సానుభూతి కోసమా?సమస్యల కోసమా?... చంద్రబాబు జూమ్ మీట్..

By Sanjeev Reddy Aug. 07, 2020, 09:19 pm IST
సానుభూతి కోసమా?సమస్యల కోసమా?... చంద్రబాబు జూమ్ మీట్..

ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు తీరులో పెద్దగా మార్పు లేకపోయినా అప్పుడప్పుడు సానుభూతి కోసం అన్నట్లు ప్రెస్ / జూమ్ మీట్ లలో ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంటారు. కానీ అన్ని నేనే చేశాను అనే ధోరణిని మాత్రం వీడరు. ఈ సాయంత్రం జరిగిన చంద్రబాబు జూమ్ మీట్ దీనికి చక్కని ఉదాహారణ..

"నేను పోరాడుతున్నది ప్రజల కోసమే తప్ప నా కొడుకు కోసమో, కుటుంబం కోసమో కాదు. నా కులం కోసం కూడా కాదు. నేను సామాజిక న్యాయం కోసం పోరాడాను. కానీ జగన్ వచ్చిన తర్వాత నాకు కులం అంటగట్టారు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి జూమ్ మీటింగ్లో అన్నారు .

నిప్పులా బతికాను, సామాన్యుడి న్యాయం కోసమే చిన్నప్పటి నుంచి పనిచేశాను. నాకు కులం లేదు,ఈ ప్రభుత్వం పై అందరూ పోరాడాలి అంటూ జూమ్ మీటింగ్ లో పాత విషయాలనే కొత్తగా చెప్పటానికి ప్రయత్నం చేసారు.
ఒక వర్గానికి చంద్రబాబు ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుస్తున్నారని అనేకసార్లు ఆరోపణలు వచ్చినా, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి శాసనసభలో కొందరి పేర్లు చదివి వీరు ఎవరు అంటూ ప్రశ్నించినా చంద్రబాబు సమాధానం చెప్పలేదు , అసలు ప్రశ్ననే గుర్తించనట్లు సంబంధం లేని విషయాలు మాట్లాడారు. ప్రెస్ మీట్లలో మాత్రం నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ మాట్లాడతారు.. సరైన వేదిక మీద స్పందించి ఆ ఆరోపణలకు సమాధానాలు చెబితే నమ్మే వారు నమ్ముతారు ,నమ్మనివారు నమ్మరు . కానీ చంద్రబాబు ఆ పని చేయరు.

Also Read: చీఫ్ సెక్రటరీ పదవీకాలం మరోసారి పొడిగింపు

తన కొడుకు కోసం పనిచేయలేదు అనటం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తుంది. తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో నా కొడుకుకు చదువు చెప్పిస్తాను కానీ ఆస్తి మరియు రాజకీయ వారసత్వం ఇవ్వను అని చెప్పిన చంద్రబాబు లోకేష్ ను ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు.

1983లో పుట్టిన లోకేష్ కు ఎన్నికల్లో పోటీచేసే అర్హత అంటే 25 సంవత్సరాలు నిండిన 2008 నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉంది, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే అప్పుడే మంత్రి లేదా కనీసం ఎమ్మెల్సీని చేసి ఉండేవారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

చంద్రబాబు తన కొడుకు కోసం పనిచేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని మోడీనే విమర్శించారు. 2019 ఎన్నికల ముందు మోడీ ఓ సభలో మాట్లాడుతూ పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకొంటున్నారని , ఆయన కొడుకు కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయట్లేదని వ్యాఖ్యానించారు . అందుకు ప్రతిగా బాబు మాట్లాడుతూ అవును నాకు ఫ్యామిలీ ఉంది , నాకు కొడుకు ఉన్నాడు, నేను నా కొడుకు కోసం పని చేస్తున్నాను . నీకు ఫ్యామిలీ లేదు , ఎవరూ లేరు అని వ్యాఖ్యానించిన బాబు గారు ఈ రోజు నేను కొడుకు కోసం పని చేయట్లేదు అని చెప్పడం విచిత్రంగా ఉంది అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు .

2014లో గెలిచిన తరువాత కూడా టీడీపీలో అర్హులైన ఎందరో పెద్దల్ని కాదని లోకేష్ ని ఎమ్మెల్సీ చేసి పెద్దల సభకు పంపటమే కాకుండా మూడు మంత్రిత్వ శాఖలకు మంత్రిగా చేసి మా పై రుద్దాడని టీడీపీలోని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు .

Also Read: కోజికోడ్‌ - ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం

కడప నుండి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి చెందిన బీటెక్ రవి .. సీమ ప్రయోజనాల కోసం కాక అమరావతి కోసం రాజీనామా చేయగా , అమరావతి కోసం ప్రాణాలైనా పణంగా పెట్టి పోరాడతానంటున్న చంద్రబాబు , లోకేష్ లు మాత్రం 48 గంటల గడువు తర్వాత కూడా రాజీనామా చేయకుండా నా కోసం కాకుండా ప్రజల కోసం పోరాడుతున్నా అంటే ప్రజలు ఎలా నమ్ముతారు?

నన్ను టార్గెట్ చేస్తున్నారు , ఇది ప్రజలందరూ గ్రహించాలి , ప్రభుత్వం పై పోరాడాలి , విశాఖ వాసులు మంచివారు వారు కూడా అమరావతి కోసం పోరాడాలి అని చంద్రబాబు పిలుపును ఇచ్చారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చేస్తున్న వికేంద్రీకరణలో భాగంగా తమ ప్రాంతానికి పాలనా రాజధాని వస్తుంటే వద్దని ఏ విశాఖ వాసి అన్నారో చంద్రబాబుగారికే తెలియాలి. విశాఖ కన్నా అమరావతి ముఖ్యం అని అనుకొంటే ఎందుకు ముఖ్యమో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలకు వివరిస్తే చంద్రబాబు చెప్పే మాటలకు కొంత బలం చేకూరేది. 

నిర్దిష్టంగా మాట్లాడకుండ, ప్రతిసారి అంతా నేనే అంటూ పరనింద ఆత్మస్తుతిలా ఎంత మాట్లాడినా ప్రజల విశ్వాసం చూరగొనలేరని చంద్రబాబుకు ఎవరు చెప్పగలరు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp