బాబుపై దాడి... క‌డ‌ప గూండాల ప‌ని కాదు క‌దా?

By Sodum Ramana Nov. 29, 2019, 08:17 am IST
బాబుపై దాడి... క‌డ‌ప గూండాల ప‌ని కాదు క‌దా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ అసాంఘిక కార్య‌క్ర‌మం జ‌రిగినా, గొడ‌వ‌లైనా....టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లుకుని, ఆ పార్టీ శ్రేణుల నోటి వెంట వ‌చ్చేది రాయ‌ల‌సీమ‌, క‌డ‌ప‌, పులివెందుల గూండాల‌ ప‌నేన‌ని. తునిలో రైలు త‌గ‌ల‌బ‌డితే...నాటి ముఖ్య‌మంత్రి ఎలాంటి ఆధారాలు లేకుండానే "ఇది క‌డ‌ప నుంచి వ‌చ్చిన రౌడీల ప‌నే" అని నిర్ధారించాడు. "పులివెందుల పంచాయితీ" అనే మాటను రామ‌జ‌పం చేసిన‌ట్టు ప‌లుకుతుంటాడాయ‌న‌.

అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబుపై కొంత మంది రైతులు చెప్పులు, రాళ్ల‌తో దాడి చేశారు. వెంక‌ట‌పాలెంలో న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న తెలిపారు. పోలీసు చేతిలోని లాఠీని గుంజుకుని కాన్వాయ్‌పై దాడి చేయ‌గా, చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు అద్దం ప‌గిలింది. చంద్ర‌బాబు గోబ్యాక్ నినాదాలు మార్మోగాయి.

ఆ త‌ర్వాత చంద్ర‌బాబు విలేక‌రుల‌తో మాట్లాడుతూ వెంకటపాలెంలో తనను అడ్డుకున్నది రాజధాని రైతులు కాదని వైసీపీవారు బయట నుంచి తీసుకొచ్చిన కిరాయి రౌడీలని విమర్శించాడు. ఇలాంటి నీచమైన పనులు చేయడం వారికి అలవాటేనని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఎందుక‌నో రాయ‌ల‌సీమ‌, క‌డ‌ప‌, పులివెందుల నుంచి వ‌చ్చిన కిరాయి రౌడీలే త‌న‌పై చెప్పులు, రాళ్ల‌తో దాడి చేశార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించ‌డం మ‌రిచిపోయిన‌ట్టున్నాడు. ఇలాంటి ప‌నుల‌ను సుకుమార మ‌న‌సులైన, మంచిత‌నానికి, మాన‌వ‌త్వానికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మైన‌ కోస్తావారు ఎట్టి ప‌రిస్థితుల్లో చేయ‌ర‌ని ఆయ‌న అల‌వాటుగా అన‌డం మ‌రిచిన‌ట్టున్నాడు.

ప‌దేప‌దే జ‌గ‌న్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతీయుల‌ను గూండాలుగా, ఖూనీకోరులుగా చిత్రీక‌రించ‌డం వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దాగున్నాయ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌డ‌ప జిల్లాకు చెందిన జ‌గ‌న్ పార్టీకి ఓట్లు వేస్తే రౌడీల‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్టేన‌నే భ‌యాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డం ద్వారా అంతిమంగా తాను రాజ‌కీయ ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు ఎత్తుగ‌డ వేశాడు.

అయితే వైఎస్సార్‌పై కూడా ఇదే ర‌క‌మైన ఎత్తుగ‌డ వేసిన బాబు అనుకున్న‌ల‌క్ష్యాన్నిసాధించ‌లేక‌పోయాడు. ఇప్పుడు వైఎస్సార్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌టికొచ్చి సొంతంగా వైసీపీని పెట్టుకున్న త‌ర్వాత‌, అత‌నిపై వ్య‌క్తిగ‌త దాడిని తీవ్ర‌త‌రం చేశారు. గ‌త రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను అవినీతిప‌రుడిగా, రౌడీగా, దౌర్జ‌న్య‌కారుడిగా ప్ర‌జ‌ల ముందు నిలిపి, తాను మ‌రోసారి సీఎం పీఠంపై కొన‌సాగాల‌నే ఎత్తుల‌ను ప్ర‌జ‌లు రెండోసారి చిత్తుచేశారు.

అధికారం నుంచి దిగిపోయిన‌ప్ప‌టికీ పులివెందుల పంచాయ‌తీ అని అన‌డం మాత్రం చంద్ర‌బాబు మాన‌లేదు. ఇప్పుడు రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో త‌న‌పై చెప్పులు, రాళ్లు విసిరిన వారు కూడా పులివెందుల‌, క‌డ‌ప నుంచి వ‌చ్చిన కిరాయి రౌడీమూక‌ల‌ని ఎందుకు చెప్ప‌లేదో అర్థం కావ‌డం లేదు. ప‌దేప‌దే ఆ మాట అంటుండ‌టం వ‌ల్ల ఇటు కోస్తాలో ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌క‌పోగా, రాయ‌లసీమ‌లో భారీ న‌ష్టం జ‌రుగుతోంద‌నే ఆందోళ‌న‌తో మ‌న‌సు మార్చుకున్నారా? అనే అనుమానం త‌లెత్తుతోంది. కార‌ణాలేవైనా జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా విమ‌ర్శిస్తే ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ జ‌గ‌న్‌ను సాకుగా చూపి రాయ‌ల‌సీమ‌, క‌డ‌ప‌, పులివెందుల వాసుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడితే మాత్రం టీడీపీ శాశ్వ‌తంగా అక్క‌డి ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని చ‌వి చూడాల్సి వుంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp