అవసరానికో కొత్త నాయకుడు ఎమ్మెస్ రాజు

By Venkat G Sep. 21, 2021, 05:30 pm IST
అవసరానికో కొత్త నాయకుడు ఎమ్మెస్ రాజు

మూడేళ్ళ ముందు వరకు కొందరికి బలంగా కనపడిన తెలుగుదేశం మూడేళ్ళ తర్వాత మాత్రం ఆ కొందరికి కూడా బలహీనంగా కనపడుతుంది. ఆశించింది, కోరుకుంది అనుకున్నవి ఏ ఒక్కటి జరగకపోవడంతో పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. గట్టిగా మాట్లాడే నాయకత్వం లేదు, అండగా ఉండే నాయకత్వం లేదు, అవసరమైతే ఆదుకునే పరిస్థితులు లేవు... చెప్పలేక, చెప్పుకోలేక ఎన్నో కష్టాలు పడుతుంది పార్టీ. అన్నేళ్ల చరిత్ర ఉన్న పార్టీ దశాబ్ద రాజకీయ అనుభవం ఉన్న జగన్ చేతిలో ఇబ్బందులు పడుతుంది.

అది అలా ఉంచితే ఇప్పుడు టీడీపీకి కొందరి నుంచి మద్దతు లభిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్న నాయకత్వం ఇప్పుడు కాస్త హుషారుగా బయటకు వచ్చేస్తుంది. అందులో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు కూడా ఒకరు. పార్టీకి ఇప్పుడు తన వంతుగా బలమైన గొంతుక వినిపిస్తున్నారు. మంత్రులు ఎవరు చంద్రబాబు నాయుడు ని తిట్టినా ఆయన నుంచి ఘాటు సమాధానం ఉంటుంది. ఇటీవల రమ్య ఘటన తర్వాత కొందరు వైసీపీ నేతలు లోకేష్ పై విమర్శలు చేస్తే ఆయన బూతుల మంత్రం తో ముందుకు వచ్చారు.

Also Read : చంద్రబాబు వాకిట్లో పవనన్న పార్టీ, పశ్చిమలో ప్రస్ఫుటమైన తీరు

అలాగే మరికొన్ని సందర్భాల్లో కూడా పార్టీ అధిష్టానానికి అండగా నిలబడుతున్నారు. దళితుల్లో పార్టీ పట్టు చేజారినా సరే ఆయనకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తూ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు టీడీపీకి మాదిగ సామాజిక వర్గం అండగా నిలబడింది. ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి ఎమ్మెస్ రాజు ముందుకు వస్తున్నారు. జగన్ ప్రభావం మొదలైన తర్వాత అనేక లెక్కలు వేసుకున్న ఆ సామాజిక వర్గం వైసీపీ వైపు నమ్మకంగా అడుగులు వేస్తూ వచ్చింది. దీనితో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు దూరమైంది.

అయితే టీడీపీకి ఆ సామాజిక వర్గంలో కడియం శ్రీహరి తర్వాత ఆ రేంజ్ లో బలమైన నాయకత్వం కనపడలేదు. దీనితో చాలా మంది అందులో సైలెంట్ అయిపోయారు. వర్ల రామయ్య లాంటి వాళ్ళు ఉన్నా సరే ప్రజలతో వాళ్లకు దగ్గరి సంబంధాలు చాలా తక్కువ. ఇక ఇప్పుడు ఎమ్మెస్ రాజు యువతను కూడా చాలా బాగా ఆకట్టుకునే విధంగా ప్రసంగిస్తున్నారు అనే పేరు తెచ్చుకున్నారు. కీలక నాయకత్వంతో ఆయన దగ్గరగా మసులుతున్నారు. లోకేష్ కు కూడా అందుబాటులో ఉంటున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Also Read:హెరాయిన్ కేసులో నిందితుడు సుధాకర్ ఎవరు?అతని వెనక ఎవరున్నారు?

అయితే ఇక్కడ చంద్రబాబు వైఖరిపైనే కొందరిలో అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి తనకు ఉపయోగపడిన వాళ్లకు ఉపయోగపడటం లో చంద్రబాబుది వెనుకడుగు. అవసరం ఉన్నంత వరకు పక్కన కుర్చీ వేసే చంద్రబాబు తర్వాత ఎక్కడ ఉంచుతారో కూడా తెలియని పరిస్థితి. రాయలసీమ జిల్లాలకు చెందిన ఆయనను బలంగా ప్రోత్సహిస్తే మాత్రం పార్టీ అధిష్టానానికి మాదిగ సామాజిక వర్గంలో బలమైన నాయకుడు ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న తరుణంలో ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి. ఇప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళను కూడా గుర్తు పెట్టుకుని కాపాడుకోలేకపోతే మాత్రం ఇంతకంటే దారుణంగా ఆ పార్టీ పరిస్థితి ఉంటుంది.

Also Read : టార్గెట్ కుప్పం అసెంబ్లీ.. టీడీపీలో టెన్షన్ టెన్షన్...!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp