మా పార్టీ 'నేరస్థుడి'కి ఓటేయ్యండి !

By Rishi K Nov. 27, 2020, 06:15 pm IST
మా పార్టీ 'నేరస్థుడి'కి ఓటేయ్యండి !

ఎన్నికలొచ్చాయంటే వంగి వంగి దండాలు పెట్టే నేతలు వందలాది మంది తారసపడతారు. నిజాయితీకి మేము నిలువెత్తు రూపమని ప్రకటించుకుంటారు. మంచితనానికి మారుపేరని చాటింపు వేస్తారు. ఇక అవినీతి రహిత పాలన, ప్రజా సంక్షేమం లాంటి నినాదాలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడూ అంతే. గ్రేటర్ ఎన్నికల్లో నీతివంతమైన పాలన అందిస్తామనే హామీతోనే అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలవద్దకు వెళ్తున్నాయి. కానీ... ఆ పార్టీల తరుపున పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను మాత్రం ఎక్కడా బహిరంగం చేయట్లేదు. చట్టసభల్లోకి అడుగుపెడుతున్న మన నేతలంతా ఎంత మంచోళ్లంటే నేరారోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరిగేంత. అయినా సరే... మేమే నీతివంతులమంటే, మేమే నీతివంతులమని ప్రతి పాలకపార్టీ చెప్పుకుంటుంది.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం 4 శాతం మందికి నేర చరిత్ర ఉంది. 150 డివిజన్లలో మొత్తం 1122 మంది పోటీపడుతుండగా వారిలో మొత్తం 49 మందికి నేర చరిత్ర ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. వీరిపై మొత్తం 96 కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య గత ఎన్నికలతో పోల్చుకుంటే కాస్త తక్కువనే చెప్పాలి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 72 మందికి నేర చరిత్ర ఉండగా ఈ సారి ఆ సంఖ్య 49కి చేరింది. ఇక నేర చరిత్ర గల అభ్యర్థులు అత్యధికంగా బీజేపీలో ఉండడం గమనార్హం.

బీజేపీ 17 మంది నేర చరిత్ర గలవారిని పోటీకి నిలబెట్టింది. టీఆర్ఎస్ 13 మంది, కాంగ్రెస్ 12 మంది, ఎంఐఎం ఏడుగురు నేర చరిత్రగల వారికి అవకాశం ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 4859 మంది ప్రజా ప్రతినిధులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 143 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 132 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులను సత్వరమే విచారించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం విధించాలన్న వాదనకూడా బలంగా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా చట్టసభలకు ఎన్నికయ్యేవారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పార్టీలు అదే నిర్లిప్తతను ప్రదర్శిస్తుండడం గమనార్హం. నేర చరిత్ర గలవారిని అభ్యర్థులుగా ప్రకటించి నిసిగ్గుగా ఓట్ల కోసం జనం ముందుకు వెళ్తున్నాయి.

నీతివంతమైన పాలనగురించి పదేపదే చెప్పుకునే పార్టీలు నేరస్థులను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఏ అధికారం లేకుండానే ప్రజల అవసరాల్ని క్యాష్ చేసుకునే నాయకులు గల్లీగల్లీకి తారసపడతుంటారు. ఇక అలాంటి వాళ్లకు అధికారాల్ని ప్రజల ప్రయోజనాల్ని తాకట్టుపెట్టడమే. అలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలే వాళ్లను తమ ప్రతినిధులుగా ప్రజల మీదకు వదులుతుండడం విషాదం. గ్రేటర్ ఎన్నికల్లో అలాంటి వేరు వేరు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటునున్న 49 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి వాళ్లను ఓటర్లు గట్టె్క్కిస్తారో, ఇంటికి పంపిస్తారో చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp