పేద కుటుంబాలు బాగుపడితే భరించలేరా బాబుగారు???

By Uday Srinivas JM Feb. 20, 2020, 10:25 am IST
పేద కుటుంబాలు బాగుపడితే భరించలేరా బాబుగారు???

మశూచి, కలరా లాంటి రోగాలు ఒకానొక కాలంలో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన మహమ్మారులు. ఇప్పుడు ఆ స్థానాన్ని మద్యం ఆక్రమించింది. ఆర్థికంగా, సామాజికంగా పేద కుటుంబాలను నాశనం చేస్తోంది ఈ మద్యపానం. వేలాది మంది మరణానికి కారణం ఈ మద్యం. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం మద్యం. ఓ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 30లక్షల మంది మద్యం వల్ల మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారని తేలింది. ఇలాంటి వ్యసనాన్ని ప్రజా సమూహం నుంచి తొలగించాల్సిన ప్రభుత్వాలు.. దానిపైనే వ్యాపారాలు చేయడం మనం చూస్తేనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి మార్పు తేవడానికి తొలిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేయడానికి నడుం బిగించింది.

ఇలాంటి కార్యక్రమాలకు ఎలాంటి వ్యక్తులైనా, పార్టీలైనా సపోర్ట్‌ చేయాల్సిందే. కానీ ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం మందుబాబుల తరఫున మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారం చూసిన తర్వాత.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన నేర్చుకున్న నీతి ఇదేనా? అని ఆశ్చర్యం కలగక మానదు. బుధవారం ప్రజాచైతన్యయాత్రలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మద్యం బ్రాండ్లన్నీ దొరకడం లేదు. మద్యం రేట్లు పెంచారు. ఈ ప్రభుత్వం తాగుబోతుల పొట్ట కొడుతోంది’’అంటూ మాట్లాడి తన ఆలోచనా విధానం ఇలానే ఉంటుందని మరోసారి నిరూపించారు. అప్పట్లో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యే చేత మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడించి చులకన అయిన తెలుగుదేశం పార్టీ.. నేడు చంద్రబాబు మాటలతో పూర్తిగా దిగజారిపోయినట్లే కనపడుతోంది. ఒక్క మద్యపానం వల్ల వేలాది కుటుంబాలు నాశనం అవుతున్నా.. చంద్రబాబు ధోరణి మారడం లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి? కుటుంబాలు బాగుపడడం ఆయనకు ఇష్టం లేదా? ఏమో మరి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలి.

వైఎస్‌ జగన్‌ చేస్తున్నదేంటి?

సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రలో మద్యం మహమ్మారి వల్ల తాము పడుతున్న ఇబ్బందులను మహిళలకు వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. దీన్ని విన్న ఆయన అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేదం చేసి, ఎన్నికల నాటికి పూర్తిగా నిషేధించిన తర్వాతే ఓట్లు అడుతానంటూ చెప్పారు. అందుకు అనుగుణంగానే అధికారంలోకి రాగానే కార్యాచరణ మొదలుపెట్టారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మద్యం వల్ల వచ్చే డబ్బే ముఖ్య ఆధారమని తెలిసినా.. ముందుకు వెళ్తున్నారు. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 40వేలకు పైగా బెల్టు షాపులను పూర్తిగా తొలగించారు. గతంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వాటి సంఖ్యను 3,500కు తగ్గించారు. ప్రైవేటు మద్యం అమ్మకాలకు చెక్‌ పెడుతూ.. ప్రభుత్వమే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే పేదలకు మద్యం దూరం చేయడానికి ధరల పెంపు చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 9వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల మొదటి మూడు నెలల్లోనే భారీ మార్పులు కనిపించాయి. మద్యం ఆదాయం భారీగా తగ్గింది. చాలా పేదల కుటుంబాల్లో వెలుగులు విరాజిల్లుతున్నాయి. ఒక రెండో దశలో భాగంగా మద్యం అమ్మకాలను వారంలో మూడు రోజులకే పరిమితం చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అలా ఎన్నికల నాటికి పూర్తిగా మద్యం అమ్మకాలను నిషేధించి.. 5 స్టార్‌ హోటళ్లకే పరిమితం చేయనున్నారు.

చంద్రబాబు హయాంలో ఏం జరిగింది?

గుడి, బడి, రోడ్డు తేడా లేకుండా ఎక్కడిపడితే అక్కడ మద్యం అమ్మకాలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చారు చంద్రబాబు. మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఎదిగిపోయారు. సిండికేట్లకు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలను పెంచారు. బెల్టుషాపులు ప్రతి మారుమూల గ్రామంలోనూ యథేచ్చగా వెలిసినా.. గత ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్టలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp