మళ్లీ పాత గూటికి చలమలశెట్టి సునీల్

By Raju VS Aug. 10, 2020, 08:23 am IST
మళ్లీ పాత గూటికి చలమలశెట్టి సునీల్

పారిశ్రామికవేత్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, సక్సెస్ సాధించలేకపోతున్న చలమలశెట్టి సునీల్ మరోసారి పాత బాస్ వద్దకు చేరుతున్నారు. వైఎస్సార్సీపీలో ఆయన చేరబోతున్నారు. దాంతో తూర్పు గోదావరి జిల్లలో కీలక సామాజికవర్గానికి చెందిన సునీల్ చేరిక ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు. మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన సునీల్ ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తుండడంతో టీడీపీకి దెబ్బగానే చెబుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుల జాబితాలో వినిపించే పేరు చలమలశెట్టి సునీల్. వరుసగా మూడు సార్లు ఆయన పార్లమెంట్ బరిలో దిగారు. మూడు సార్లు ఓటమి పాలయ్యారు. మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల తరుపున రంగంలో దిగినా ఆయన వ్యూహాత్మక తప్పిదాలతో పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశం చేజార్చుకున్నారు. అందులోనూ 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున ఓటమి పాలయిన ఆయనకు 2019 ఎన్నికల్లో కూడా అవకాశం కల్పించాలని సంకల్పించిన జగన్ ఆలోచనకు భిన్నంగా వ్యవహరించి బోల్తా పడ్డారు. చంద్రబాబు హయంలో విసిరన వలకు ఆయన సోదరుడితో సహా వ్యాపార ప్రయోజనాల కారణంగా చేసిన అడుగులు చివరకు సునీల్ కి మూడోసారి ఛాన్స్ మిస్ కావడానికి కారణం అయ్యాయి. సునీల్ ఖాళీ చేసిన సీటులో నెల రోజుల ముందు వైఎస్సార్సీపీలో చేరిన వంగా గీత సునాయాసంగా విజయం సాధించిన తీరు చూసి సునీల్ ఎంత చింతించి ఉంటారో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

Also Read: ఆంధ్రా రాజకీయాల్లో సోము వీర్రాజు తెచ్చిన మార్పు

సోమవారం వైఎస్ జగన్ తో మరోసారి సునీల్ భేటీ అవుతున్నారు. తన మాజీ బాస్ ని కలిసి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గూటిలో చేరినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సునీల్ వచ్చి కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం విశేషంగా మారింది. వైఎస్సార్సీపీ కండువా కప్పుకుని మళ్లీ పార్టీ పనిలోకి ఆయన దిగే అవకాశం కనిపిస్తోంది.

జర్మనీ నుంచి వచ్చి నేరుగా 2009 ఎన్నికల్లో తొలిసారిగా ప్రజారాజ్యం తరుపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఎలెక్షనీరింగ్ అనుభవం లేకపోవటం వలెనే ఆ ఎన్నికల్లో సునీల్ ఓడిపోయారు.మూడు స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సత్యాకు సునీల్ కన్నా తక్కువ31,000 ఓట్లు తక్కువగా రావటం గమనార్హం.

ఆ తర్వాత 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగి కేవలం 2,000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో పరాజయం పొందారు.రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలన్న సూత్రాన్ని మరచి 2019 ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ పరిధిలోని శాసనసభ స్థానాలలో తాను చెప్పిన వారికి ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వాలని మొండిపట్టు పట్టిన సునీల్ వైసీపీకి దూరమయ్యి చంద్రబాబుకు దగ్గరయ్యారు.

Also Read: కరోనా అప్పడాలు మంత్రాలు

ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీలో చేరి బరిలో దిగినప్పటికీ హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు. 25000 ఓట్ల తేడాతో సునీల్ వైసీపీ వంగా గీత చేతిలో ఓడిపోయారు.ప్రస్తుత మంత్రి కన్నబాబుకి సన్నిహిత మిత్రుడయినప్పటికీ గత ఎన్నికలకు ముందు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి సనీల్ బలయ్యారు. అప్పట్లో తన సోదరుడి వ్యాపార వ్యవహారాల కారణంగా సునీల్ పార్టీ మారినట్టు ప్రచారం సాగింది.వరుస ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన సునీల్ ఇప్పుడు మరోసారి వైసీపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఏమయినప్పటికీ ఎన్నికల ఫలితాలతో చేతులు కాల్చుకున్న చలమలశెట్టి సునీల్ ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ గూటికి చేరడం దాదాపు ఖాయం అవుతోంది.ముత్యాల శ్రీనివాస్,తోట సుబ్బారావు నాయుడు,కంపర రమేష్ లాంటి నాయకులు కూడా వైసీపీకి వచ్చినట్టే కానీ ఈ రోజు సునీల్ మాత్రమే వైసీపీ లో చేరుతున్నారు.

ఓవైపు ఏపీలో కాపు నేతలతో రాజకీయాలకు కమలం కార్యాచరణ సిద్ధం చేస్తుండగా మరోవైపు సీనియర్ కాపు నేతలంతా వైఎస్సార్సీపీ వైపు క్యూ కడుతుండడం ఆసక్తికరంగానే చెప్పవచ్చు. రాజ్యసభ అవకాశం కోసం సునీల్ ఆశావాహంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp