మఠాధిపతులు యడ్యూరప్ప పదవిని నిలపగలరా ?

By Ramana.Damara Singh Jul. 21, 2021, 08:30 pm IST
మఠాధిపతులు యడ్యూరప్ప పదవిని నిలపగలరా ?

కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న యడ్యూరప్ప ను గౌరవప్రదంగా సాగనంపేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన రాజీనామాకు సమయం ఆసన్నమైందని భావిస్తున్న యడ్యూరప్ప ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన చర్యలు సూచిస్తున్నాయి. మరోవైపు పదవిని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా మఠాధిపతులను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వేర్వేరు మఠాలకు చెందిన అధిపతులు బెంగళూరు చేరుకొని యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేయడం విశేషం.

యడ్యూరప్పను కొనసాగించాల్సిందే..

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను కొనసాగించాలని రాష్ట్రానికి చెందిన 30 మంది మఠాధిపతులు డిమాండ్ చేశారు. వేర్వేరు మఠాలకు చెందిన వీరందరూ బెంగళూరుకు వచ్చి సీఎం అధికార నివాసంలో యడ్యూరప్ప తో సమావేశమయ్యారు. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, సీఎం మార్పు యత్నాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.

దక్షిణ భారత దేశంలో బీజేపీ పాలనకు బీజం వేసిన యడ్డీని తప్పిస్తే రాష్ట్రంలో బీజేపీ పతనం అవుతుందని హెచ్చరించారు. ఆ మేరకు ఆ పార్టీ రాష్ట్రనేతలకు సమాచారం పంపారు. కర్ణాటక రాజకీయాల్లో మఠాలు ప్రముఖ పాత్ర పోషించడం కొత్త కాదు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి.. ఎవరిని సీఎం చేయాలన్న విషయాల్లో వీరి సలహాలు, సూచనలు అటు ప్రజలను, ఇటు పార్టీలను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే నాయకులు మఠాల ప్రాపకం కోసం పాకులాడుతుంటారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా తన పదవిని కాపాడుకునేందుకు చివరి అస్త్రంగా మఠాధిపతులను తెరపైకి తెచ్చారు.

Also Read : పెగాసస్‌ నిఘా.. నెక్ట్స్‌ ఏంటి..?

26న ఏం జరుగుతుందో?

ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీ వెళ్లిన యడ్యూరప్ప ప్రధాని మోదీ సహా అమిత్ షా, జె.పి.నడ్డా, రాజనాథ్ సింగులను కలిసి మంతనాలు జరిపారు. ఈ చర్చల్లో యడ్డీ రాజీనామా అంశమే ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన యడ్యూరప్పపై పార్టీ అగ్రనేతలకు గౌరవభావం ఉంది. కానీ నాయకత్వ మార్పు తప్పనిసరి అని భావిస్తున్నందున.. గౌరవంగా సీఎం పదవిని వీడే అవకాశాన్ని ఆయనకు కల్పించారు. ఈ నెల 25 నాటికి యడ్యూరప్ప సీఎం పదవి చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతాయి. అంతవరకు ఆయనకు వెసులుబాటు కల్పించారు. రాజీనామా చేయమని పార్టీ నాయకత్వం తనను కోరలేదని ఒకవైపు చెబుతున్న యడ్యూరప్ప మరోవైపు దానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రెండు రోజుల క్రితం తన సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలకు విందు ఇచ్చి అంతరంగిక చర్చలు జరిపారు. అలాగే ఈ నెల 23న తన సొంత జిల్లా శివమొగ్గకు వెళ్లనున్న ఆయన అక్కడ కూడా విందు ఏర్పాటు చేశారు. శంకుస్థాపనలు వంటి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వీటన్నింటికీ మించి ఈ నెల 26న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుకు ఆదేశించారు. ఆ సమావేశంలోనే యడ్డీ తన రాజీనామాను ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రోజు కాకపోతే ఆషాడ మాసం ముగిసిన వెంటనే ఆగస్టు ఎనిమిదో తేదీన ప్రకటించవచ్చని అంటున్నారు. మరి మఠాధిపతుల మాటలను బీజేపీ నాయకత్వం మన్నిస్తుందా లేక నాయకత్వం మాటలనే యడ్యూరప్ప మన్నించాల్సి వస్తుందా అన్నది బహుశా ఈ నెల 26న తేలిపోవచ్చు.

Also Read : సాధారణ టీచర్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp