ప్రైవేటు కిస్తీల మాటేంటి..!

By Jaswanth.T Oct. 30, 2020, 11:00 am IST
ప్రైవేటు కిస్తీల మాటేంటి..!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు పొందిన వారికి చక్రవడ్డీ మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోవిడ్‌ కారణంగా ఏర్పడ్డ ఆర్ధిక ప్రతిష్టంభన నుంచి కాస్తంత ఉపసమనం కలిగించే విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 5,600 కోట్లను వెచ్చిస్తోంది. రుణ మారటోరియం వినియోగించుకున్న వారికే కాకుండా సక్రమంగా వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఉపసమన ప్రయోజనం అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో రుణచెల్లింపు సంప్రదాయాన్ని సక్రమంగా కొనసాగించే విధంగా ప్రోత్సాహాన్ని అందించేటట్టుగానే వ్యవహరించదన్న అభిప్రాయం పలువురిని నుంచి వ్యక్తమవుతోంది.

అయితే రిజిష్టర్డ్‌ ప్రైవేటు ఆర్ధిక సంస్థల నుంచి వివిధ రకాల రుణాలు పొందిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఉదాహరణకు రవాణా వాహనాలను ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణ ప్రాతిపదికన పొందిన వారికంటే ప్రైవేటు కంపెనీల ద్వారా పొందిన వారే అధికంగా ఉంటారన్న అంచనాలున్నాయి. ప్యాసింజర్, రవాణా వాహనాలు ఈ శ్రేణిలో ఉంటాయి. ఈ రంగాన్నే నమ్ముకున్నవారు కూడా కోవిడ్‌ కారణంగా తమతమ ఉపాధులకు గండిపడి ఆదాయాన్ని కోల్పోయారు. నెలనెలా కిస్తీలు కట్టడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారు కూడా ఉన్నారు.

లాజిస్టిక్స్‌ రంగంలో గ్రోత్‌ ఉన్నప్పటికీ అసంఘటిత రవాణా రంగంలో ఉన్న కార్మికులకు కూడా కోవిడ్‌ తీవ్ర ఇబ్బందులనే సృష్టించింది. ఇటువంటి వారిలో అత్యధిక శాతం మంది ప్రైవేటు రుణ కంపెనీల నుంచి రుణాలు పొంది వాహనాలు కొనుగోలు చేసినవారే ఉంటారు. వీరి ఉపాధికి కూడా నష్టం జరిగినప్పటికీ వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనం మాత్రం ప్రస్తుతానికి ఏమీ లేదు. దీంతో తమను కూడా ఆదుకోవాలన్న విజ్ఞప్తిని ఆయా రంగాలకు చెందిన వారి నుంచి విన్పిస్తోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా అందిస్తున్న వడ్డీ ప్రయోజనాన్ని రిజిష్టర్‌ ప్రైవేటు కంపెనీల ద్వారా రుణాలు పొందిన వారికి కూడా అమలు చేస్తే స్వయం ఉపాధులను నమ్ముకుని జీవిస్తున్నవారికి చేయూతనందించినట్టవుతుందన్న వాదనకు బలం చేకూరుతోంది. ఆర్ధిక రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు మరింత విస్తృతమవుతాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp