అమాత్యుడి తల్లిదండ్రుల ఆదర్శం.. కొడుకు కేంద్రమంత్రి అయినా కూలి పనులతోనే జీవనం

By Ramana.Damara Singh Jul. 22, 2021, 03:49 pm IST
అమాత్యుడి తల్లిదండ్రుల ఆదర్శం.. కొడుకు కేంద్రమంత్రి అయినా కూలి పనులతోనే జీవనం

ఇంట్లో ఒకరు చిన్నపాటి వార్డు సభ్యుడైతే చాలు.. ఏదో సాధించినట్లు ఆ ఇంటివారు హంగామా చేస్తారు. తమ స్థాయి పెరిగిపోయినట్లు బిల్డప్పులు ఇచ్చే రోజులివి. తమవారి పదవులు, హోదాలను ఉపయోగించుకొని ఉన్న ఫళంగా ఎదిగిపోయేందుకు తాపత్రయపడేవారే నేటి సమాజంలో ఎక్కువగా తారసపడుతుంటారు. కానీ వీటన్నింటికీ అతీతులు ఆ తల్లిదండ్రులు. కొడుకు ఉన్నత పదవి చేపడితే సంతోషించారే తప్ప ఆ హోదాను అనుభవిచడానికి ప్రయత్నించడంలేదు. మొదటి నుంచీ మట్టిని నమ్ముకున్న వారు.. ఇప్పుడూ అదే మట్టిపై ఆధారపడి జీవిస్తున్నారు. శ్రమించి.. స్వేదం చిందించడంలోనే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. తనయుడు అమాత్యుడైనా అతి సాధారణ జీవితం గడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఆ దంపతులు కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తల్లిదండ్రులు కావడం విశేషం.

పేద దళిత కుటుంబం

తమిళనాడులోని నామక్కల్ జిల్లా కోనూరు గ్రామానికి చెందిన లోగనాథన్, వరుదమ్మాళ్ నిరుపేద దళితులు. చిన్న ఇల్లే వారి ఆవాసం. రోజూ ఉదయాన్నే పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసి.. వచ్చే కూలి డబ్బులతో బతుకు బండిని లాగిస్తుంటారు. వారి కుమారుడు మురుగన్ నామక్కల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. పేదలైన తల్లిదండ్రులపై ఆధారపడకుండా కష్టపడి చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కళాశాలలో ఉన్నప్పుడే ఆరెస్సెస్ కార్యకర్తగా చేరారు. ఏబీవీపీ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. ఆ పరిచయాలతో న్యాయవాదిగా బీజేపీ నేతల కేసులు ఎక్కువగా వాదించేవారు. అలా బీజేపీతో అనుబంధం పెరిగి పార్టీ నాయకుడిగా ఎదిగారు.

Also Read : పార్లమెంట్ ని తాకిన జలజగడం, వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన సరైనదేనన్న కేంద్రం

2019లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళ సై గవర్నరుగా వెళ్లడంతో ఆమె స్థానంలో పార్టీ మురుగన్ను అధ్యక్షుడిగా నియమించింది. అప్పటినుంచీ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన మురుగన్ ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించి రెండు దశాబ్దాల తర్వాత అసెంబ్లీలో ఆ పార్టీకి చోటు కల్పించిన ఘనత సాధించారు. ఇదే పార్టీ అగ్రనేతల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల జరిపిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మురుగన్ కు అవకాశం కల్పించారు. అనూహ్యంగా మోదీ కేబినెట్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచిన మురుగన్ .. ఇప్పుడు తల్లిదండ్రుల పరంగానూ వార్తల్లో నిలిచారు.

ఈ జీవితమే ఇష్టం

కొడుకు మురుగన్ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతుండటాన్ని దూరం నుంచి చూసి సంతోషిస్తున్న అతని తల్లిదండ్రులు కొడుకు పంచన చేరి ఆ హోదాను అనుభవించడానికి గానీ, కూర్చొని తినడానికి గానీ ఆసక్తి చూపడంలేదు. మొదటి నుంచీ ఆ చిన్న ఇల్లు, ఆ పొలం పనులే ఆదరువుగా నిలిచాయని.. అవే తమకు ఇష్టమని వారు అంటున్నారు. ఓపిక ఉన్నంతకాలం కష్టపడి తెచ్చుకున్న సంపాదనతోనే జీవిస్తామని లోగనాథన్, వరుదమ్మాళ్ స్పష్టం చేస్తున్నారు. అన్నట్లుగానే ఇప్పటికీ తెల్లవారక ముందే లేచి పొలంలోకి వెళ్లి పనులు చేసుకుంటున్నవారిని చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు. కొడుకు మంత్రి అయినందుకు ఆనందించారే తప్ప ఆ గర్వం, దర్పం వారిలో ఏ కోశానా కనిపించడం లేదు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వీరి జీవనశైలిని మొదట వెలుగులోకి తెచ్చారు. కొడుకు మంత్రి అయినా ఇంకా కూలి పనులతోనే అతిసాధారణ జీవితం గడుపుతున్న.. వారి నిరాడంబరతను ట్విటర్ పోస్టులో ఆమె ప్రశంసించారు.

Also Read : బుచ్చయ్య చౌదరి ప్రత్యర్థికి డీసీసీబీ చైర్మన్‌ పదవి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp