రాజకీయాలకు కిడారి శ్రావణ్ సెలవు!

By Ramana.Damara Singh Jun. 23, 2021, 06:14 pm IST
రాజకీయాలకు కిడారి శ్రావణ్ సెలవు!

రాజకీయ ఓనమాలు తెలియకుండానే నాయకుడయ్యారు. చట్టసభల మెట్లు ఎక్కకుండానే.. మంత్రిగా సచివాలయంలోకి అడుగుపెట్టారు. సముద్రపు అల ఎంత వేగంగా పైకి ఎగుస్తుందో.. అంతే వేగంగా పడిపోతుందన్నట్లు.. ఆయన రాజకీయ గ్రాఫ్ కూడా అలాగే ఎగిసి.. పడిపోయింది. ఆయనే అత్యంత పిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్. విధిలేని పరిస్థితుల్లో ఆరు నెలలకే మంత్రి పదవి కోల్పోయిన శ్రావణ్.. ఎన్నికల్లోనూ ఓటమిపాలై.. ప్రస్తుతం దాదాపుగా తెరమరుగయ్యారు.

తండ్రి హత్యతో రాజకీయాల్లోకి

శ్రావణ్ కుమార్ తండ్రి కిడారి సర్వేశ్వర రావు వైఎస్సార్సీపీలో ఉండేవారు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో అప్పటి పాలక పక్షం టీడీపీ పన్నిన ఆకర్షణ వలలో చిక్కుకొని ఆ పార్టీలోకి ఫిరాయించారు. 2018 సెప్టెంబర్ 23న నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో గాయపడి మరణించారు. దాంతో ఐఐటీ పూర్తి చేసి ఢిల్లీలో ఉంటున్న దివంగత కిడారి తనయుడు శ్రావణ్ కుమార్ను అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కూడా కాకుండానే 2018 నవంబర్ 11న మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాల్సి ఉంది. కానీ అప్పటికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోపే గడువు ఉండటం వల్ల నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక నిర్వహించడానికి అవకాశం లేదు. పోనీ ఎమ్మెల్సీ అవుతారనుకుంటే ఆ సమయంలో విధాన మండలిలో ఖాళీలు లేవు. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో శ్రావణ్ అరకు నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల ఫలితాలు 2019 మే 23న రావాల్సి ఉండగా.. దానికి 13 రోజుల ముందే మే 10న ఆరునెలల గడువు ముగిసినా చట్టసభ సభ్యుడు కానందున కిడారి మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాల్లోనూ ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మూడో స్థానానికి పడిపోగా.. శ్రావణ్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

పట్టించుకోని పార్టీ, క్యాడర్

రాష్ట్రంలో టీడీపీ, అరకులో తాను దారుణంగా ఓడిపోవడంతో శ్రావణ్ రాజకీయంగా అయోమయంలో పడిపోయారు. కొన్నాళ్ళు మౌనంగా ఉండిపోయారు. తర్వాత బయటకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. పార్టీ అధినేత కిడారిని నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించినా ఆ తర్వాత పట్టించుకువడం మానేశారు. రాజకీయంగా అనుభవ శూన్యుడైన అతనికి పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సూచనలిచ్చి సహకరించేవారే లేకుండా పోయారు. జిల్లా, నియోజకవర్గ నేతలు.. చివరికి కార్యకర్తలు సైతం కిడారి ఉనికిని పట్టించుకోవడం మానేశారు. మరోవైపు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దన్నుతో దూసుకుపోతున్నారు. పార్టీ సహకారం లేని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ దూకుడును తట్టుకొని ముందుకెళ్లడం కష్టమని భావించిన శ్రావణ్ కొన్ని నెలలుగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారా..లేరా అన్నట్లుంది పరిస్థితి. ఆయన ఉన్నా లేనట్లేనని కొందరు స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రెకి దారెటు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp