వాళ్ళు గెలిస్తే మున్సిపాలిటీ పన్నులు తగ్గిస్తారంట..!

By Voleti Divakar Mar. 04, 2021, 10:40 am IST
వాళ్ళు గెలిస్తే మున్సిపాలిటీ పన్నులు తగ్గిస్తారంట..!

బాబు 40ఏళ్ల అనుభవం....ఇదేనా?! పన్నుల తగ్గింపు ఎలా సాధ్యం ? ప్రజలను మభ్యపెట్టడంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు తన 40ఏళ్ల అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. పార్టీ రహితంగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మ్యానిఫెస్టోను ప్రకటించి అబాసుపాలైన చంద్రబాబునాయుడు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన హామీని తెలుగు తమ్ముళ్లే నమ్మని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ అసాధ్యమని పార్టీ అభ్యర్థులే పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ చూస్తే ప్రజలను ఎలాగైనా మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవాలన్న తాపత్రయమే తప్ప చిత్తశుద్ధి కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాబు హయాంలోనే కసరత్తు
తెలుగుదేశం పార్టీ గెలిచిన పురపాలక, నగరపాలక సంస్థల్లో ఆస్తిపన్ను తగ్గిస్తూ తొలి తీర్మానాన్ని ఆమోదిస్తామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. పట్టణాలు, నగరాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచే ఆస్తిపన్నుల పై ప్రజలను తప్పుదోవ పట్టించి, పురపాలక సంఘాల ఎన్నికల్లో లబ్ది పొందాలని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే 2002లో గృహ, 2007లో వాణిజ్య భవనాలకు పన్నులు పెంచారు. ఆ తరువాత మళ్లీ పన్నుల పెంచలేదు.

నిజంగా చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి, ప్రజలపై అభిమానం ఉంటే తాను అధికారంలోకి రాక ముందు 2002లో పెంచిన పన్నులను తగ్గించడంతో పాటు, ఆయన అధికారంలో ఉన్న 2007లో వాణిజ్య భవనాలకు పన్నులు పెంచేవారు కాదన్నది స్పష్టం. నిజంగా చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న నగరాలు, పట్టణాల్లో పన్నులు తగ్గిస్తూ తీర్మానం చేయాలని సవాల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో పన్నుల ఆదాయాన్ని పెంచేందుకు మొన్నటి వరకు చంద్రబాబు ముఖ్యమంత్రగా ఉన్నప్పటి నుంచి అధికారులు కసరత్తు ప్రారంభించారని అధికారులే చెబుతుండటం గమనార్హం. ఆ సమయంలో కూడా చంద్రబాబు గానీ, టిడిపి నాయకులు గానీ దీని పై నోరు మెదపకపోవడం గమనార్హం. తాజాగా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పన్నుల తగ్గింపు అంటూ ప్రజలను మురిపించే ప్రయత్నం చేశారు.

పట్టణాల వారీగా పన్నుల తగ్గింపు అసాధ్యం
చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు పట్టణాలు, నగరాల వారీగా పన్నులు తగ్గించడం అసాధ్యమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పన్నులు పెంచుకునే, తగ్గించుకునే అధికారం వాటికి ఉండదు. ఒకవేళ తీర్మానాలు చేసి పంపినా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన పురపాలక సంఘాలు, నగరాల్లో పన్నులు తగ్గించాలని తీర్మానించినా అమలు చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పన్నుల సవరణ జరుగుతుంది. పన్నుల తగ్గింపు హామీని పరిశీలిస్తే 40ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు ఈ విషయం కూడా తెలియదా? అన్న అనుమానం కూడా ప్రజల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. *

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp