ఆ 48 గంటలు .... చివరికి అనుకున్నదే జరిగింది .

By Sanjeev Reddy Aug. 05, 2020, 09:13 pm IST
ఆ 48 గంటలు .... చివరికి అనుకున్నదే జరిగింది .

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పై గవర్నర్ సంతకం చేయటం పట్ల తీవ్రాతితీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు , ఇది దుర్మార్గం అని వైసీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఈ నిర్ణయం పై రిఫరెండానికి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి తమది సరైన చర్య అని నిరూపించుకోవాలని అందుకు 48 గంటల సమయం ఇస్తున్నానని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే .

చంద్రబాబు ఆ తర్వాత ఏమి చేయనున్నాడు . టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు రాజీనామాలు చేసి ప్రత్యక్ష పోరాటాలు చేస్తారా అని టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూడగా , అన్ని ప్రాంతాల అభివృద్ధి మాకు ముఖ్యం ఒక్క అమరావతి కాదు . అలా కాకుండా అన్ని ప్రాంతాల ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కాక ఒక్క అమరావతి ప్రాంత అభివృద్ధి మాత్రమే కోరుకొంటున్నారు అంటున్న బాబు మాటలు నిజమైతే ఆయన , అన్ని ప్రాంతాల టీడీపీ నాయకులు రాజీనామా చేసి మళ్లీ గెలిచి తమ వాదం నిజం అని వారే నిరూపించాలి కానీ మేము కాదు , మా నిర్ణయం తప్పైతే ఈ రోజు అధికారం ఇచ్చిన ప్రజలే 2024 లో తీర్పు చెబుతారు అని వైసీపీ శ్రేణులు తేల్చిచెప్పగా , మిగతా పార్టీలు , ప్రజా సంఘాలు ఈ వ్యవహారంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా 48 గంటల తర్వాత బాబు ఏం చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూశాయి .

48 గంటల తర్వాత అనుకొన్న సమయానికి జూమ్ లో ఎంచుకున్న మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన బాబు హావభావాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు , ఆవేదన వెళ్లగక్కారు కానీ ఇదిమిద్దంగా ఏ విషయం తేల్చకుండానే మీటింగ్ ముగించేసి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టీడీపీ శ్రేణుల్ని ఉసూరుమనిపించారని చెప్పొచ్చు .

వికేంద్రీకరణ బిల్లు పై గవర్నర్ ఆమోదముద్రకి నిరసనగా బాబు గానీ , టీడీపీ నాయకులు కానీ రాజీనామాలు చేయలేదు , పోరాట కార్యాచరణ ప్రకటించలేదు . ఎలా ముందుకెళ్తారో చెప్పలేదు . రైతులకు ఏమి చేయాలో కోరలేదు . 48 గంటల గడువు తర్వాత పెట్టిన మీటింగ్ లో అసలు బాబు గారు ఏం చెప్పారో చాలా మందికి అర్థం అయ్యుండక పోవచ్చు .

48 గంటలలో వైసీపీ నేతలు రాజీనామాలు చేసి ఎన్నికలకు పోవాలని మళ్లీ డిమాండ్ చేసిన బాబు , 48 గంటల తర్వాత జూమ్ మీటింగ్ లో సైతం మళ్లీ వైసీపీ నేతలే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ తాము రాజీనామాలు చేయమని తేల్చిచెప్పారు . వైసీపీ ప్రజల్ని మోసం చేసిందని , మాట తప్పిందని , అమరావతి ఇక్కడ నిర్మిస్తామన్న హామీ నెరవేర్చకుండా ప్రజలకు ద్రోహం చేస్తుందన్న బాబు , పనిలో పనిగా కరోనా విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని , రాష్ట్రంలో కరోనా మరణాలు అత్యధికంగా ఉన్నాయంటూ గణాంకాల ప్రకారం ఉన్న జాతీయ మరణాల సగటు కన్నా రాష్ట్ర సగటు తక్కువగా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆరోపణలు చేసారు .

అంతిమంగా రాష్ట్ర ప్రజలందరూ అమరావతి కోసం ఉద్యమించాలని , ప్రజలే అమరావతిని కాపాడుకోవాలని , ప్రజల్లో చైతన్యం రావాలని , ప్రజలే పోరాడాలని , ప్రజలు తిరుగుబాటు చేయాలని పలు పిలుపులు ఇచ్చిన బాబు , పనిలోపనిగా కేంద్రానికీ పలు విజ్ఞప్తులు చేశారు .

ఓ వైపు రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని దాంట్లో కేంద్రం కానీ బీజేపీ కానీ జోక్యం చేసుకోదని బీజేపీ శ్రేణులు పలుమార్లు స్పష్టం చేసిన వైనాన్ని విస్మరించిన బాబు , కేంద్రం చోద్యం చూడకుండా జోక్యం చేసుకోవాలని , ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని , ఈ రోజు రామాలయానికి పలు చోట్ల నుండి మట్టీ , నీరు తెచ్చినట్టే , ఆ రోజు అమరావతి శంఖుస్థాపనకి పార్లమెంట్ నుండి మట్టీ నీరు ఇచ్చారు కాబట్టి అమరావతిని తరలించకుండా ఆదుకోవాలని సెంటిమెంట్ తో బీజేపీని వేడుకొనే ప్రయత్నం చేశారు .

సమావేశం చివర్లో రాజీనామాల పై ఓ విలేఖరి మాట్లాడుతూ .. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన మాకు మళ్లీ తీర్పు కోరాల్సిన అవసరం ఏముందీ , ప్రజాతీర్పుని అపహాస్యం చేసేవిధంగా మేమెందుకు రాజీనాలు చేస్తాము , అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని అన్ని ప్రాంతాల్లో ప్రజలు కోరుకొంటున్నారు అని చెబుతున్న బాబు గారే తమ పార్టీ వారి చేత రాజీనామాలు చేయించి ప్రజాభిప్రాయాన్ని నిరూపించమని వైసీపీ నేతలు అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా ... వాళ్ళేం మాట్లాడుతున్నారు , హామీ ఇచ్చి మోసం చేస్తే సరిపోతుందా , వాళ్ళు రాజీనామాలు చేయాలి . అమరావతి ఉంచుతాము అని చెప్పండి , అప్పుడు చేస్తాం .కావాలంటే మా పదవులు ఇచ్చేస్తాం . ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది లాంటి సమాధానాలతో కాస్త తికమక పెట్టినా అంతిమంగా రాజీనామాలు చేయమని , అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతిని కాపాడుకోవాలని ముక్తాయించారు .

కాగా ఏబీఎన్ లో ప్రసారమైన ఈ లైవ్ ఆద్యంతం పట్టుమని వంద మందికి మించి వ్యూయర్స్ లేకపోవడం గమనిస్తే అమరావతి అంశం పట్ల టీడీపీ శ్రేణుల్లో కూడా అనాసక్తి నెలకొంది అనిపించక మానదు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp