తుంది. వారికి ఆర్థిక సాయం చేసేందుకు 45 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తానని నాడు సీఎం జగన్‌ చెప్పారు. అప్పటికి బాబు ప్రభుత్వం వెయి రూపాలయ చొప్పన పింఛన్‌ ఇస్తోంది. అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు ఇస్తానని జగన్‌ చెప్పారు.

ప్రజా సంకల్ప పాదయాత్రలోనూ వైఎస్‌ జగన్‌ ఈ హామీని గుర్తు చేశారు. అయితే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు, మంత్రులు.. ఈ పథకాన్ని అవహేళన చేసేలా మాట్లాడారు. 45 ఏళ్లకే పింఛన్‌ అంటున్నారు.. ముసలోళ్ల మాదిరిగా మహిళలను చిత్రీకరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల్లోనూ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జగన్‌ ఆలోచన మారింది. ఎలాగైనా సరే పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు అండగా ఉండాలని సంకల్పించారు. పథకంలో మార్పులు చేశారు. నెల వారీ పింఛన్‌ కాకుండా.. ఏడాదికి 18,750 రూపాయల చొప్పన నాలుగేళ్లలో 75 వేల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈ విషయాన్ని బహిరంగ సభల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఆ హామీని అమలు చేశారు. తాజాగా రెండో ఏడాది నగదును లబ్ధిదారుల ఖాతాల్లో ఈ రోజు జమ చేశారు.

Also Read : బాబు.. మోడీని ఒప్పిస్తారా..?

23 లక్షలు.. కొద్ది మందినా..?

వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 23,14,342 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని 45–60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు లబ్ధి జరుగుతోంది. వీరికి 18,750 రూపాయల చొప్పన ఈ రోజు 4,339.39 కోట్ల రూపాయలను జగన్‌ ప్రభుత్వం అందజేసింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదును జమ చేసింది. నాలుగేళ్లలో దాదాపు 19 వేల కోట్ల రూపాయలను అందించనుంది. దివ్యాంగ, ఒంటరి, వితంతు పింఛన్లు తీసుకుంటున్న 45–60 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు కూడా వైఎస్సార్‌ చేయూత పథకం అమలు చేస్తూ.. వైఎస్‌ జగన్‌ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. వీరి సంఖ్య మొత్తం లబ్ధిదారుల్లో ఆరు లక్షలు కావడం గమనార్హం. ప్రతి ఏడాది కొత్తగా అర్హత సా«ధించిన వారికి కూడా పథకం అమలు చేస్తున్నారు. ఇంత పక్కాగా పథకం ప్రకటించి.. విజయవంతంగా అమలు చేస్తుంటే.. మోసం చేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శిస్తుండడంతోనే.. 2019 ఎన్నికలను ఆయన లైట్‌ తీసుకున్నారా..? అనే అనుమానం కలుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp