చందమామ బొమ్మల "శంకర్" ఇకలేరు..

By Kiran.G Sep. 30, 2020, 08:15 am IST
చందమామ బొమ్మల "శంకర్" ఇకలేరు..

ఇప్పటి పిల్లలకు చందమామ పుస్తకం గురించి పెద్దగా తెలియక పోవచ్చు గాని పాత తరాలకు అదొక కథల తేనెతుట్టె.. ఒక్కసారి ఆ తేనెతుట్టెను కదిపితే తేనెటీగలు చెలరేగినట్లు ఎన్నో కథలు జ్ఞాపకాల రూపంలో బయటకు వస్తాయి. మధురానుభూతిని పంచుతాయి. చల్లని వెలుగులో ప్రపంచంలోని అందాలను చూపే చందమామలా కథల వెలుగులో అందమైన బొమ్మలతో అత్యద్భుతమైన కథలతో మరో అందమైన ప్రపంచాన్ని చూపించింది చందమామ పుస్తకం.. ఆ పుస్తకంలో బొమ్మల ప్రపంచాన్ని సృష్టించింది మాత్రం శివశంకరన్‌ తాతయ్యే.. చివరిశ్వాస వరకూ బొమ్మలే లోకంగా బ్రతికిన శంకర్ వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో తుది శ్వాస విడిచారు.

1924లో తమిళనాడులోని ఈరోడ్‌లో శివశంకర్ జన్మించారు. బాల్యం నుంచే బొమ్మలు గీయడంలో ఆసక్తి చూపిన శంకర్ 1941లో మద్రాస్ గవర్నమెంట్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరి శిక్షణ పొందారు. నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామలో ఆయన 1951లో చేరారు. అప్పటినుండి దాదాపు 60 సంవత్సరాలపాటు చందమామలో అత్యద్భుతమైన చిత్రాలను గీసి ఆబాలగోపాలాన్ని అలరించారు. ముఖ్యంగా ఆయన గీసిన బొమ్మలు ఆయా కథలకు ప్రాణం పోసేవి. ముఖ్యంగా చందమామలో భేతాల కథలకు ఆయన గీసిన చిత్రాలను ఇష్టపడని పాఠకులు లేరనడం అతిశయోక్తి కాదు.

కొన్ని వేల కథలు మరియు సీరియళ్లకు భారతీయత ఉట్టిపడే బొమ్మలు గీసి పిన్నలతో పాటు పెద్దల మనసులను గెలుచుకున్న శంకర్ పేరు చందమామ దేశంలోని ప్రముఖ భాషల్లో కూడా వెలువడటంతో ఆయనకు దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చింది. చివరివరకు తనకు ఇష్టమైన బొమ్మలు గీస్తూనే గడిపారు. చందమామ మూతపడిన తర్వాత రామకృష్ణ విజయం అనే పత్రికలో బొమ్మలు గీశారు. కాగా కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడిన శివశంకర్ సెప్టెంబర్29 న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన పలువురు సంతాపం తెలిపారు. శంకర్ కి చావు ఉంది కాని ఆయన సృష్టించిన కళా సంపదకు చావు లేదు. అది ఎప్పటికీ మనతోనే జ్ఞాపకాల రూపంలో కొలువై ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp