కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి కేంద్రం ఓకే -ఫలించిన జగన్ ప్రయత్నం

By Ramana.Damara Singh May. 13, 2021, 06:37 pm IST
కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి కేంద్రం ఓకే -ఫలించిన జగన్ ప్రయత్నం

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విలువైన సూచనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా తీవ్రత కొనసాగుతున్న పరిస్థితుల్లో దాన్ని అడ్డుకునేందుకు టీకా ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ దేశీయ ఉత్పత్తి అయిన కోవాగ్జిన్ టీకా సాంకేతిక సమాచారాన్ని ఇతర సంస్థలకు బదిలీ చేయాలన్న సీఎం జగన్ చేసిన సూచన మేరకు.. సాంకేతికత బదిలీకి సిద్ధమేనని కేంద్రం గురువారం ప్రకటించింది.

రెండు రోజుల క్రితమే జగన్ లేఖ
దేశంలో అనుకున్నంత వేగంగా కోవిడ్ టీకా కార్యక్రమం జరగడంలేదు. భారత్ లో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ నెలకు ఆరు కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేస్తుండగా.. భారత్ బయోటెక్ నెలకు కోటి డోసులు కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తోంది.

Also Read:కోవాగ్జిన్ -ఫ‌లిస్తున్న జ‌గ‌న్ లేఖాస్త్రాలు

దేశీయ అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో టెక్నాలజీ బదిలీ ద్వారా మరిన్ని సంస్థలకు ఈ టీకాలు ఉత్పత్తి చేసే అవకాశం కల్పిస్తే తప్ప.. వ్యాక్సినేషన్ వేగం పుంజుకోదని గుర్తించిన సీఎం జగన్.. ఇదే విషయం వివరిస్తూ ప్రధానమంత్రి మోదీకి ఈ నెల 11న లేఖ రాశారు. కోవిషీల్డ్ టీకా ఫార్ములాను ఇంగ్లాండుకు చెందిన ఆస్ట్రాజెనికా- ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా రూపొందించాయి. దాని ఉత్పత్తి మాత్రమే మన దేశానికి చెందిన సీరం సంస్థ చేపడుతోంది. అందువల్ల కోవిషీల్డ్ సాంకేతికతపై మన దేశానికి ఎటువంటి అధికారం లేదు.

రెండోదైన కోవాగ్జిన్ టీకా పూర్తిగా దేశీయంగా రూపొందింది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్- భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తోంది. దీని సాంకేతిక సమాచారాన్ని కోవిడ్ టీకాల ఉత్పత్తికి ఆసక్తి చూపే సంస్థలకు బదిలీ చేయాలని జగన్ తన లేఖలో ప్రధాన మంత్రికి సూచించారు. ఈ నిర్ణయం వల్ల టీకాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని జగన్ పేర్కొన్నారు. ఉత్పత్తిని పర్యక్షించే బాధ్యతను ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలకు అప్పగించాలని సూచించారు.

Also Read:కోవాగ్జిన్ ఆర్డర్లపై వివాదానికి స్వస్తి...లేఖ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం...

3 సంస్థలతో కేంద్రం చర్చలు
సీఎం జగన్ రాసిన ఈ లేఖ రాష్ట్రంలో కొన్ని వర్గాల విమర్శలకు గురైనా.. కేంద్రం మాత్రం ఆయన సూచనలోని వాస్తవికతను, దాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. అందుకే కోవాగ్జిన్ సాంకేతిక సమాచార బదిలీకి సంసిద్ధత ప్రకటించింది. అంతేకాకుండా కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తి విషయమై మూడు ప్రముఖ సంస్థలతో చర్చలు ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చలు జరుపుతున్న సంస్థల వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఏమైనా సీఎం జగన్ నిర్ణయాలు, సూచనలు కోవిడ్ కట్టడికి ఉపకరించేవిగానే ఉంటున్నాయని కేంద్రం నిర్ణయం ద్వారా మరోమారు రుజువైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp