మనసులో మాట మర్చిపోయారా బాబూ !

By Voleti Divakar Jul. 21, 2021, 10:15 am IST
మనసులో మాట మర్చిపోయారా బాబూ !

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మనసు మాట మర్చిపోయారా ?. ఆయన మనసులోని మాటను ఆయన మర్చిపోయినా ప్రజలు , ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మర్చిపోలేకపోతున్నారు . మనసులో ఒకటి పెట్టుకుని ... బయటికి వేరుగా ప్రవర్తించే వారిని కపటధారి అంటారు . చంద్రబాబునాయుడి గురించి ఎరిగిన వారెవరైనా అలాగే అంటారు .

మనసులో మాట పేరిట తనలోని అసలు నైజాన్ని పుస్తక రూపంలో పెట్టారు చంద్రబాబు . అందులో ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు.రెవెన్యూ , పోలీసుశాఖల్లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు . ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని నియంత్రించేందుకు ప్రైవేటీకరణే మార్గమని సూత్రీకరించారు . మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగ భద్రత కల్పిస్తే ప్రభుత్వ ఉద్యోగులు సోమరిపోతుల్లా మారిపోతారని కూడా స్పష్టం చేశారు . కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ విధానాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తేనే ఉద్యోగుల్లో జవాబుదారీతనం వస్తుందని మనసులో మాటగా చెప్పారు .అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు ప్రభుత్వ ఉద్యోగులు , నిరుద్యోగులపై ప్రేమ పుట్టుకురావడం విడ్డూరంగా కనిపిస్తోంది .

అప్పుడలా ... ఇప్పుడిలా ....
మనసులోని మాట ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల , ఉద్యోగాల కల్పన గురించి తనలోని అసలు ఉద్దేశాన్ని బయట పెట్టుకున్న చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందు "జాబు రావాలంటే బాబు రావాలి" అంటూ యువకులను దండుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల విషయమే మర్చిపోయారు .
ఎన్నికల ముందు చెప్పినట్లు జగన్ ప్రకటించిన జాబ్ కేలండర్ పై నిరుద్యోగులను , విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు . కొత్త జాబ్ కేలండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు . చంద్రబాబు రెచ్చగొట్టడంతో టిడిపి ,వామపక్ష , బిజెపి అనుబంధ విద్యార్థి , యువజన సంఘాలు ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి . దీంతో విద్యార్థి , యువజన సంఘం నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు .

మనసులో మాటకు కట్టుబడి ఉన్నారా ?
గతంలో ఆయన మనసులో మాటకు కట్టుబడి ఉన్నారా ? లేక అధికారం కోల్పోయాక ఆయన మనసులో మార్పు వచ్చిందా అన్నది తేటతెల్లం చేయాలి . అలాగే ఆయన హయాంలో  మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతిపరులైన ఉద్యోగులు ఇప్పుడు నీతిపరులై పోయారా .... నాడు సోమరిపోతులైన ఉద్యోగుల్లో మార్పు వచ్చి కష్టపడి పనిచేస్తున్నారా అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సి ఉంది. ఆ విధంగానైనా గతంలో ఉద్యోగుల మీద వేసిన అభాండాలకు పరోక్ష క్షమాపణలు చెప్పినట్లవుతుంది. మనసులో మాటపై తమ వైఖరిని కూడా స్పష్టం చేసి , ప్రజలు , ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పిలుపు మేరకు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించే టిడిపి నాయకులపై కూడా ఉంది .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp