సిద్ధూ సాధించారు.. కెప్టెన్ ఏం చేస్తారో?

By Ramana.Damara Singh Jul. 20, 2021, 10:15 am IST
సిద్ధూ సాధించారు.. కెప్టెన్ ఏం చేస్తారో?

మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ అసమ్మతి నేత నవజ్యోత్ సిద్ధూ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. కానీ దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గత రెండేళ్లుగా సిద్దూ, అమరీందర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు రాజుకున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి మరింత పెరిగాయి.

ఆ కారణంతోనే సిద్దూకు పీసీసీ పగ్గాలు దక్కకుండా అన్ని మార్గాల్లోనూ అడ్డుకునేందుకు సీఎం అమరీందర్ ప్రయత్నించారు. ఒక విధంగా అధినేత్రి సోనియాగాంధీని బెదిరించినంత పని చేశారు. అయితే ఒత్తిళ్లు, అభ్యంతరాలను పార్టీ అధిష్టానం బేఖాతరు చేసింది. నవజ్యోత్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

మౌనం వెనుక వ్యూహం ఉందా..

పీసీసీ పగ్గాలు అందుకున్న సిద్ధూ ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అమరీందర్ శిబిరంలో స్తబ్దత నెలకొంది. పార్టీ అధిష్టానం తన అభ్యంతరాలను పట్టించుకోకపోవడం పట్ల అమరీందర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ముందు ముందు ఆయన ఏం చేయబోతున్నారు.. సిద్ధూతో ఎలా వ్యవరిస్తారన్న ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.

రెండేళ్లుగా ఉన్న వైరాన్ని వీడి వీరిద్దరూ కలిసి పనిచేస్తారన్న నమ్మకం కార్యకర్తలకు కలగడం లేదు. మంత్రి పదవిని వీడినప్పటి నుంచి సిద్ధూ సీఎం అమరీందర్ కు వ్యతిరేకంగా అసమ్మతిని రాజేస్తూ వచ్చారు. కరెంట్ కోతలు, ఉచిత విద్యుత్ వంటి అంశాల్లో సొంత పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేందుకు వెనుకాడలేదు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు గత నెలన్నర రోజులుగా పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించింది. సిద్దూకు పీసీసీ పగ్గాలు ఇచ్చినా.. వచ్చే ఎన్నికల్లో అమరీందరే సీఎం అభ్యర్థిగా ఉండేలా వారం క్రితం రాజీ సూత్రం తెరపైకి తెచ్చింది. దానికి మొదట తలూపిన సీఎం.. ఆ వెంటనే మాట మార్చారు. అధిష్టానం తీరును తప్పు పడుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేల ద్వారా సిద్ధూకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయించినా.. చివరికి అధిష్టానం సిద్ధూ వైపే మొగ్గింది.

ఎన్నికల్లో కెప్టెనే ఆధారం

అసమ్మతి నేత సిద్ధూ పీసీసీ అధ్యక్షుడు కావడంతో వచ్చే ఎన్నికల్లో తన సీఎం అభ్యర్థిత్వానికి ఎక్కడ అడ్డు వస్తారోనన్న అనుమానం అమరీందర్ ను పీకుతోంది. అయితే సిద్ధూకు అంత సీన్ లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దూకుడు, మాట తూలడం సిద్ధూ నైజం అని.. అతనిపై పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఏమంత సానుకూలత లేదంటున్నారు. అదే సమయంలో అమరీందర్ కు పార్టీలో కింది స్థాయి నుంచి మంచి పట్టు ఉంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. ఆయన వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకోగలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోమారు ఆయన కెప్టెన్సీలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా ప్రస్తుతానికి సిద్ధూ తలనొప్పి నుంచి పార్టీని తప్పించేందుకే.. ఆయనకు పదవి పేరుతో పగ్గాలు వేశారని అభిప్రాయపడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp