జగన్ దూకుడుతో బేజారు..కొటియా సరిహద్దు వివాదంపై కేంద్ర మంత్రి లేఖ

By Ramana.Damara Singh Sep. 24, 2021, 05:00 pm IST
జగన్ దూకుడుతో బేజారు..కొటియా సరిహద్దు వివాదంపై కేంద్ర మంత్రి లేఖ

దశాబ్దాలుగా వివాదంలో నలుగుతున్న ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల అభివృద్ధి విషయంలో ఏపీలోని జగన్ సర్కారు చూపుతున్న దూకుడుతో ఒడిశా నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. అవెక్కడ తమ చేజారిపోతాయోనన్న ఆందోళనతో తమ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆశ్రయించారు. దాంతో ఆయన ఏపీ సీఎం జగన్ కు మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులు కొటియా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న ఒడిశా నేతలు ఇప్పుడు దిగిరావడం ఆసక్తికరంగా మారింది.

పరిష్కారం పట్టని గత పాలకులు

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లాకు ఆనుకొని ఉన్న 21 కొటియా గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవన్న విషయంలో రెండు రాష్ట్రాల మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. సుప్రీంకోర్టు సైతం ఈ వివాదంపై చేతులెత్తేసి ఇరు రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ వివాదంపై దృష్టి సారించలేదు. ఇటు ఏపీ సీఎంలు కూడా వివాద పరిష్కారాన్ని పట్టించుకోకపోగా.. వాటి అభివృద్ధినీ విస్మరించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా సర్దుబాటు చేయడం తప్ప శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించలేదు.

Also Read : హద్దు మీరుతున్న ఒడిశా .. కొటియా గ్రామాల్లో ఉద్రిక్తత

జగన్ సీఎం అయ్యాక మారిన పరిస్థితి

అయితే ఏపీలో అధికారం మారి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పరిస్థితి మారింది. ఎటూ కాకుండా పోతున్న 21 కొటియా గ్రామాలపై ఆయన శ్రద్ధ చూపడం ప్రారంభించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఆ గ్రామాలకు కూడా వర్తింపజేశారు. అధికారులు తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడా ఆ గ్రామాల్లో పలుమార్లు పర్యటించి ఏపీ ప్రభుత్వం తరఫున స్థానికులకు భరోసా కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో ఒడిశా నేతలు, అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏపీ చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం ప్రారంభించారు. కోరాపుట్ జిల్లాకు చెందిన అన్ని పార్టీల నేతలు ఏకమై కొటియా గ్రామాల్లో ఇటీవల అభివృద్ధి పనుల శంఖుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే రాజన్న దొరతో పాటు అధికారులను అడ్డుకొని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. దీంతో ఏపీ పోలీసులు ఒడిశా నేతలు, అధికారులపై కేసులు నమోదు చేశారు.

చర్చలకు కేంద్రమంత్రి ప్రతిపాదన

ఏపీ దూకుడును తట్టుకోలేకపోయిన ఒడిశా అఖిలపక్ష నేతలు సీఎం నవీన్ పట్నాయక్ వల్ల పని కాదని గ్రహించి తమ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆశ్రయించారు. దాంతో ఆయన రంగంలోకి దిగి కొటియా సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలతో లేఖ రాశారు. వివాదం పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. కొటియా గ్రామాల నుంచి ఏపీ పోలీసులను, సాయుధ బలగాలను వెనక్కి పిలిపించాలని, ఒడిశా నేతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామాల్లో నిర్మాణ పనులేవీ చేపట్టకుండా మౌలిక వసతుల కల్పనే చేపట్టాలని కోరారు. సీఎం జగన్ అనుమతిస్తే తానే చర్చలకు వస్తానని ప్రతిపాదించారు. కేంద్రమంత్రి ప్రతిపాదనలపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారోనని ఈ ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా అధికారుల చొరబాటు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp